టిడిపి నేతలకు సైకిళ్లు కావలెను!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలన్నీ కలిసి బంద్‌ చేస్తుంటే…తెలుగుదేశం పార్టీ బంద్‌కు దూరంగా ఉంది. ఇదే డిమాండ్‌తో ఈనెల 20వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాపితంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగు తమ్ముళ్లు నిరాహార దీక్షలు చేపడతారట. అయితే దీనిపై అప్పుడే సోషల్‌ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు చేయొద్దంటున్న ముఖ్యమంత్రి…ఆయన మాత్రం ఇక్కడ దీక్ష ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి దీక్ష చేయమని కొందరంటుంటే….ఆమరణ దీక్ష చేపట్టాలని కొందరు ఎత్తేశా చేస్తున్నారు.

అదేవిధంగా 21వ తేదీ నుంచి గ్రామ గ్రామాన సైకిల్‌ యాత్రలు నిర్వహించాలని కూడా చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సైకిల్‌ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తేగానీ…సైకిల్‌ యాత్రలు చేయడానికి ఇంతకీ టిడిపి కార్యకర్తల వద్ద సైకిళ్లు ఉన్నాయా? అని ఎద్దేవా చేస్తున్నాయి ప్రతిపక్షాలు. టిడిపి – సైకిళ్లు అంటే ఒకమాట గుర్తుచేసుకోవాలి. 2004 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పడు ఓ చర్చ పెద్దగా సాగింది. ఉపాధి హామీ పథకం వచ్చిన తరువాత….అప్పటి దాకా సైకిళ్లపై తిరిగిన తెలుగుదేశం నేతలంతా కార్లలో తిరగడం మొదలుపెట్టారన్న విమర్శలు వచ్చాయి. అంటే ఆ పథకంలో అంతపెద్ద స్థాయిలో అవినీతి జరిగిందన్నమాట.

ఇప్పుడు పాత సంగతులను గుర్తు చేస్తున్నారు ప్రతిపక్షాల నేతలు. 2004కు ముందే టిడిపి నేతల వద్ద సైకిళ్లు కనుమరుగయ్యాయని, ఇప్పుడు యాత్ర కోసం సైకిళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అంటున్నారు. ఏముందిలే….సైకిళ్లు కావలెను అని ప్రకటన ఇచ్చి….కొత్త సైకిళ్లే కొనేస్తారులే..’ అంటున్నారు. ఇది కాస్త వెటకారంగానే ఉన్నా….బంద్‌కు బాబు సహకరించలేదన్న ఆక్రోశం ఈ మాట్లో ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*