టిడిపి ఘోర ఓటమిలో చంద్రబాబు తప్పిదం ఏమీ లెదంట..!

ఈ ఎన్నికల్లో టిడిపి ఘోరాతి ఘోరంగా ఓటమి చెందటానికి కారణాలను వెతకడంలో టిడిపి కన్నా ముందుగా ఎపిలో ఒక రకమైన మీడియా చర్చలు మొదలెట్టింది. టిడిపి నేతలు ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అందరి కన్నా ముందుగా ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడును కాపు కాసిన ఒకరకమైన మీడియా ఈ చర్చలు ప్రారంభించింది.

చంద్రబాబు నాయుడు ఈ అయిదు ఏళ్ల కాలంలో పెద్దగా తప్పులు చేయలేదని…పార్టీలోని ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు అవినీతి కి పాల్పడినందున ఆ ప్రభావంతో రాష్ట్రంలో టిడిపి ఓటమి చెందినదని మెల్లగా కూనిరాగాలు ప్రారంభించారు. వాస్తవం చెప్పాలంటే టిడిపి ప్రాంతీయ పార్టీ. చంద్రబాబు నాయుడు మొనార్క్. ఆయన మాటను ఎదిరించే వారు…ఆయన తప్పులు చేసినా ప్రశ్నించే వారు టిడిపిలో లేరు. చంద్రబాబు నాయుడు తప్పులను ప్రశ్నించే వారు టిడిపిలో వుంటే ఇంత దుస్థితి తటస్తించేది కాదు. ఇది బహిరంగ రహస్యం.

అయితే టీవీ ఛానల్స్ ఇంత ఘోర పరాజయం సంభవించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇమేజ్ దెబ్బ తిన కుండా కాపాడే వ్యూహంలో భాగంగా…ఆయన తప్పు పెద్దగా లేదని, కింద స్థాయి నేతల అవినీతి అప్రతిష్టతో టిడిపి ఓడిందనే వాదన మెల్లగా మొదలెట్టడం గమనార్హం.

ఈ అయిదు ఏళ్ల కాలంలో ఎవరిని ఏమని ప్రశ్నించినా గోడ దూకుతారనే భయంతో…తుదకు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న దెందులూరు ఎంయల్ఏ చింతమనేని ప్రభాకర్ లాంటి వారిని కూడా కించిత్ మందలించ లేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు నాయుడు వుండి పోవడాన్ని… ఆనాడు గాని నేడు గాని ఈ మీడియా గుర్తించ లేక పోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. దీని మూలాలు ఎక్కడికో వెళ్లి వున్నాయి.

ఇంకా చెప్పాలంటే ఎపిలో ఒక రకమైన మీడియా చంద్రబాబు నాయుడుకు పోటీ కాళ్ళుగా వ్యవహరించింది. ఆయనపై ఈగ వాలకుండా చూచుకొన్నది. చంద్రబాబు నాయుడు పందిని చూపి ఇది మేక పిల్ల అంటే అవునవును అని వంత పాడింది. నిజంగా ఈ మీడియా చంద్రబాబు నాయుడు బాగు కోరివుంటే ప్రత్యేక హోదా అంశంలో ఆయన మాటలు మార్చడాన్ని తప్పు బట్టి సలహా ఇచ్చి వుండేటిది. పార్టీ ఫిరాయింపులు కొంప ముంచుతాయని సూచనగానైనా చేసేటీవి.

అంతే కాదు. తెలంగాణ ఎన్నికల నుండి మొన్నటి ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు మాటలు మార్చుతూ ప్రతి సందర్భంలోనూ చారిత్రక ఆవశ్యకతగా చెప్పడాన్ని తప్పు బట్టేటివి. చంద్రబాబు నాయుడు తప్పు మీద తప్పు చేస్తున్నా సూచనగా నైనా సలహా ఇవ్వలేదు. తుదకు ఇవియంవపై రగడకు మంట బెట్టాయి. కాని సరిదిద్దిన పాపాన పోలేదు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా తాటికాయంత అక్షరాలతో ప్రచురించడం వరకే పరిమిత మైనారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు నేటి ఈ దుస్థితికి ఎపిలో పాపులర్ మీడియాయే ప్రధాన కారణం. ప్రజల డబ్బు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు ఇచ్చినందుకు ప్రచారం కల్పించి రుణం తీర్చుకున్నాయి. కాని ఆయనను సక్రమ మార్గంలో పెట్టిన జాడ కన్పించదు.

తుదకు ఎపి ప్రజలు చంద్రబాబు నాయుడు కు ఆయన కొమ్ము కాచిన పాపులర్ మీడియాకు దిమ్మ తిరిగే విధంగా తీర్పు ఇస్తే కళ తప్పి అంతిమంగా చంద్రబాబు నాయుడు తప్పిదాలు కాపాడేందుకు అన్య మార్గాలు వెతుకుతున్నారు. ఎందుకంటే ఘోర ఓటమికి చంద్రబాబు నాయుడు తప్పిదాలు కారణాలుగా వెల్లడైతే పార్టీలో క్రమేణా తిరుగుబాటు ఉత్పన్న మౌతుందనే భయం పార్టీ అధిష్టాన వర్గంలో ఏర్పడ బట్టి నష్ట నివారణ చర్యగా కొన్ని టీవీ ఛానెల్స్ ఈ రకమైన చర్చలు పెడుతున్నాయి. ఇతర పాపులర్ మీడియాలో ఈ వార్తలు క్రమేణా చోటు చేసుకుంటున్నాయి. ఈలాంటి వక్ర మార్గాలు చంద్రబాబు నాయుడు, ఆయన కొమ్ము కాచే మీడియా అనురించితే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు జరిగిన తప్పులు అంగీకరించి పంథా సరిదిద్దుకుటే కొంతలో కొంత టిడిపికి మేలు జరుగుతుంది.

– వి. శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*