టిటిడి బోర్డు సభ్యులకు అంత తీరిక లేదా!

తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయమవుతన్నాయని, స్వామివారి ప్రసాదాల వంటశాలలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత నెల 14వ తేదీన సంచల ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి టిటిడి అధికారులు, అచ్చకులు, జియ్యర్లు, మాజీ అధికారులు ఎవరెవరో మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. పోటులో తవ్వకాలు జరగలేదని, ఆభరణాలన్నీ పకడ్బందీగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే….కనీసం పోటులో తవ్వకాలు ఏమైనా జరిగాయి, శ్రీవారి ఆభరణాలు ఉన్నాయా లేవా అని స్వయంగా పర్యవేక్షించాలని పాలక మండలి సభ్యులు అనుకోలేదు. ఈనెల 26న మరోసారి బోర్డు సమావేశం జరగనుంది. అప్పుడు ఆభరణాలను, పోటును పరిశీలించడానికి సమయం కేటాయిస్తామని సభ్యులు చెప్పినట్టు ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. దాదాపు నెల రోజుల నుంచి వివాదం నడుస్తున్నా….ఇప్పటిదాకా సభ్యులు ఎంతుకు స్వయంగా వెళ్లి పరిశీలన చేయలేదనేది ప్రశ్న. ఇప్పటికే ఆభరణాలను పరిశీలంచి, ఎలా భద్రపరుస్తున్నారో తెలుసుకుని, తమకు అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అన్నీ అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలన చేసివుంటే తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లు ఉండేది. బంగారు ఆభరణాల పరిశీలనలో ఏవైనా ఇబ్బందులు ఉంటేవుండొచ్చు…పోటును పరిశీలించడానికి ఇబ్బందులు ఏముంటాయి. అర్థగంట సమయం కేటాయించివుంటే…పోటును పరిశీలించివుండొచ్చు. తమ పరిశీలనలో గమనించిన అంశాలను మీడియాకు చెప్పివుండొచ్చు.

ధర్మకర్తల మండలిలోని సభ్యులంతా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు. ఎప్పుడూ బిజీగా ఉంటారు. బోర్డు సమావేశాలకు సమయం కేటాయించడమే ఎక్కువ. ఇక ఇటువంటి పరిశీలనకు సమయం కేటాయించడం కష్టమే. ఆభరణాలను పరిశీలించాలంటే కనీసం ఒకరోజైనా పడుతుంది. అంటే బోర్డు సమావేశానికంటే ఒకరోజు ముందుగా రావాలి. ఈనెల 26న బోర్డు సమావేశం ఉంది. సమావేశమై ఒకరోజు పడుతుంది. ఇక ఆభరణాలను పరిశీలించేది ఏముంటుంది? ఒకపూటైనా సమయం కేటాయించాల్సిన అవసరం లేదా? అన్నీ మామూలుగా జరిగిపోతున్న సమయంలో అవసరం లేదుగానీ….ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనైనా బోర్డు సభ్యులు సమయం కేటాయించకపోతే…ఇక తమ పదవులకు ఎలా న్యాయం చేసినట్లు అవుతుందో సభ్యులే ఆలోచించుకోవాలి అని భక్తులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*