టిటిడి పాలక మండలి…వారంలో ఏర్పాటు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి నియామకం జరిగి నెలపైబడినా ఇప్పటిదాకా సభ్యుల నియామకం జరగలేదు. ఇదిగో అదిగో అంటున్నా అనేక కారణాల రీత్యా వాయిదాపడుతూ వస్తోంది. ఛైర్మన్‌ నియమితులైన ఒకటి రెండు రోజుల్లోనే సభ్యులనూ నియమిస్తారన్న ప్రచారం జరిగింది.

ప్రతిష్టాత్మక టిటిడి ట్రస్టుబోర్డుకు సంబంధించి…ఛైర్మన్‌తో పాటు సభ్యుల పదవులకూ తీవ్రమైన పోటీవుంటుంది. ఛైర్మన్‌ పదవి ఏకంగా ముఖ్యమంత్రి బాబాయి అయిన వైవి సుబ్బారెడ్డిని వరించడంతో….ఇక ఆ పోస్టు కోసం ఎవరూ పోటీపడలేదు. సభ్యుల పదవులకు మాత్రం తీవ్రమైన పోటీవుంది. వేలాది దరఖాస్తులు అందినట్లు చెబుతున్నారు. అయినా….వీటి వడపోత కాస్త కష్టమే అయినా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

పదవులు ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో ఎవరిలోనూ అసంతృప్తి రేగకుండా అందరనీ సముదాయించి పదవులు ఇవ్వాల్సివుటుంది. ఈ కసరత్తుకు కాస్త సమయం పట్టింది. ఇంతలోపు ఆషాఢ మాసం వచ్చేసింది. ఈ మాసంలో శుభకార్యాలు చేయడానికి ఎవరూ ఇష్టపడరు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. బడ్జెట్‌ సమావేశాలు కావడంతో ముఖ్యమంత్రి తన దృష్టినంతా వాటిపైనే పెట్టారు. ఆ వెంటనే జరుసలాం వెళ్లారు. వచ్చిన వెంటనే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇలాంటి కారణాలతో బోర్డు సభ్యుల నియామకంలో జాప్యం జరుగుతోంది.

పూర్తిస్థాయి బోర్డు ఏర్పాటు కాకపోవడంతో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఏ నిర్ణయం గురించి అడిగినా…బోర్డు ఏర్పాటు కాగానే చర్చించి తీర్మానం చేస్తామని ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి చెబుతూ వస్తున్నారు. సత్వరం బోర్డు సభ్యుల నియామకం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయం సిఎం దృష్టికి కూడా వెళ్లింది.

ఈ క్రమంలో ఈ వారంలోనే పూర్తిస్థాయి బోర్డు ఏర్పాటు కావచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఈనెల 14 – 16 తేదీల్లో దీనికి సంబంధించిన జీవో వెలువడుతుందని అమరావతి వర్గాల సమాచారం. ఎట్టిపరిస్థిల్లోనూ ఇక జాప్యం జరగకపోవచ్చని చెబుతున్నారు. సభ్యులుగా ఎంపికైన వారికి ఇప్పటికే సూచనప్రాయంగా సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది.

ఇక బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా ఛైర్మన్‌తో పాటు 26 మంది ఉండొచ్చని అంటున్నారు. తుడ ఛైర్మన్‌గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని బోర్డులో ఎక్స్‌అఫిసియో సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఎస్‌విబిసి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సినీనటుడు పృథ్వీరాజ్‌ కూడా బోర్డు సభ్యునిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే…గతంలో ఈ పదవిలో ఉన్న దర్శకుడు రాఘవేంద్రరావు ఆహ్వానితునిగా టిటిడి బోర్డు సమావేశాలకు హాజరయ్యేవారు.

  • ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం వారపత్రిక

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*