టిడిపికి ఓటు వేయకుంటే మానవత్వం లేనట్లే…!

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికలిగిస్తున్నాయి. తమ పార్టీ నేతలు, బూత్‌ కమిటీల కన్వీనర్లతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ బాబు చేసిన కామెంట్స్‌ ఒకింత విస్తుగొలిపే విధంగానూ ఉన్నాయి. టిడిపికి ఓటు వేయకుంటే వారికి మానవత్వం లేదనే అర్థమొచ్చేలా ఆయన మాట్లాడారు.

‘కష్టాలు ఎదురవుతున్నా రాష్ట్రాన్ని బ్రహ్మోండంగా అభివృద్ధి చేశాం. మానవత్వం ఉండే ప్రతి వ్యక్తీ మనకే ఓటు వేయాలనే భావనను జనంలోకి తీసుకెళ్లాలా పని చేయాలి…తెలంగాణలో ఏ పనీ చేయకుండానే అన్ని సీట్లు వచ్చాయి. మాటలు చెప్పి ఓట్లు అడిగారు. మనం పనులు చేసి ఓట్లు అడుగుతున్నాం. ఒక్క ఓటు కూడా అవతలివారికి వెళ్లకూడదు’ ఇవీ బాబు చేసిన వ్యాఖ్యలు.

ఇందులో అతిశయోక్తి, కాస్త తెంపరితరమనూ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఓట్లేయకుంటే వారికి మానత్వం లేనట్లేనా? రాజకీయంగా ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది. ఓటు వేసేటప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఓటు వేయమని అడగడంలో తప్పులేదుగానీ…నాకు ఓటు వేయకుంటే నీకు మానత్వం లేనట్లే….నాకు ఓటు వేయకుంటే నువ్వు దుర్మార్గుడమే అని మాట్లాడటమంటే….అది ప్రజలను కించపరచడమే అవుతుంది.

ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాబుకు ఇదే మొదటిసారి కాదు…ఆ మధ్య కర్నూలులో ‘నేను వేసిన రోడ్డుపైన నడుస్తూ, నేను ఇచ్చే పింఛను తీసుకుంటూ మాకు ఓట్లు వేయరా’ అని మాట్లాడారు. అదేవిధంగా వేతనాలు పెంచమని విన్నవించడానికి సచివాలయానికి వెళ్లిన క్షురకుల పట్ల చంద్రబాబు సహనం కోల్పోయి, ఊగిపోతూ మాట్లాడారు.

తమ ప్రభుత్వం బాగా పని చేసిందని చంద్రబాబు నాయుడు అనుకోవడంలో తప్పులేదు. సహజంగా ఎవరు అధికారంలో ఉన్నా తాము బాగా పని చేస్తున్నామనే అనుకుంటారు. అయితే…ప్రభుత్వం బాగా పని చేసినదీ లేనిదీ నిర్ధారించాల్సింది ప్రజలు. బాగా పని చేసినట్లు భావిస్తే మళ్లీ గెలిపిస్తారు. లేదంటే ఓడిస్తారు. అంతేతప్పు తమకు ఓట్లేయని వారంతా మానత్వం లేనివారేనంటూ శాపనార్ధాలు పెట్టడం వల్ల ఒరిగేదీమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే వ్యతిరేకత మూటకట్టుకోడానికి మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు, ధోరణి ఉపయోగపడుతాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*