టిటిడి బెరుకు…వెనకడుగు ఎందుకు..! పాలక మండలి నిర్ణయాల అమలుపై తడబాటు..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి తన నిర్ణయాలపై తానే తడబడుతోంది. చేసిన తీర్మానాలను అమలు చేయడంలో వెనుకంజ వేస్తోంది. మీడియాలో వచ్చే విమర్శలకు బెదిరి అదిరిపోతోంది. దీంతో మంచి నిర్ణయాలు కూడా అమలు కాకుండాపోతున్నాయి. ఫలితంగా తిరుమల శ్రీనివాసునికి నష్టం జరుగుతోంది.

టిటిడి నగదును అధిక వడ్డీ వచ్చే ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో పెట్టాలని చేసిన తీర్మానం నుంచి వెనక్కి తగ్గారు. శ్రీవారి సొమ్మును ప్రభుత్వ ఖజానాకు తరలించేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ఏమాత్రం ఔచిత్యం లేని రాద్దాంతం చేసే సరికి టిటిడి తన నిర్ణయాన్ని ఉపసంహరిం చుకుంది. టిటిడి డబ్బులు బ్యాంకుల్లో తప్ప ప్రభుత్వ సెక్యూరిటీల్లో డిపాజిట్‌ చేయడం లేదని ప్రకటించింది. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టడం వల్ల శ్రీవారికి అదనపు వడ్డీ వస్తుంది తప్ప నష్టం జరిగదు. (దీనిపైన ధర్మచక్రం ప్రత్యేక కథనాన్ని దీనికి ముందు పోస్టులో ప్రచురించింది). అయినా విమర్శలకు భయపడి వెనకడుగులు వేశారు.

టిటిడికి చెందిన, నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించాలని పాలక మండలి ఆ మధ్య ఒక తీర్మానం చేసింది. దీనిపైన ప్రభుత్వ వ్యతిరేక మీడియా..’స్వామివారి ఆస్తులు అమ్మేస్తున్నారు’ అంటూ గగ్గోలుపెట్టింది. దీంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. టిటిడి ఆస్తులేవీ అమ్మబోమని ప్రకటించారు. దీనివల్ల తిరుమలేశునికి నష్టం జరుగుతుందనే చెప్పాలి. ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని రక్షించుకోడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోంది. అటువంటి వాటిని అమ్మేసి నగదు ఖజానాలో సమచేసివుంటే మేలు జరిగేది. ఏవో రాజకీయ కారణాలతో ఎవరో విమర్శలు చేస్తే….టిటిడి వెనకడుగు వేసింది.

ఈ రెండు ఉదంతాలను చూస్తే…ఎందుకిలా జరుగుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. పాలక మండలిలో సమగ్రంగా చర్చించి, టిటిడికి ప్రయోజనకరంగా ఉంటుందని భావించి నిర్ణయం తీసుకున్నాక….అమల్లోకి వచ్చే సరికి ఎందుకు తటపటాయి స్తున్నారు. పాలక మండలి ఏ ఉద్దేశంతో నిర్ణయం తీసుఉందో ప్రజలకు వివరించాలి. అంతేగానీ విమర్శలకు భయపడి అమలును ఉపసంహరించుకుంటే ఎలా? దీనివల్ల టిటిడి ప్రతిష్ట దెబ్బతినదా?

టిటిడి కేంద్రంగా చేసుకుని రాజకీయం చేయాలన్న ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. టిటిడిపై వస్తున్న విమర్శల్లో చాలావరకు రాజకీయమైనవే. ఇది తెలిసి కూడా నిర్ణయాలను ఉపసంహరించుకుంటే ప్రజల్లోకి ఎటువంటి సందేశం వెళుతుంది? పాలక మండలి చేతకానితనంగా ముద్రపడదా? ఒకవేళ సున్నితమైన అంశాలనుకుంటే ఒకటికి పదిసార్లు చర్చించిన మీదటే తుది నిర్ణయం తీసుకోవాలి. అలా నిర్ణయం తీసుకున్నాక ఎన్ని విమర్శలొచ్చినా ముందడుగే వేయాలి. ఇలా చీటికి మాటికీ…వెనకడుగు వేస్తే పాలక మండలి తీసుకునే నిర్ణయాలపై భక్తులకు ఏమాత్రం గౌరవం ఉండదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

– ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*