టివి లైవ్‌లో తిరుమల వెంటేశ్వరుడు!…టిటిడి ఈవో ఆలోచన!!

తిరుమల ఆలయంలో శ్రీవారికి కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని, సేవలు త్వరగా ముగించాలని అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని రమణ దీక్షితులు చేసిన ఆరోపణపై టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఎవరూ ఊహించని పరిష్కారాన్ని ఆలోచించారు. ‘ఆలయంలో కైంకర్యాలు త్వరగా ముగించమని అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు రమణ దీక్షితులు చెబుతున్నారు. వాస్తవంగా సేవల సమయంలోనూ భక్తులు ఉంటారు. అయినా సేవలన్నీ ఆగమోక్తంగా జరుగుతున్నాయో లేదో అందరికీ తెలిసేలా…శ్రీవారి గర్భలయంలో జరిగే సేవా కార్యక్రమాలు, పూజలన్నీ టివి ఛానళ్లలో లైవ్‌ ఇస్తే ఎలావుంటుందో ఆలోచించాలి. ఇది నా వ్యక్తిగత ఆలోచన మాత్రమే. చాలా దేవాలయాలు హారతి వంటివి ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాయి. ఇక్కడా అటువంటి ఆలోచన చేస్తే ఎలావుంటుంది.’ తన మనసులోని మాటను బయటపెట్టారు.

ఇది తన వ్యక్తిగత ఆలోచన మాత్రమే అని ఈవో పదేపదే చెప్పారు. అయినా శ్రీవారిని లైవ్‌లో చూపించడాన్ని భక్తులు ఎవరూ అంగీకరించరు. ఇప్పటికి శ్రీవారి మూలవిరాట్‌ ఫొటోనే ఎక్కడా లేదంటారు. సెల్‌ఫోన్‌ కూడా ఆలయంలోకి అనుమతించరు. భద్రతా కారణాల రీత్యానేకాదు…పవిత్ర రీత్యానూ దీన్ని అమలు చేస్తున్నారు. దశాబ్దాల క్రితం వెంకటేశ్వర మహత్యం సినిమా ఆలయంలో చిత్రీకరించారు. ఆ తరువాత అటువంటి వాటికి ఆస్కారమే లేకుండా నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. శ్రీవారి సేవలను, ఉత్సవాలను భక్తులందరికీ చూపించడం కోసమే…అలిపిరి వద్ద నమూనా ఆలయం నిర్మించి…అక్కడే నిర్వహించి ఎస్‌విబిసిలో ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టారు. నిత్యకళ్యాణం మాత్రం శ్రీవారి ఆలయం నుంచే రోజూ ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. అటువంటిది మూల విరాట్‌కు జరిగే సేవలే లైవ్‌లో చూపించాలన్నది ఈవో ఆలోచన.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినంత మాత్రాన్ని గర్భగుడిలోని దేవున్ని లైవ్‌లో చూపించాలనుకోవడం ఏమాత్రం భావ్యంకాదు. రద్దీని తట్టుకోడానికి ఆలయానికి నేత్ర ద్వారాలు ఏర్పాటు చేయడానికే భక్తులు అంగీకరించడం లేదు. మిగతా ఆలయాలు వేరు. శ్రీవారి ఆలయం వేరు. ఇక్కడ ప్రతిదీ భక్తుల మనోభావాలతో ముడిపడివుంటుంది. ఇక్కడి వ్యవహారాలు అతి సున్నితమైనవి. వ్యక్తిగత ఆలోచనే కావచ్చు…దాన్ని వ్యక్తిగతంగానే ఎంతమందితోనైనా చర్చించవచ్చుగానీ…ఇలా మీడియా ముందు చెప్పడం సరికాదన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*