టిటిడి బకాయిలపై తుడా ఆశలు…రూ.35 కోట్లపై మీనమేషాలు..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎక్కడెక్కడో కోట్లాది రూపాయలు కుమ్మరిస్తోంది. అడిగిన వారికి అడగని వారికి లేదనకుండా ఉదారంగా నిధులు ఇస్తోంది. అయితే తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)కు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వడానికి మనసు రావడం లేదు. తుడ అధికారులేమో టిటిడి నుంచి రావాల్సిన రూ.35 కోట్ల బకాయిల కోసం నిర్వరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

శ్రీవారి భక్తుల అవసరాల నిమిత్తం టిటిడి తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పెద్దపెద్ద వసతి సముదాయాలు నిర్మిస్తోంది. ఇంకా కార్యాలయాలు, విద్యాలయాలు, హాస్టళ్లు నిర్మిస్తోంది. తుడా నిబంధనల ప్రకారం ముందుగా అనుమతులు తీసుకున్న తరువాతే ఏ నిర్మాణమైనా చేపట్టాల్సి వుంటుంది. ఇందుకు ఫీజులు చెల్లించాలి. అదేవిధంగా డెవలప్‌మెంట్‌ ఛార్జీలు చెల్లించాల్సివుంటుంది.

అయితే…టిటిడి దశాబ్దాల తరబడి ఈ ఫీజులు చెల్లించడం లేదు. డెవలప్‌మెంట్‌ ఛార్జీల కింద రూ.2.40 కోట్లు, కాంపౌండ్‌ ఫీజు (ఇప్పటికే నిర్మించిన భవనాలకు అనుమతులు) కింద రూ.20.18 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలకు వడ్డీనే రూ.13.55 కోట్లు అయింది.

ఈ బకాయిలు చెల్లిచమని తుడా అధికారులు అనేక పర్యాయాలు టిటిడి అధికారులను, బోర్డు ఛైర్మన్లను సంప్రదించారు. అయితే…టిటిడికి ఇటువంటి ఛార్జీలేవీ వర్తించబోవంటూ బకాయిలు చెల్లించడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. ఇదో దీర్ఘకాలిక వివాదంగా మారింది. దీనిపై తుడా అధికారులు ప్రభుత్వాన్ని సంప్రదించారు. ప్రభుత్వం కూడా టిటిడికి తుడా ఫీజుల నుంచి మినహాయింపు లేదని స్పష్టత ఇచ్చింది.

ఈ క్రమంలో 2004లో టిటిడి రెండు పర్యాయాలుగా రూ.1.63 కోట్లు తుడాకు చెల్లించింది. ఇది తిరుపతిలో నిర్మించిన భవనాలకు మాత్రమే. తిరుమల్లోని నిర్మాణాలకు ఫీజులను అప్పుడు కూడా వాయిదా వేసింది. తిరుమల పంచాయతీని టిటిడి నిర్వహిస్తోందని కాబట్టి…ఇటువంటి ఫీజులేవీ తుడాకు చెల్లించాల్సిన అవసరం లేదని టిటిడి వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తుడా ఛైర్మన్‌గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మరోసారి ఈ బకాయిల గురించి టిటిడికి లేఖ రాశారు. సెప్టెంబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో చర్చించారుగానీ…బకాయిలు చెల్లించాలని నిర్ణయించలేదు. ఇకపై తిరుపతి పరిధిలో నిర్మించే నిర్మాణాలకు తుతా నుంచి అనుమతులు తీసుకోవాలని మాత్రమే సూచించారు.

ఇక్కడ ఆలోచించాల్సినది ఏమంటే….తుడాకు నిధుల ఆవశ్యత ఎంతగానో ఉంది. టిటిడి తన రూ.3000 కోట్ల వార్షిక బడ్జెట్‌లో తుడాకు ఇవ్వాల్సిన రూ.35 కోట్లు పెద్ద సమస్యకాదు. ఒకసారి ఈ బకాయిలు చెల్లించేస్తే….తరువాత ఎప్పటికప్పుడు నిర్మాణాలకు ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. టిటిడి ఫీజులు చెల్లిస్తే…..ఆ నిధులను తిరుపతిలోనే ఖర్చుచేసి అభివృద్ధి పనలు చేపట్టే అవకాశం ఉంటుంది. మరి టిటిడి ఎందుకో ఈ బకాయిల చెల్లింపుపై మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికైనా రూ.35 కోట్ల బకాయిలు చెల్లించి తిరుపతి అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరముంది.

  • ఆదిమూలం శేఖర్‌, ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*