టిటిడి వివాదాల్లో ఈవో బలిపశువు!

తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకుంటున్న వివాదాల్లో ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బలిపశువుగా మారుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజల్లోనూ, టిటిడి ఉద్యోగుల్లోనూ, టివి చర్చల్లోనూ ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. శ్రీవారిపై ఉన్న భక్తితో టిటిడిలో పని చేయాలని ఆయన ఢిల్లీస్థాయి పలుకుబడిని ఉపయోగిం చుకుని ఇక్కడికి వచ్చారు. ‘టిటిడిలో మంచి జరిగినా, చెడ్డ జరిగినా బాధ్యత నాదే’ అని ఆయన మొదట్లోనే ప్రకటించారు. ఆ మేరకే ఇక్కడ జరుగుతున్న తప్పిదాలను తనపైన వేసుకుంటున్నారు.

టిటిడిపై సరయిన అవగాహన లేని సింఘాల్‌ను మొదటి నుంచి కొందరు అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రావుంది. గత ఈవో సాంబశివరావు రోజుకు లక్ష మందికిపైగా భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేసిన క్యూలైన్ల వ్యవస్థను మార్చేసినా, ఆలయంలో లోపల ఇనుప నిచ్చెన మెట్ల వ్యవహారం తెరపైకి వచ్చినా, కాలి నడక భక్తుల టికెట్లు పరిమితం చేసినా, వెయ్యి కోట్లు డిపాజిట్లు ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసినా…ఇటువంటివన్నీ కొందరు అధికారులు చెప్పిన సూచనలతో చేసినవే. ఏ అధికారి అధికారాలు ఆ అధికారికి ఇచ్చి గౌరవించారు. దీన్ని కొందరు దుర్వినియోగం చేశారు. ఆయన్ను తప్పుదారి పట్టించారు. అలాంటప్పుడే వివాదాలు నెత్తిమీదకు వచ్చి కూర్చుంటున్నాయి. వివాదాలు వచ్చినపుడు ఎవరిమీదనో నెట్టేసి ఆయన తప్పించుకోవడం లేదు. తనే బాధ్యత వహించి వివరణలు, సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న రమణ దీక్షితుల తొలగింపు వ్యవహారమూ అటువంటిదే. రమణ దీక్షితులు లేవనెత్తుతున్న అంశాలకు సంబంధించి బాధ్యత వహించాల్సిన అధికారులు తెరచాటున ఉన్నారు. ఈవో కూడా అలాంటి అధికారులపై చర్యలు తీసుకోలేని స్థితిలో ఉన్నారు. మొదట్లో తాను చెప్పిన మాటకు కట్టుబడి….తీవ్రమైన తప్పిదాలు జరినపుడు కూడా ఫలానా వారు బాధ్యులని చెప్పడం లేదు. పోటు తవ్వకాలు ఈవోకు కూడా తెలియకుండా జరిగాయని రమణ దీక్షితులు చెబుతున్నారు. అయినా ఈవోనే దానికీ బాధ్యత వహిస్తున్నారు. ఈ విషయాలన్నీ శ్రీవారి భక్తులకు సులభంగానే అర్థమవుతున్నాయి. తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఈవోపై సానుభూతి చూపడం మినహా ఎవరుమాత్రం ఏమి చేయగలరు!

1 Comment

  1. to enquire all issues by cbi with presense of live print electronic media to punish the victims irrespective of caste and political party

Leave a Reply

Your email address will not be published.


*