టిటిడి ప్రతిష్ట దిగజార్చేందుకు మరో కుట్ర..!

తిరుమల‌ తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చడం కోసం, వివాదం‌ సృష్టించి లబ్ధిపొందడం కోసం కొన్ని‌ శక్తులు నిరంతరాయంగా ప్రయత్నిస్తూనే‌ ఉన్నాయి. తాజాగా టిటిడి మాసపత్రిక సప్తగిరితో పాటు మరో మతా‌నికి చెందిన పత్రిక బడ్వాడా కావడం వివాదాస్పదమయింది. గుటూరుకు చెందిన ఓ భక్తునికి సప్తగిరి మాసపత్రికతో పాటు క్రైస్తవ మతానికి చెందిన పత్రిక కూడా పోస్టు ద్వారా చేరింది.‌ సప్తగిరి పత్రిక కవర్ లోకి మరో పత్రిక ఎలా చేరిందన్నది ప్రశ్న. ఎవరో ఉద్దేశపూర్వ కంగానే ఇలా చేశారని భావిస్తున్నారు. ఆ పాఠకుడికి మాత్రమే అలా చేరిందా… ఎంతమందికి చేరిందనేది తేలాల్సివుంది.

ఇదిలావుండగా ఈ ఉదంతంపై‌ టిటిడి స్పందించింది. ఓ ప్రకడన విడుదల చేసింది.
‘స‌ప్త‌గిరి మాస ప‌త్రిక బ‌ట్వాడ సందర్భంగా గుంటూరుకు చెందిన ఒక పాఠ‌కుడికి స‌ప్త‌గిరితో పాటు అన్య‌మ‌తానికి చెందిన మ‌రో పుస్త‌కం బ‌ట్వాడా అయిన‌ట్లు మాదృష్టికి వ‌చ్చింది. టిటిడి ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీయ‌డానికి కొంత మంది చేసిన చ‌ర్య‌గా భావించి దీనిపై నిజాల‌ను నిగ్గుతేల్చేందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. స‌ప్త‌గిరి మాస ప‌త్రిక‌ల‌ను పోస్ట‌ల్ శాఖ వారే ప్యాక్ చేసి, బ‌రువు చూసి పాఠ‌కుడి చిరునామాలు అతికించి బ‌ట్వాడ చేస్తారు. ఇందుకోసం పోస్ట‌ల్ శాఖ‌కు పోస్టేజి చార్జీల‌తో పాటు ఒక్కో ప్ర‌తికి అద‌నంగా రూ. 1.05 టిటిడి అద‌నంగా చెల్లిస్తోంది. పోస్ట‌ల్ శాఖ స‌ప్త‌గిరి మాస పత్రిక‌ను బుక్ పోస్టులో పంపుతుంది క‌నుక ఎలాంటి సీలు ఉండ‌దు. స‌ప్త‌గిరి మాస ప‌త్రిక ప్యాకింగ్, డెలివ‌రి భాధ్య‌త మొత్తం పోస్ట‌ల్ శాఖ‌వారే చూస్తారు. ఈ విష‌యంగా ప‌లు జిల్లాల‌కు చెందిన స‌ప్త‌గిరి పాఠ‌కుల‌కు ఫోన్ చేసి విచారించ‌గా అలాంటి అన్య‌మ‌త పుస్త‌కం త‌మ‌కు అంద‌లేద‌ని తెలియ‌జేశారు. దీనిని దురుద్యేశ చ‌ర్య‌గా భావిస్తూ టిటిడి తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది.’ అని‌ టిటిడి తన ప్రకటనలో పేర్కొంది.

ఇదిలావుండగా…వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి టిటిడిని లక్ష్యంగా చేసుకుని కొందరు అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల కొండపై‌‌ శిలువ నిర్మించారని కొన్నాళ్లు, తిరుమల బస్సు టికెట్ల వెనుక జరూసలేం‌ యాత్ర ప్రకటనలు ఉన్నాయని కొన్నాళ్లు, టిటిడి వెబ్ సైట్ లో ఏసయ్య అని ఉందని ఒక ప్రచారం, శ్రీవారి ఆస్తులు‌ అమ్మేస్తున్నారని హడావుడి, మొన్న‌ సప్తగిరి పత్రికలో రాముడి గురించి తప్పుడు కథనం ప్రచురించారని ఒక వివాదం….ఇలా ఒకదాని వెనుక ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సప్తగిరి పత్రికతో పాటు క్రైస్తవానికి చెందిన మరో పత్రికను పంపి‌‌ అలజడి రేపేందుకు ప్రయత్నం.

మతపరంగా అత్యంత సున్నితమైన తిరుపతిలో అలజడ సృష్టించి లబ్ధిపొందాలని కాచుకుని కూర్చున్న‌ శక్తులు ఇటువంటి‌ దుశ్చర్యలకు పాల్పడు తున్నాయి. వాస్తవంగా వైసిపి అధికారంలోకి‌ రాక మునుపు‌ అన్యమత ఉద్యోగుల పేరుతో పెద్ద వివాదం రాజేసే ప్రయత్నం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక… ఈ‌ కుతంత్రాలు మరింత తీవ్రమయ్యాయి. ప్రభుత్వమే ఇదంతా చేయిస్తోందన్న ప్రచారానికీ ఒడిగడుతున్నారు. టిటిడి, ప్రభుత్వం ఇటువంటి దుష్ట శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉంది. – ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

1 Comment

  1. మరీ ఇంత దుర్మార్గపు పనులా.ఛీ

Leave a Reply

Your email address will not be published.


*