టిటిడి రిటైర్డ్‌ ఉద్యోగులకు ఫిలిగ్రిమ్‌ అలవెన్స్‌ పెంపునకు బోర్డు నిరాకరణ

సర్వీసులో ఉన్న టిటిడి ఉద్యోగులకు పెంచిన విధంగానే తమకూ ఫిలిగ్రిమ్‌ అలవెన్స్‌ పెంచాలని టిటిడి రిటైర్డ్‌ ఉద్యోగులు చేసిన విజ్ఞప్తిని పాలక మండలి తిరస్కరించింది. తిరుమల యాత్రాస్థలం కావడంతో…టిటిడి పనిచేసే ఉద్యోగులకు బంధుమిత్రుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న ఉద్ధేశంతో…1984 నుంచి ‘పుణ్యక్షేత్ర భార భృతి’ని చెల్లిస్తున్నారు. 2015 ఆగస్టు నుండి నెలకు రూ.2,500 వంతున భారభృతి చెల్లిస్తున్నారు.

ఇదిలావుండగా….తమకూ పుణ్యక్షేత్ర భార భృతి ఇవ్వాలని రిటైర్డ్‌ ఉద్యోగులు టిటిడికి విన్నవించుకున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పాలక మండలి 2013 ఫిబ్రవరి రిటైర్డ్‌ ఉద్యోగులకూ నెలకు రూ.500 వంతున భృతి ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఇదే కొనసాగుతోంది. ఈ నిర్ణయం జరిగినపుడు రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.1,500 ఇచ్చేవాళ్లు. ఆ తరువాత రూ.2,500కు పెరిగింది. రిటైర్డ్‌ ఉద్యోగులకు మాత్రం రూ.500 మాత్రమే ఇస్తున్నారు. పైసా పెరగలేదు. దీంతో తమకూ భృతి పెంచాలని రిటైర్డ్‌ ఉదోఓ్యగుల సంఘం టిటిడికి విన్నవించింది.

ఈ వినతిపైన నవంబర్‌ నెల సమావేశంలో చర్చించిన పాలక మండలి ప్రతిపాదనను తిరస్కరించింది. ప్రస్తుతం టిటిడిలో 5,500 మంది రిటైర్డ్‌ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరికి పుణ్యక్షేత్ర భార భృతి పెంచితే….టిటిడిపై భారం పడుతుందన్న భావనతో పెంచడానికి నిరాకరించారు. కనీసం రూ.200లో రూ.300లో పెంచివుంటే రిటైర్డ్‌ ఉద్యోగులు సంతృప్తి చెందేవారు. తమ వినతిని పున:పరిశీలించి భార భృతి పెంచాలని టిటిడి పెన్షనర్లు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*