టిడిపి – కాంగ్రెస్ కటాఫ్ తో ఖంగుతిన్న చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నేతలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపితో తెగ తెంపులు చేసుకొని కాంగ్రెస్ తో వియ్యమందిన తదుపరి చిత్తూరు జిల్లాలో కొందరు కాంగ్రెస్ నేతల ఊహలు ఆశలు మొగ్గ‌లు తొడిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా తమకు టిడిపి మద్దతు వుంటుందని భావించారు. వెనువెంటనే పర్యటనలు మొదలు బెట్టారు. ప్రస్తుతం టిడిపి కాంగ్రెస్ పొత్తు లేదని తేలిపోయిన తర్వాత ఖంగు తిన్నారు.

ఇందులో ప్రధమ స్థానంలో చింతామోహన్ వున్నారు. పొత్తు కుదిరి వుంటే చింతామోహన్ కు అనుకూలించే అంశాలు అందరి కన్నా ఎక్కువగా వుండినవి. 1) కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద మంచి పలుకు బడి వుండటం. 2) ఈ నాలుగేళ్లుగా పక్క చూపులు చూడ కుండా కాంగ్రెస్ వెంట వుండటం 3) వీటి అన్నింటికి మించి తిరుపతి పార్లమెంటు సీటు కోరేవారు టిడిపిలో లేక పోవడం. పైగా గతంలో టిడిపి లోనే రాజకీయంగా ఓనమాలు దిద్ది వుండటం 4) ఈ స్థానం నుండి పలుమార్లు యంపి గా ఎన్నిక కావడం. ఈ అంశాలు దృష్టిలో వుంచు కొంటే చింతామోహన్ రొట్టె విరిగి నేతిలో పడినట్లు ఆయనతో పాటు ఆయన అనుచరులు భావించారు. ఈ దెబ్బతో అంతా తలకిందులు అయింది.

అయితే ఈ పరిణామాల తర్వాత చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ టిడిపితో కాంగ్రెస్ కు భావ సారూప్యత లేదని వ్యాఖ్యానించడం దీనికి తోడు కాంగ్రెస్ వైసిపి పార్టీల మధ్య పొత్తుకు తను కాంగ్రెస్ అధిష్ఠానంను ఒప్పించుతానని చెప్పడం విశేషం. అంటే అందని మాను పండు చేదు అన్న చందంగా ఉంది.

జిల్లాలోని మరో కాంగ్రెసు నేత రెడ్డి వారి చెంగారెడ్డి కూడా వాస్తవంలో షాక్ తిని వుంటారు. రాజకీయాలు పక్కన బెట్టి ఆలోచించితే చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నేతగా చెంగారెడ్డి ఒక్కరే నియోజకవర్గంలో పట్టు కలిగి వున్నారు. వయస్సు మీద పడినా ఇప్పటికీ నిత్యం తన వద్దకు వచ్చే వారి సమస్యలు పరిష్కరించేందుకు చేస్తున్న కృషి ఎవరినైనా ఆశ్చర్యం కలించుతుంది. నగరికి దూరంగా కొండ ప్రాంతంలో నిర్మించిన సాయిబాబా ఆలయం వద్ద వుంటున్నా తమ సమస్యలు చెప్పు కొనేందుకు రోజు రైతులు ప్రజలు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టిడిపి పొత్తు వుంటే నగరి స్థానంకోసం రాహుల్ పట్టు బడతారని పైగా నగరి టిడిపిలో టికెట్ కోసం పలువురు పోటీ పడటం వీటికి తోడు చెంగారెడ్డి అయితే రోజాను ఓడించ గలరనే అభి ప్రాయం అన్ని కలగలసి బలంగా చెంగారెడ్డి అనుచరులు భావించు తుండిన నేపథ్యంలో టిడిపి కాంగ్రెస్ తెగ తెంపులు అశని పాతంగా మిగిలింది.

ఇందులో మరో ట్విస్ట్ వుంది. ఎంత వరకు నిజమో ఏమో గాని ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయిన తర్వాత చెంగారెడ్డి తన కుమార్తెను టిడిపిలో చేర్పించే ఆలోచనలు చేసినట్లు కూడా వార్త‌లొచ్చాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే రాయలసీమ లో చిత్తూరు జిల్లాలో చెంగారెడ్డి కర్నూలు జిల్లాలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఇప్పటికీ వ్యక్తి గతంగా పలుకు బడి నిలబెట్టు కొని వున్నారు. ఈ పరిణామాల తర్వాత సూర్య ప్రకాష్ రెడ్డి టిడిపి లో చేరి పోతారనే వార్తలు వస్తున్నాయి. మరి చెంగారెడ్డి ఏం చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలా స్పందించు తారో చూడాలి.

ఇదిలా వుండగా టిడిపి కాంగ్రెస్ తెగ తెంపులు తర్వాత పీలేరు నియోజకవర్గంలో టిడిపి భవిష్యత్తు ఇరకాటంలో పడింది. కొత్త నీరు వచ్చిన తర్వాత పాత నీరు కొట్టుకు పోయింది. ఈ పరిస్థితుల్లో టిడిపి కాంగ్రెస్ పొత్తు వుండి వుంటే తన సోదరునితో అభిప్రాయబేధాలు వున్నా కిరణ్ కుమార్ రెడ్డి సపోర్టు వుండేది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా స్పందించు తారనే అంశంపై పీలేరులో టిడిపి అభ్యర్థి గెలుపు ఆధారపడి వుంటుంది.

జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెసు పొత్తుపై అంచనాలు వేసుకొని వున్న టిడిపినేతలతో పాటు కాంగ్రెస్ నేతల అంచనాలు ప్రస్తుతం తలకిందులు అయ్యాయి.

– వి.శంకరయ్య 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*