టిటిడి వ్యవహారాలపై సిబిఐ విచారణ తప్పదా?

తిరుమల శ్రీవారి ఆభరణాల వివాదం రెండు నెలల నుంచి సాగుతుండగా…రెండు రోజుల క్రితం స్పందించిన ప్రభుత్వం….సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టుకు లేఖ రాసింది. న్యాయమూర్తి ద్వారా ఆభరణాలను తనిఖీ చేయాలని కోరుతోంది. ఇంతలోనే ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం ఇదే హైకోర్టుకు చేరింది. పోటులో తవ్వకాలు, ఆభరణాల మాయంపై సిబిఐ విచారణ జరిపించాల పిటిషనర్లు కోరారు. శ్రీవారి ఆలయాన్ని పురాతన కట్టడంగా గుర్తించి, పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌, గురజాత్‌కు చెందిన గోస్వామి అనే వ్యక్తులు సంయుక్తంగా వేసిన ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. దేవాదాయ శాఖ కమిషనర్‌, టిటిడి ఈవో, పురావస్తు శాఖ అధికారులను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.

టిటిడి వివాదంపై సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో కేసు వేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. కోర్టు జోక్యంతో సిబిఐ విచారణ జరిగితే…రాష్ట్ర ప్రభుత్వానికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. సిబిఐ అంటేనే అది కేంద్రం జేబులో ఉండే సంస్థ అనేది బహిరంగ రహస్యం. అందుకే సిబిఐను తిప్పించుకోడానికే…రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషిల్‌ విచారణ కోసం హైకోర్టుకు లేఖ రాసింది. ఇది జరిగిన రెండో రోజే సిబిఐ విచారణ కోరుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలయింది. ఇప్పుడు హైకోర్టు ముందు రెండు అంశాలున్నాయి. ఒకటి జ్యుడిషియల్‌ విచారణ, ఇంకొకటి సిబిఐ విచారణ కోసం సిఫార్సు చేయడం. ఈ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కోర్టు ముందు లేకుంటే…జ్యుడిషియల్‌ విచారణకు జడ్జిని కేటాయించేదీ లేనిదీ కోర్టు చెప్పేది. న్యాయమూర్తుల కొరత ఉంటే తాము దీనికోసం ప్రత్యేకంగా న్యాయమూర్తిని కేటాయించలేమని చెప్పేది. అవకాశం, అవసరం ఉంటే ఎవరినో ఒకరిని అందుకోసం నియమించేది. కానీ ఇప్పుడు పరిస్థితి అదికాదు. సిబిఐ విచారణ గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత కోర్టుకు ఏర్పడింది.

ఇంతలోపు అంటే ప్రజాప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చేలోపు సుబ్రమణ్యస్వామి సుప్రీంలో కేసు దాఖలు చేస్తే….హైకోర్టు దీనిపై విచారించకుండా, దీన్ని కూడా సప్రీంకు పంపే అవకాశాలుంటాయి. రెండింటినీ కలిపి సుప్రీం కోర్టే విచారించి, తీర్పును వెలువరించే అవకాశాలున్నాయి. పోటులో తవ్వకాలు, ఆభరణాల మాయం వంటి తీవ్రమైన ఆరోపణల నిగ్గు తేలాలంటే సిబిఐతోనే విచారణ జరిపించాలని పిటిషనర్లు గట్టిగా వాదిస్తారనడంలో సందేహం లేదు. సిబిఐ వస్తే ఒక ఆభరణాలు, పోటు వ్యవహారమే కాదు…వివిధ రూపాలలో నిధుల దుర్వినియోగం, పాత కేసుల వ్యవహారాలనూ తవ్వితీసే అవకాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*