టిడిపి పవన్‌ను బద్ధశత్రువులా ఎందుకు చూస్తోంది?

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆ పార్టీకి బద్ధ శత్రువులా మారాడు. ముద్రగడ పద్మనాభం చెప్పినట్లు తెలుగుదేశం పార్టీని భుజానికెత్తుకుని, చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసిన పవన్‌…ఈ నాలుగేళ్లలోనే ఎందుకు ఆగర్భ విరోధిగా మారిపోయాడు? పవన్‌ కల్యాణ్‌ రహస్యంగా ఏదో చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం టిడిపికి ఉందా? ఉందుకే ఇంతగా ఆయనపైన విరుచుకుపడుతోందా?

రానున్న ఎన్నికల్లో జనసేన, వైసిపి ఒకటవుతాయన్న అనుమానం టిడిపికి బలంగా ఉంది. దీనివెనుక బిజెపి మంత్రాంగం నడిపిస్తోందని భావిస్తోంది. దీనంతటికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ మధ్యవర్తిత్వం చేశారని అనుకుంటోంది. అందువల్లే తెలుగుదేశం, ఆ పార్టీ అనుకూల మీడియా పవన్‌ టార్గెట్‌ చేశాయని పరిశీలకులు చెబుతున్నారు. ఆదివారం ఓ పత్రికలో వచ్చిన వ్యాసంలోని వ్యాఖ్యలు ఇక్కడ పరిశీలనార్హం. ‘గవర్నర్‌ నరసింహన్‌ – పవన్‌ కల్యాణ్‌ మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? వారి మధ్య అనుబంధం ఏర్పడటానికి కేంద్రంలోని పెద్దల పాత్ర ఏమిటో కూడా వెల్లడయితే ఈ వ్యవహారం ఎటు వెళుతుందో తేలిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తులో వైసిపితో చేతులు కలపడానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే….ఈ మొత్తం క్రీడ వెనుక కేంద్రంలోని బిజెపి పెద్దలు ఉన్నారని భావించక తప్పదు’ అని పేర్కొన్నారు. ఇంకోచోట….’నిన్నటిదాకా పవన్‌ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన ఎంఎల్‌ఏ రోజా…ఇప్పుడు ”మా పవన్‌ కల్యాణ్‌” అంటున్నారు. ఈ మార్పునకు కారణాలు ఏమిటో’ అని ప్రశ్నించారు.

ఈ పత్రికలో వచ్చిన అభిప్రాయమే టిడిపి నేతలకు ఉన్నట్లుంది. గవర్నర్‌ మధ్యవర్తిత్వంగా పవన్‌ కేంద్రంలోని బిజెపి నేతలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారన్న విశ్వసనీయ సమాచారం ఏదో టిడిపి నేతలకు ఉన్నట్లుంది. అయితే…ఇక్కడ గమనించాల్సిన అంశాలేమంటే….బిజెపికి బద్ధ శత్రువులైన కమ్యూనిస్టులతో కలిసి పవన్‌ అడుగులు వేస్తున్నారు. తాను ఆ పార్టీలతోనే కలిసి పని చేస్తానని చెబుతున్నారు. ఇప్పటికే చాలా దూరం నడిచారు కూడా. అలాంటిది పవన్‌ బిజెపితో రహస్య ఒప్పందం చేసుకున్నారంటే నమ్మలేం. అదేవిధంగా వైసిపితోనూ కలుస్తారని (ఇప్పటిదాకా) వీల్లేదు. ఎందుకంటే….పవన్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాంటిది జగన్‌తో కలిస్తే….ఆ అవకాశం పవన్‌కు ఉండదు. ఈ కోణంలో జనసేన పార్టీ వైసిపితో కలిసే అవకాశం లేదు. అయినప్పటికీ…ఏదో అనుమానం టిడిపిని బలంగా వేధిస్తోంది. అందుకే చిన్న అవకాశం దొరికినా పవన్‌పై నిప్పులు కురిపిస్తోంది. దీనికి ఆ పార్టీ అనుకూల మీడియా కూడా తోడవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*