టిడిపికి జూనియర్‌ మద్దతు ఎంత?

తెలుగుదేశం పార్టీకి చాలాకాలంగా దూరంగా ఉంటూవస్తున్న జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను ఎలాగైనా మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చి రానున్న ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేశారు. ఇందులో భాగంగా ఎన్‌టిఆర్‌ సోదరి అయిన సుహాసినికి తెలుగుదేశం టికెట్టు ఇచ్చి కూకట్‌పల్లి నుంచి పోటీ చేయిస్తున్నారు. తన సోదరిని గెలిపించమని జూనియర్‌ ఎన్‌టిఆర్‌ మీడియా ప్రకటన విడుదల చేసినప్పటికీ….ఆమె పోటీపై ఎన్‌టిఆర్‌ అయిష్టంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

తండ్రి హరిక్రిష్ణ జీవించివున్నప్పటి నుంచి జూనియర్‌ కుటుంబానికి చంద్రబాబుతో తీవ్రమైన విభేదాలున్నాయి. అందుకే హరిక్రిష్ణ భౌతిక కయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యలయమైన ఎన్‌టిఆర్‌ ట్రస్టు భవన్‌కు తీసుకెళ్లడానికి కూడా జూనియర్‌ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

హరిక్రిష్ణ మరణంతో ఆ కుటుంబంతో మెరుగుపడిన సంబంధాలను ఉపయోగించుకున్న చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల బరిలోకి సుహాసినిని తీసుకురాగలిగారు. దీనిద్వారా జూనియర్‌ కూడా టిడిపికి దగ్గరవుతారని ఆశిస్తున్నారు. కానీ…జూనియర్‌ ఆలోచన వేరుగా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నామమాత్రమైపోయిన తరుణంలో ఆ పార్టీకి దగ్గరవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని భావిస్తున్నారు.

ఇంకా రెండు దశాబ్దాలకుపైగా సినీ జీవితం ఉన్న జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. అలాంటప్పుడు తెలుగుదేశంకు దగ్గరదడం ద్వారా కెసిఆర్‌తో శత్రుత్వం తెచ్చుకోవడం ఎందుకనే భావనలో ఎన్‌టిఆర్‌ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పైగా ఎన్‌టిఆర్‌ అత్తగారి కుటంబానికి చెందిన ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ కోణంలోనూ టిడిపికి దగ్గరవడం మంచిది కాదని సన్నిహితులు జూనియర్‌కు చెప్పినట్లు సమాచారం.

అన్నీ ఆలోచించుకున్న ఎన్‌టిఆర్‌….కేవలం తన సోదరిని గెలిపించుకోవడం వరకే పరిమితమవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతకు మించి ఆయన టిడిపిని భుజానికెత్తుకోరని తెలుస్తోంది. మొత్తంమ్మీద చంద్రబాబు విసిరిన వలకు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ చిక్కినట్లే చిక్కి జారిపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*