టిడిపిని గెలిపించడం కోసం వైసిపి, ఎన్నికల సంఘం కుట్ర…!

ఈ మాట వినడానికే వింతగా, విచిత్రంగా ఉంది కదూ. ఇది మా మాట కాదు. చంద్రబాబు గారి వాదన.

రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఆయన మాటలు పరస్పరం భిన్నంగానూ, గందరోళంగానూ ఉన్నాయి. ఆయనలో తత్తరపాటు కూడా కనిపిస్తోంది. ఒక్క వాదనలోనూ హేదుబద్ధత కనిపించడం లేదు.

ప్రధానంగా ఓటింగ్‌ యంత్రాలపైన ఆయన చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రంలో 3.90 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాము ఎవరికి ఓటు వేశామో వివిపాట్‌ పరికరంగా స్పష్టంగా కనిపించింది. ఓటర్లంతా తాము ఏ పార్టీకి ఓటు వేయాలనుకున్నామో అదే పార్టీకి ఓటు పడిందన్న సంతృప్తితో పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు వచ్చారు.

అదేవిధంగా కౌంటింగ్‌ సమయంలో ప్రతి నియోజకవర్గానికి 5 వివిపాట్‌లను యాదృచ్ఛికంగా ఎంపిక చేసి, అందులోని స్లిప్పులను లెక్కించనున్నారు. ఆ సంఖ్యలను సంబంధిత ఓటింగ్‌ యంత్రంలోని సంఖ్యలతో సరిపోల్చనున్నారు. యంత్రంలోని ఓట్లకు, స్లిప్పులపైన ఓట్లుకు ఏదైనా తేడా వుంటే తేలిపోతుంది. మొత్తంగా ఓటింగ్‌ యంత్రాలపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి.

ఓటు ఒకరికి వేస్తే ఇంకొకరికి పడే పరిస్థితి వుంటే….ఓటింగ్‌లో పాల్గొన్న 3.90 కోట్ల మందిలో లక్షల మందికి అది తెలిసేది. ఫిర్యాదులు అందేవి. ఒక్కచోట కూడా అటువంటి ఫార్యదు రాలేదు. ఇవేవీ పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఓటింగ్‌ యంత్రాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. ఎలా మోసం జరిగిందో నిర్ధిష్టంగా చెప్పలేకున్నారు.

ఇదిలావుంటే…..ఈ ఎన్నికల్లో తమ పార్టీ 130 స్థానాలు గెలవబోతోందని చెబుతున్నారు. ఓటింగ్‌ యంత్రాల ద్వారా వైసిపి, బిజెపి, ఎన్నికల సంఘం మోసం చేసివుంటే….130 స్థానాల్లో తెలుగుదేశం ఎలా గెలుస్తుంది? తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం వైసిపి, బిజెపి, ఎన్నికల సంఘం కూడబలుక్కుని ఈవిఎంలతో మోసం చేశాయా? బాబు వాదనకు అర్థముందా?

ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయమని, దీన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు….ఆ నేరాన్ని తన మీదకు రాకుండా ఈవిఎంలపైకి నెట్టేయడానికే బాబు….ఓటింగ్‌ యంత్రాలపైన, ఎన్నికల సంఘంపైన ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు మరింత బలంగా జనంలోకి వెళుతోంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*