టిడిపికి ఇదే చివరి ప్రభుత్వమా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల తరువాత కేంద్రంలో టిడిపినే చంక్రం తిప్పుతుందని, తాము చెప్పినవాళ్లే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తుంటే…బిజెపి ఏమంటే చంద్రబాబును మరీ తీసేసినట్లు మాట్లాడుతోంది. తెలుగుదేశం పార్టీకి ఇదే చివరి ప్రభుత్వమని అంటోంది. బిజెపి నేత విష్ణుకుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ….తెలుగుదేశం పార్టీపైన విరుచుకుపడ్డారు. రాజకీయ కారణాలో ఎన్‌డిఏ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగిన తెలుగుదేశం పార్టీ…బిజెపిని నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరానికి వంద శాతం నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయని ప్రకటించింది మీరేకదా అని ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు. ఇప్పటిదాకా పోలవరంపైనే ఏసిబి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చిన బిజెపి…ఇప్పుడు అగ్రిగోల్డ్‌ వ్యవహారంపైనా అలాంటి డిమాండే చేస్తోంది. పోలవరానికి రాష్రం ఎంత నిధులు ఖర్చు చేసింది, కేంద్రం ఎంత ఇచ్చిందీ వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బిజెపితో విడగొట్టుకున్న చంద్రబాబుపై ఆ పార్టీ నాయకులకు కోపం ఉంటేవుండొచ్చుగానీ… టిడిపికి ఇదే ఆఖరి ప్రభుత్వమని మాట్లాడటమే కాస్త అతిశయోక్తిగా ఉంది. బిజెపికి అలాంటి అంచనాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ అంచనా ఏమిటో చెప్పాలి. అంతేగానీ…శాపనార్థాలు పెట్టడం వల్ల జరిగేది ఏమీ ఉండదు. టిడిపి కూడా తక్కువ తినలేదు. రాష్ట్రంలో బిజెపి ఉనికే లేకుండా చేస్తానని చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ప్రకటిస్తన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికీ, ఒకప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వానికీ తేడా లేదని కూడా బాబు విమర్శించారు. ఈ అసహనం నుంచే బిజెపి నాయకులు అలా మాట్లాడుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఏమైనా మిత్రత్వం చెడిపోయిన తరువాత రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*