– వడమాలపేట వద్ద 300 ఎకరాలు
– 6000 మందికి స్థలాలు వచ్చే అవకాశం
– సుప్రీంకోర్టులో కేసు తక్షణ పరిష్కారం కోసం చొరవ
– పూర్ హోం, గోశాల, బ్రాహ్మణపట్టు లబ్ధిదారులకూ త్వరలో స్థలాలు
– భూమన కురుణాకర్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, ఛైర్మన్ సుబ్బారెడ్డి చొరవ
టిటిడి ఉద్యోగుల దీర్ఘకాల సమస్యకు ఎట్టకేలకు పరిష్కలభించనుంది. తిరుపతి సమీపంలోని వడమాలపేట వద్ద 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్న ఇళ్ల స్థలాల కేసును పరిష్కరించేందుకు సమర్ధులైన న్యాయవాదులను నియమిస్తామని హామీ ఇచ్చారు.
టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమస్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంది. తొలినాళ్లలొఇ బైరాగిపట్టెడ, ఎల్ఎస్ నగర్ వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ కాలనీలు బ్రహ్మాండమైన నివాసప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి. ఆ తరువాత పూర్ హోం, గోశాల, బ్రాహ్మణపట్టు, ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ ఇళ్ల ఇచ్చేందుకు కసరత్తు చేశారు. మొత్తం 3,200 మందికి స్థలాలుగానీ, అపార్ట్మెంట్ ఇళ్లుగానీ ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే…టిటిడి స్థలాలను ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని, ఇళ్ల స్థలాల కోసం ఇవ్వకూడదని కొందరు కోర్టులో కేసు వేశారు. ఈ కేసు హైకోర్టులో వీగిపోయింది. టిటిడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆపై ఈ కేసు వేసిన హిందూ ఆలయాల పరిరక్షిణ సమితి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో వుంది.
ఇదంతా పుష్కరకాలంగా జరుగుతున్న తతంగం. ఇప్పటికే ఇళ్లు, స్థలాలు మంజూరై కోర్టు కేసుల వల్ల లబ్ధిపొందలేక పోయిన వారితో పాటు…అసలు స్థలం మంజూరు కానివారు వేల మంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో తిరుపతి శానస సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి పూనుకున్నారు. 05.01.2021న ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ కూడా పాల్గొన్నారు.
టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం వడమాలపేట వద్ద ఉన్న 570 ఎకరాల్లో 300 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి ఈ భూములను ఇస్తామన్నారు. ఈ భూముల్లో మొత్తం 6000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు పరిష్కరించి పూర్ హోం, గోశాల, బ్రాహ్మణపట్టు వద్ద స్థలాలు ఇవ్వడంతో పాటు…మిగిలిన వారికి వడమాలపేట వద్ద ఇళ్ల స్థలాలు కేటాయిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది.
అయితే…సుప్రీంకోర్టులో ఉన్న సమస్య పరిష్కారం కోసం టిటిడి పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేసు తుది దశకు చేరుకుంది. సమర్ధులైన న్యాయవాదులను నియమించి సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏదిఏమైనా దీర్ఘకాల సమస్యకు పరిష్కారం దిశాగా పడుగులు పడుతుండటంపై ఉద్యోగులు హర్షం వ్యక్యం చేస్తున్నారు.
ఇదిలావుండగా టిటిడిలో పని చేస్తున్న 15,000 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ కార్పొరేషన్ లో చేర్చబోమని హామీ ఇచ్చారు. టిటిడిలోనే కొనసాగిస్తూ వేతనాలు పెంచడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
– ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి