టివి ఛానళ్లను కలవరపెడుతున్న‌….యూట్యూబ్‌ ఛానళ్లు..!

– ఆదిమూలం శేఖర్‌, 8686122179

పత్రిక, మీడియా రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందివచ్చిన టెక్నాలజీ ఈ రంగం కొత్తపుంతలు తొక్కడానికి దోహదపడుతోంది. ఒకప్పుడు టివి ఛానల్‌ పెట్టాలంటే వందల కోట్ల వ్యవహారం. ఇప్పుడు నామమాత్రపు ఖర్చుతో సామాన్యులైనా టివి ఛానల్‌ పెట్టగల అవకాశం వచ్చింది. ఈ పరిణామాలు ప్రధాన స్రవంతి మీడియాకు పెను సవాలు విసురుతున్నాయి. ఆ మీడియాను కలవరపెడుతున్నాయి.

ఒకప్పుడు టివి ఛానల్‌ అంటే దూరదర్శన్‌ మాత్రమే. ఆ తరువాత ప్రైవేట్‌ వ్యక్తులకూ లైసెన్సులు ఇవ్వడంతో అనేక న్యూస్‌ ఛానళ్లు ఆవిర్భవించాయి. ఇప్పుడే ఏ భాషలో చూసినా 10 – 15 న్యూస్‌ ఛానళ్లు కనిపిస్తున్నాయి. దీన్నే పెద్ద సమాచార విప్లవంగా భావించారు. యూట్యూబ్‌ వల్ల ఇప్పుడు అంతకు కొన్ని వందల రెట్లు మార్పు సంభవింవిస్తోంది. ఒక్కో భాషలో 10 – 15 ఛానళ్లు కాదు….వందల, వేల టివి ఛానళ్లు వచ్చేశాయి.

యూట్యూబ్‌ ఛానళ్ల ప్రవేశంతో….వార్తలపైన కొన్ని సంస్థల గుత్తాధిపత్యానికి కాలం చెల్లుతోంది. ఒకటి రెండు సంస్థలు చెప్పిందే వేదం అనే ధోరణికి శుభం కార్డు పడుతోంది. ప్రజలకు అన్ని కోణాల నుంచి సమాచారం తెలుసుకునే అవకాశం లభిస్తోంది. వాస్తవాలను దాచి పెట్టడానికి ప్రధాన స్రవంతి మీడియాకు సాధ్యం కావడం లేదు. దాచిపెట్టినా….వెబ్‌ఛానళ్లు వాస్తవాలను జనం ముందుకు తెస్తున్నాయి.

ఈ సందర్భంగా తాజా ఉదాహరణ ఒకటి చూపించవచ్చు. ఎన్‌టిఆర్‌ కథానాయకుడు సినిమా విడుదలైన నేపథ్యంలో, ప్రధాన ప్రసంతి మీడియా పట్టించుకోలేదుగానీ….మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు ఇంటర్వ్యూను వదుల సంఖ్యలో యూట్యూబ్‌ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఒక్కో ఛానల్‌లో లక్షల మంది ఈ ఇంటర్వ్యూలు చూశారు. ఒకప్పుడు ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించి, ఆ కుర్చీలో కూర్చున్న నాదేండ్ల భాస్కర్‌రావును మీడియా ఒక విలన్‌గా చూపుతూ వచ్చింది. నాదేండ్ల భాస్కర్‌రావు తన ఇంటర్వ్యూల్లో నమ్మలేని నిజాలు చెప్పారు. ఇంతకాలం….ఇవన్నీ ఎందుకు బయటకు రాలేదనేది ప్రశ్న?

ఇదొక్కటే కాదు…ప్రధాన స్రవంతి మీడియా, ఆర్థిక ప్రయోజనాలను ఆశించో, రాజకీయ ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతోనే చాచిపెడుతున్న, వక్రీకరిస్తున్న విషయాలను యూట్యూబ్‌ ఛానళ్లు మరో కోణంలో వెలుగులోకి తెస్తున్నాయి. ఈ ఛానళ్ల వల్ల ఒకే అంశానికి సంబంధించి వివిధ కోణాల్లో విశ్లేషణలు తెలుసుకునే వీలు కలుగుతోంది. ఇది కచ్చితంగా సామాజానికి మేలు చేస్తున్నదనడంలో సందేహం లేదు.

వేగంలోనూ మెయిస్‌ స్ట్రీమ్‌ మీడియా కంటే వేగంగా ఉంటున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. సెల్‌ఫోన్‌ ద్వారానైనా లైవ్‌ ఇవ్వగల అవకాశం ఉండటంతో సంప్రదాయ టివి ఛానళ్లు ప్రసారం చేసేలోపే…యూట్యూబ్‌ ఛానళ్లు వార్తలను ప్రజలకు చేర్చేస్తున్నాయి.

ఇక ప్రాంతాల వారీగా, అంశాల వారీగా యూట్యూబ్‌ ఛానళ్లు వస్తున్నాయి. ఇటువంటి అవకాశం ప్రధాన స్రవంతి మీడియాకు తక్కువే. చిన్నచిన్న స్థానిక వార్తలను కూడా యూట్యూబ్‌ ఛానళ్లు దృశ్యమానంగా ఇవ్వడం వల్ల వాటికి ఆదరణ పెరుగుతోంది.

ఇక యాడ్స్‌ విషయంలోనూ యూట్యూబ్‌ ఛానళ్లు పోటీగా మారుతున్నాయి. ఒక సంప్రదాయ టివి ఛానల్‌కు ప్రకటన ఇచ్చేబదులు…ఒక వంద యూట్యూబ్‌ ఛానళ్లకు ఇవ్వడం ప్రయోజనకం అనే విధంగా మారింది. బహుళజాతి సంస్థలు కూడా తమ యాడ్‌ బడ్జెట్‌లో డిజిటల్‌ మీడియాకూ వాటా కేటాయిస్తున్నారు. ఈ మేరకు ప్రధాన స్రవంతి ఛానళ్లకు, పత్రికలకు ప్రకటనలు తగ్గుతున్నాయనడంలో సందేహం లేదు.

ఇలా ఒకటి కాదు…అనేక అంశాల్లో యూట్యూబ్‌ ఛానళ్లు మెయిన్‌ స్ట్రీమ్‌ టివి ఛానళ్లకు పోటీగా మారుతున్నాయి. సవాలును విసురుతున్నాయి. దంతో అవికూడా తమ పంథాను మార్చుకుంటున్నాయి. పెద్దపెద్ద టివి ఛానళ్లు తమ ఛానళ్లను శాటిలైట్‌ ద్వారా మాత్రమే కాదు….యూట్యూబ్‌ ద్వారానూ ప్రసారం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వార్తలను చిన్నచిన్న బిట్లుగా విభజించి యూట్యూబ్‌లో పోస్టు చేస్తున్నాయి. ఈ పని కోసం ఒక్కో ఛానల్‌లో 30 నుంచి 50 మంది దాకా పని చేస్తున్నారు.

యూట్యూబ్‌ ఛానల్స్‌కు ఆదరణ పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్‌ ఛార్జీలు భారీగా తగ్గడం; ఎక్కడ ఉన్నా సెల్‌ ద్వారా టివి చూసే అవకాశం ఏర్పడటంతో….యూట్యూబ్‌ ఛానళ్లకు ఆదరణ పెరుగుతోంది.

ఇక జర్నలిస్టులకూ పెద్ద భరోసా ఇస్తోంది యూట్యూబ్‌. పెన్నులో సత్తా ఉన్న ఏ జర్నలిస్టు అయినా సొంతంగా టివి ఛానలో, వెబ్‌సైటో పెట్టుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోగల అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. చాలామంది సీనియర్‌ జర్నలిస్టులు ఇప్పుడు యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లు ప్రారంభిస్తున్నారు.

తెలకపల్లి రవి….తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియనివారు ఉండరు. ఆయన తెలకపల్లి మీడియా పేరుతో ఓ ఛానల్‌ ప్రారంభించారు. రాజకీయ అంశాలపై విశ్లేషణలు అందిస్తున్నారు. ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌….ప్రముఖ రాజకీయ విశ్లేషఖులు, జర్నలిజం ప్రొఫెసర్‌. ఆయనా ఓ చానల్‌ను ప్రారంభించారు. టివి చర్చల్లో మాదిరిగా విశ్లేషణలు అందిస్తున్నారు. జెమినీ న్యూస్‌ ద్వారా సుపరిచితులైన సీనియర్‌ జర్నలిస్టు సాయి…సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతూ విశ్లేషణలు అందిస్తున్నారు. ఆయన ప్రధాన స్రవంతి టివి ఛానల్‌లో పని చేస్తూ యూట్యూబ్‌ ఛానల్‌ నడిపారు. యూట్యూబ్‌ ఛానల్‌ను మూసేయాలని ఆయనపై ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. అందుకు ఆయన నిరాకరించి ఆ టివి ఛానల్‌ను వదిలేశారు. ఇప్పుడు ఉదహరించిన ఈ సీనియర్‌ జర్నలిస్టులు ఒక వీడియో పోస్టు చేస్తే వేలాది మంది చూస్తున్నారు.

ఇక ఈనాడు, సాక్షి పత్రికల్లో స్టేట్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేసిన మంచాల శ్రీనివాస్‌ అనే సీనియర్‌ జర్నలిస్టు ముచ్చట పేరుతో కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. వార్త దినపత్రికలో పనిచేసి, ఇటీవల హన్స్‌ ఇండియాలో పనిచేస్తూ మానేసిన జింకా నాగరాజు అనే సీనియర్‌ జర్నలిస్టు తెలుగురాజ్యం పేరుతో ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించారు. దానికి కూడా మంచి స్పందన వస్తోంది. సాక్షిలో స్టేట్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా పనిచేసి…అసలు టివి జర్నలిజంతో సంబంధం లేని తిరుపతికి చెందిన నగేష్‌ (నాగేశ్వర్‌రావు) ఐడ్రీమ్స్‌ వెబ్‌ఛానల్‌కు పనిచూస్తూ ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. ఇక ఈ కథనం రాస్తున్న జర్నలిస్టు (ఆదిమూలం శేఖర్‌) దీర్ఘకాలం ప్రజాశక్తి, సాక్షి పత్రికల్లో పని చేసి…ఇప్పుడు ధర్మచక్రం పేరుతో వారపత్రిక, వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానళ్లు నిర్వహిస్తున్నారు. ఇంకా మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు ముందుజాగ్రత్తగా వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లు ప్రారంభించి తెరవెనుక నుంచి నడిపిస్తున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే…జర్నలిస్టులకూ డిజిటల్‌ మీడియా అనూహ్య వరంగా మారింది. ఉద్యోగం కోసం యాజమాన్యాలను దేబరించాల్సిన అవసరం లేకుండాపోతోంది. ఉద్యోగం పోతే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఇప్పుడు లేదు. నీ ఛానల్‌లో తీసేస్తే…నేనే సొంతంగా ఛానల్‌ పెట్టేస్తా అనేంత ధీమా ఇస్తోంది యూట్యూబ్‌. అందుకు యూట్యూబ్‌కు జర్నలిస్టులంతా ధన్యవాదాలు చెప్పాలి.

ఒకటి మాత్రం నిజం…భవిష్యత్తు డిజిటల్‌ మీడియాదే. యూట్యూబ్‌ ఛానళ్లదే. వెబ్‌సైట్లదే. తమ ఛానళ్లను ప్రభుత్వం గుర్తిచాలన్న డిమాండ్‌ కూడా యూట్యూబ్‌ ఛానళ్ల నిర్వాహకుల నుంచి వస్తోంది. దేశంలో సమాచార, ప్రసార శాఖగానీ; రాష్ట్రంలో పౌర సంబంధాల శాఖగానీ ఈ అంశంపై దృష్టిపెట్టినట్లు అనిపించడం లేదు. యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లకూ గుర్తింపు ఇవ్వడానికి అవసరమైన విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ముంచుకొస్తున్నమాట వాస్తవం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*