టిటిడి బోర్డు నుంచి మేడా రామకృష్ణారెడ్డిని తప్పిస్తే పెద్ద తప్పిదమే…!

రాజంపేట శాసన సభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి, వైసిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టిడిపి పాలక మండలి సభ్యునిగా ఉన్న ఆయన తండ్రి మేడా రామకృష్ణారెడ్డిని ఆ పదవి నుంచి తొలగిస్తా…కొనసాగిస్తారా అనే చర్చ జరుగుతోంది.

టిటిడి పాలక మండలి పదవులు రాజ్యాంగ పదవులు కావు. ఇది ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంబంధించిన పదవి. అసలు బోర్డు సభ్యులను రాజకీయ ప్రాతిపదికన నియకమించడంపైనే అభ్యంతరాలున్నాయి. ధర్మకర్తల మండలిలో రాజకీయ నాయకులను రాకుండా శ్రీవారి భక్తులను, హిందూమత గురువులను మాత్రమే నియమించాలని డిమాండ్‌ చేస్తున్నవారు ఉన్నాయి. అయితే…ఆచరణలో టిడిపి పాలక మండలి పదవులన్నీ రాజకీయ ప్రాతిపదికన భర్తీ అవుతున్నాయన్నమాట వాస్తవం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమ పార్టీ నేతలను, తమకు అనుకూలంగా ఉన్న పారిశ్రామిక, వ్యాపారవేత్తలను ధర్మకర్తల మండలిలో నియమిస్తున్నారు.

బోర్డు సభ్యుడైన మేడా రామకృష్ణారెడ్డి కుమారుడు మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ మారినంత మాత్రాన రామకృష్ణారెడ్డిని ఆ పదవి నుంచి తప్పించడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పని చేసినా, అనైతకి చర్యలకు పాల్పడినా….ఇటువంటి పదవుల నుంచి తప్పించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. గతంలో శేఖర్‌ రెడ్డి అనే బోర్డు సభ్యుడు పెద్ద నోట్ల వ్యవహారంలో పట్టుబడటంతో ఆయన్ను పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటువంటి చర్యను రామకృష్ణారెడ్డిపై తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ తీసుకుంటే ప్రభుత్వం తీవ్ర తప్పిదం చేసినట్లు అవుతుంది.

టిటిడి పాలక మండలి గడువును ఏడాదికి పరిమితం చేస్తూ జీవోలు ఇస్తున్నారు. ప్రస్తుత పాలక మండలికి సంబంధించి కూడా అటువంటి జీవోనే ఇచ్చారు. ఈ జీవో గడువు ముగియడానికి ఇంకా నాలుగైదు నెలలు ఉంది. అంటే అప్పటికి ఎన్నికలు పూర్తవుతాయి. అప్పుడు కొత్త ప్రభుత్వం బోర్డుపై నిర్ణయం తీసుకుంటుంది. టిడిపినే మళ్లీ అధికారంలోకి వచ్చి, ఇదే బోర్డును కొనసాగించాలనుకుంటే రామకృష్ణారెడ్డి పేరును తొలగించి జీవో ఇవ్వవచ్చు. టిడిపి ప్రభుత్వం ద్వారా వచ్చిన పదవి ఎందుకులే అనుకుంటే…రామకృష్ణారెడ్డి ఇప్పుడే రాజీనామా చేయవచ్చు. అంతేతప్ప ఆయన్ను ఉన్నఫలంగా తొలగించే అవకాశం లేదనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*