టిటిడి బోర్డుపై జగన్‌ ఏం కామెంట్‌ చేశారో తెలుసా..?

టిటిడి బోర్డు ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన తరువాత కూడా రెండు నెలలు పాటు సభ్యులను నియమించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే…ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యలను గమనిస్తే అర్థమవుతుంది.

టిటిడి బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25కు పెంచుతూ బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గంలో ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి సరదాగానే కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఓ పత్రిక రాసింది. ‘నేను మంత్రివర్గం కూర్పు కోసం కూడా ఇంతగా కరసత్తు చేయలేదు. ఇంతగా కష్టపడలేదు. టిటిడి బోర్డులో స్థానం కోసం తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. పెద్ద కష్టమైపోయింది’ అని కామెంట్‌ చేశారట.

టిటిడి బోర్డులో స్థానం దక్కించుకోవడం కోసం వేల మంది ప్రయత్నించారు. రెండు వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. అదీ ప్రజాప్రతినిధులే కాకుండా…బడాబడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ఈ పదవులను ఆశిస్తున్నారు. అదేవిధంగా తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒత్తిడి ఉంది. ఇక ఢిల్లీ నుంచి కూడా సిఫార్సులు వచ్చాయి.

ఈ పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలో, ఎవరిని కాదనాలో తెలియని పరిస్థితి. ఇంతమంది నుంచి 25 మందిని ఎంపిక చేయడం, పదవులురాని వారు అసంతృప్తికి లోనుకాకుండా చూడటం తలనొప్పి వ్యవహారమే. ఈ కారణంగానే బోర్డు సభ్యుల నియామకంలో ఇంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఒత్తిడిని కాస్తయినా తట్టుకోవడం కోసమే బోర్డు సభ్యుల సంఖ్యను ఒకేసారి 19 నుంచి 25కు పెంచారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*