టిటిడి విశ్రాంతి భవనం విష్ణు నివాసం గబ్బుగబ్బు – కాంట్రాక్టర్‌ ఆగడాలు – పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన!

తిరుపతిలోని యాత్రీకుల సముదాయం గబ్బుగబ్బుగా ఉంది. ఎక్కడ చూసినా చెత్త పోరుకుపోయింది. బుట్టలన్నీ చెత్తతో నిండిపోయివున్నాయి. గదులు దుర్వాసన వస్తున్నాయి. టిటిడి చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. ఓ కాంట్రాక్టరు చేతగానితనంతో ఈ దుస్థితి ఏర్పడింది. తమ పట్ల కాంట్రాక్టరు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగడంతో గదులను శుభ్రం చేసేవారు కరువయ్యారు. వివరాల్లోకి వెళితే….

తిరుపతి రైల్వేస్టేషన్‌ ఎదురుగా విష్ణు నివాసం పేరుతో యాత్రీకుల వసతి సముదాయం ఉంది. ఇందులో వందలాది గదులున్నాయి. డార్మెటరీలున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ బస చేస్తుంటారు. విష్ణు నివాసంలో పారిశుద్ధ్య కాంట్రాక్టును ఇటీవలే భాస్కర్‌ నాయుడు అనే కాంట్రాక్టరు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా చెప్పుకునే భాస్కర్‌ నాయుడు కాంట్రాక్టు కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. 14 ఏళ్లుగా పని చేస్తున్న కొందరు కార్మికులను తొలగించారు. 50 ఏళ్ల వయసు మీరిన వారు పనిలోకి అవసరం లేదంటూ తీసేశారు. దీంతో కార్మికుల్లో తీవ్ర అలజడి ఉంది. తొలగించిన వారిని పనిలోకి తీసుకోవాలని కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో విష్ణు నివాసంలో పారిశుద్ధ్య పనులు ఆగిపోయాయి. గదులు, బాత్‌రూమ్‌లు శుభ్రం చేయడం లేదు. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదలజల్లతోంది. టిటిడికి తిరుమల, తిరుపతిలో ఏడు వేలకుపైగా గదులున్నాయి. గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో ఈ విధంగా గదులు అపరిశుభ్రంతో చిక్కుకున్న పరిస్థితి ఎన్నడూ లేదు. వాస్తవంగా క్లీనింగ్‌ పనులు అర్థగంట కూడా ఆగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత కాంట్రాక్టరుదే. పనులు ఆగితే….లక్షలాది రూపాయల ఫైన్‌ చెల్లించాల్సివుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టు సంస్థలు పారిశుద్ధ్య కార్మికులతో పని చేయించుకుంటాయి. అధికార పార్టీ బలం ఉందని చెప్పుకుంటున్న భాస్కర్‌ నాయుడు తీరు వల్ల పారిశుద్ధ్య పనులు రెండు రోజులుగా ఆగిపోయినా…ఒక్క అధికారి కూడా స్పందించిన దాఖలాలు లేవు. భాస్కర్‌ నాయుడు జోలికి వెళ్లాలంటే టిటిడి అధికారులు గజగజలాడుతున్నారు.

ఇదిలావుండగా…పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని విష్ణు వివాసంలో కరెంట్‌ బుకింగ్‌ ఆపేశారు. అయినా…ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు గదుల కోసం వస్తన్నారు. విధిలేని పరిస్థితుల్లో అక్కడున్న అటెండర్లు గదులు శుభ్రం చేసి ఇస్తున్నారు. ఒకరిద్దరు అటెండర్లతో ఇది సాధ్యమయ్యేపనికాదు.

టిటిడి పారిశుద్ధ్య కార్మికులు ఎన్నడూ ఈ విధంగా పనులు బహిష్కరించి నిరసనకు దిగిన సందర్భాలు లేవు. ఎన్ని సమస్యలున్నా…పని చేస్తూనే నిరసన వ్యక్తం చేస్తారు. కానీ భాస్కర్‌ నాయుడు పుణ్యాన ఈరోజు టిటిడి పరువు బజారుపాలవుతోంది. ఇప్పటికైనా టిటిడి ఉన్నతాధికారులు స్పందించాలని, భాస్కర్‌ నాయుడు కాంట్రాక్టును రద్దు చేయాలని కార్మికులు కోరుతున్నారు.
Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*