టిడిపికి జయదేవే దిక్కయ్యాడు!

కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను, ఆ పార్టీ నుంచి తొలిసారి ఎంపిగా ఎన్నికైన గల్లా జయదేవ్‌ ప్రారంభించనున్నారు. వాస్తవంగా నోటీసు ఇచ్చింది మరో ఎంపి నాని. సాధారణంగా ఆయనే చర్చ ప్రారంభిం చాల్సివుంటుంది. అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌ ఆమోదించినప్పటి నుంచి మీడియా మొత్తం నాని పేరునే చెబుతూవస్తోంది. ఆయనే చర్చ మొదలుపెడతారని చెప్పారు. తీరా గురువారం మధ్యాహ్ననానికి గల్లా జయదేవ పేరు తెరపైకి వచ్చింది. ఇది ప్రతిష్టాత్మక అంశం కాబట్టి నాని బదులు….జయదేవ్‌ చర్చ ప్రారంభిస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన నానితో మాట్లాడి ఒప్పించారని వార్తలొచ్చాయి. చర్చ మధ్యలో అవకాశం వస్తే మాట్లాడమని నానికి సూచించినట్లు చెబుతున్నారు.

పార్టీ అధినేత చెప్పారు కాబట్టి…నాని అంగీకరించినట్లు కనిపించవచ్చుగానీ…లోన అసంతృప్తి ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే శుక్రవారం లోక్‌సభలో జరగబోయేది కీకమైన చర్చ. మీడియా దేశ వ్యాపితంగా ఈ అంశంపై వార్తలు ఇస్తుంది. నాని చర్చ ప్రారంభించివుంటే….ఆ ప్రచారం ఆయనకు వచ్చేది. కానీ బాబు నిర్ణయంతో గొప్ప అవకాశాన్ని నాని కోల్పోయారు. ఒక విధంగా ఇది తనను అవమానించినట్లేనని నాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయినా స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పడంతో….మౌనం వహించి అంగీకరించారు. ఏదో సందర్భంగా నాని అసంతృప్తి బద్ధలవుతుందనడంలో సందేహం లేదు.

ఇక తెలుగుదేశం పార్టీ ఎంపిల్లో అనేక పర్యాయాలు ఎంపిలు ఎన్నికైన వారు, మంత్రి పదువులు చేపట్టిన వారు ఉండగా…లోక్‌సభలో మాట్లాడగల సమర్థత ఉన్న నాయకులు కనిపించలేదు. దీంతో తొలిసారి ఎంపిగా ఎన్నికై, లోక్‌సభకు వెళ్లిన గల్లా జయదేవ్‌ను చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. ఇటీవలే జయదేవ్‌ లోక్‌సభలో చేసిన ఉపన్యాసం చర్చనీయాంశమయింది. గల్లా జయదేవ్‌ తన ఉపన్యాసంలో మోడీని ‘మిస్టర్‌ ప్రైమినిస్టర్‌…’ అని సంబోధించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అప్పడు ఆయన మాట్లాడిన తీరును పరిగణనలోకి తీసుకునే ఇప్పుడు మరో అవకాశాన్ని జయదేవ్‌కు ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*