టివి షోతో పెళ్లి కూతురు ఎంపికా? యాంకర్‌ ప్రదీప్‌ పైత్యం!

ఈ మధ్య టివిలో ఓ ప్రకటన ఆకట్టుకుంటోంది. యాంకర్‌ ప్రదీప్‌ పెళ్లి చేసుకోబో తున్నాడట. ఎక్కడికి వెళ్లినా…పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారట. ఎవరి పెళ్లికి వెళ్లినా…తరువాత నీ పెళ్లేనా అని అడుతున్నారట. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన ప్రదీప్‌ మహాశయుడు….’నాకు అన్నీ ఇచ్చిన టివి…పెళ్లి కూతుర్ని ఇవ్వకపోతుందా’ అంటూ టివి షో ద్వారానే…తనకు తగిన జోడీకి ఎంపిక చేసుకునే ఒక వింత, వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించిన ప్రకటనే అది.

ఎవరైనా అమ్మాయి తాను ప్రదీప్‌కు తగిన జోడీ అని భావిస్తుంటే….ఓ వెబ్‌సైట్‌ ద్వారా పేరు నమోదు చేసుకోవాలి. ఈ కార్యక్రమం ఎలావుంటుందో తరువాత ప్రకటిస్తారు. మా టివిలో ప్రసారం కానున్న కార్యక్రమంపై ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా స్పందించలేదు గానీ… ప్రసారం మొదలయ్యాక ఈ షో విమర్శలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు రాజులు యువరాణికి వివాహం చేయాలంటే స్వయంవరం ప్రకటించేవారు. రాజులు ఆ స్వయంవరంలో పాల్గొని, యువరాణిని మెప్పించాలి. అలా మెప్పించిన వారిని యువరాణి పరిణయమాడుతుంది. దీనికి రివర్స్‌లో ఉంది ప్రదీప్‌ వ్యవహారం. తనకు నచ్చిన యువతిని ఎంపిక చేసుకోవడం కోసం ‘స్వయంవరం’ నిర్వహిస్తున్నారు.

తన పెళ్లికూతురు షోకు యువతులు పొలోమంటూ వస్తారన్నది ప్రదీప్‌ అంచనా కావచ్చు. అసలు అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి చూపులు చూడటాన్ని తప్పుబడుతూ దశాబ్దాల క్రితమే అనేక సినిమాలు వచ్చాయి. అమ్మాయిలు ఏమైనా సంతలో పశువులా అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. అలాంటిది ప్రదీప్‌ బహిరంగంగా, టివి షో వంటిది నిర్వహించడం ద్వారా అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు.

ప్రదీప్‌కు టివి కార్యక్రమాలు ఎనలేని గౌరవాన్ని, హోదాని తెచ్చిపెట్టాయన్నమాట వాస్తవమే. తన వ్యక్తిగత అంశాన్ని కూడా టివికి ఎక్కించాలనుకోవడం సృజనాత్మకత అనుకోవాలో లేక పైత్యం అనుకోవాలో తెలియడం లేదన్నది పలువురి వ్యాఖ్య.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*