టిటిడి పదవుల్లో సామాజిక కోణం…టిడిపి సరికొత్త ప్రచారం..!

జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి సామాజిక కోణాన్ని ముందుకు తెస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ…ఇప్పుడు ప్రతిష్ఠాత్మక టిటిడి పదవుల విషయంలోనూ ఇదే అంశాన్ని తెరపైకి తెస్తోంది. టిటిడిలో కీలక పదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికే కట్డబెడుతున్నారన్న ప్రచాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రారంభించింది. టిటిడి ఈవోగా జవహర్ రెడ్డిని నియమించిన నేపథ్యంలో ఈ ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుంది.

ఇప్పటికే‌ టిటిడి ఛైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అదనపు ఈవోగా ధర్మారెడ్డి పని చేస్తున్నారు.‌ ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేసి, ఆస్థానంలో జవహర్ రెడ్డిని నియమించింది. ఇదే టిడిపికి ప్రచార అస్త్రంగా మారింది. టిటిడిలో మూడు ప్రధాన పదవులుంటే… మూడింటినీ రెడ్డి సామాజిక తరగతికే కేటాయించారని, ఇదేనా సామాజిక న్యాయం అని ప్రశ్నిస్తోంది. తమ హయాంలో ఛూర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీనివాసరాజు ముగ్గురూ మూడు‌ సామాజిక తరగతులకు చెందిన వారని చెబుతోంది.‌ ఇప్పుడు మాత్రం అన్ని పదవులు ఒకే సామాజిక తరగతికి కేటాయించారని విమర్శొస్తోంది.

ఇదిలావుండగా…ఇదే సమయంలో టిటిడి ఉన్నత పదవుల్లో దళితులు, గిరిజనులను నియమించాలంటూ కొన్ని సంఘాలు తిరుపతిలో ఆందోళన చేపట్టాయి. టిటిడి ఏర్పడిన ఇన్నేళ్లలో ఒకసారి కూడా దళితులను ఈవోగా ఛైర్మన్ గా నియమించకపోవడం వివక్షేనని ఆ సంఘాల నాయకులు విమర్శస్తున్నారు.

టిటిడి పదవుల్లో దళితులను నియమిస్తారా నియమించరా అనే సంగతి పక్కనపెడితే… మూడు కీలక పదవుల్లోనూ రెడ్డి సామాజిక తరగతి వారినే నియమించడాన్ని ఎత్తిచూపడం ద్వారా లబ్ధిపొందాలన్నది టిడిపి ఎత్తుగడ. ఈ నేపథ్యంలో కొద్దిగా ఆలస్యంగానైనా టిటిడి పదవుల్లో మార్పులు జరగవచ్చని, ఈసారి నియామకంలో ఇతర సామాజిక తరగతికి చెందిన వ్యక్తికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది.

  • ఆదిమూలం శేఖర్, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*