టీచర్ ఉద్యోగం వదులుకుని విలేకరిగా ఉన్నా…నేను చెబుతున్నా ఎవరూ ఈ వృత్తిలోకి‌ రావొద్దు…జర్నలిస్టుల జీవితాలు దుర్భరం..!

  • సీనియర్ పాత్రికేయులు సిపి‌ రావు అనుభవాలు

జిల్లా కేంద్రమైన చిత్తూరులో గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టుగా కొనసాగుతున్న వారిలో నేను రెండోవాడిని అని గర్వంగా చెప్పుకోగలను. ప్రముఖ దినపత్రికలలో (ఆంధ్రభూమి, డెక్కన్‌ క్రానికల్‌, ఆంధ్రప్రభ, సూర్య, ఎపిటైమ్స్‌, ది గార్డియన్‌, ది హాన్స్‌ ఇండియా, కృష్ణాపత్రిక, ప్రజాతంత్ర, దిహిందూ)‌ రిపోర్టర్‌గా పని చేశాను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సమయం వంటి దినపత్రికల్లో మార్కెటింగ్‌లో పని చేసిన విశేష అనుభవం నా సొంతం. జాతి వెలుగు, కాష్యపి వంటి చిన్న పత్రికలకు సంపాదకునిగానూ, పబ్లిషర్‌గానూ వ్యవహరించాను. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, డిఎస్‌సిలో సెలెక్ట్‌ అయిన నేను పలమనేరు మండలంలో నాలుగు సంవత్సరాలు స్పెషల్‌ టీచర్‌గా పని చేశాను. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, పాత్రికేయ వృత్తికి జీవితాన్ని పరిమితం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి రచనా వ్యాసంగంలో మంచి అభిరుచి ఉండేది. కొన్ని ముద్రణకు నోచుకున్నాయి. చాలా రచనలు నేటికీ అముద్ర స్థితిలో నా వద్ద ఉన్నాయి.

సమాజానికి ఉడతాభక్తితో సేవ చేయాన్న సంకల్ప బలం ఒకవైపు, వ్యవస్థలో వేళ్లూపాతుకుపోయిన అవినీతి, అక్రమాలను, పెచ్చరిల్లుతున్న అధికార దుర్వినియోగంపై పోరాటం జరపాలన్న పిచ్చి కోరిక ఒకవైపు నా భవితవ్యానికి ప్రేరణగా మారింది. నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండాలన్న నిబద్ధత నన్ను పాత్రికేయత వైపు నడిపించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి సాక్షిగా నేను మనసా, వాచా, కర్మణా పాత్రికేయ వృత్తిని ఏనాడూ దుర్వినియోగం చేయలేదు. ఉన్నత సంప్రదాయాలకు వారసత్వం పుచ్చుకున్న నేను సమాజానికి ఆదర్శం కావాలని కృషి చేశాను. రాజకీయ నాయకుల అకృత్యాలను, ఉన్నతాధికారుల అధికార దుర్వినియోగానికి చాకిరేవు పెట్టడమే‌ బాధ్యత అనుకున్నాను.

వృత్తిని ప్రవృత్తిగా మలచుకున్నాను. అందుకే సమాజంలో ఇమడలేక, పరిస్థితులతో రాజీపడలేక త్రిశంకు స్వర్గంలో మిగిలిపోవాల్సిన దుస్థితిని కొనితెచ్చుకున్నాను. నాటి నుంచి నేటి వరకు నిప్పులా పాత్రికేయ వృత్తికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేయగలుగుతున్నాను. తుదిశ్వాస వరకు ఇదే వృత్తిలో కొనసాగుతాను. సాటి పాత్రికేయులు నా జీవితంతో ఆడుకున్నప్పటికీ నేను నా వృత్తిలో నిదొక్కుకుని మనుగడ సాగిస్తున్నాను. నా జీవిత సహచారిణి బ్యాంకు అధికారి…మమగారు టిటిడిలో ఆడిట్‌ ఆఫీసర్‌గా పని చేయడం, ఇద్దరు కుమారులు మంచి ఉద్యోగులుగా స్థిరపడడం… పెద్ద కోడుకు సంగీత సరస్వతి…రెండో కోడుకు బ్యాంకు మేనేజర్‌…సొంత ఇల్లు..కారు…మంచి మిత్రులు భగవంతుడు నాకిచ్చిన వరాలు. మనవళ్లు, మనవరాళ్లు నా శేష జీవితానికి ఆశా దీపాలు. సిపి రావు అంటే నిప్పు, ముక్కుసూటిగా పోయే వ్యక్తి. ఎవరినీ లెక్కపెట్టరు. చివరికి జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎస్‌పిలు, ఎంఎల్‌ఏను కూడా ఢీకొనే శక్తికలిగిన జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాను. కానీ నేటి తరం జర్నలిస్టులను చూస్తే జాలి వేస్తోంది. వారికి వారే సాటి. వారి దృష్టిలో సీనియర్లు చేతకాని దద్దమ్ములు. బతకడం తెలియని వాజమ్ములు. ఎందుకూ పనికిరాని పాత కంపు. ఇలా భావించే చాలా మంది సీనియర్ల పట్ల అసహనంగా ఉండడం గమనించాను. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ నేడు జర్నలిస్టు తమ వృత్తికి ఎంత మాత్రం న్యాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

నాకు సంతృప్తి కలిగించిన ఉదంతాలు
చిత్తూరు జిల్లా కేంద్రం అభివృద్ధి గురించి నేను ఎన్నో ప్రత్యేక కథనాలు రాశాను. జిల్లా కేంద్రానికి అన్యాయం జరుగుతోందని, అన్ని రంగాల్లో చిత్తూరు జిల్లా వెనుకబడి ఉందన్న ఒకేఒక ప్రాతిపదికపై నేను రాసిన పలు రిపోర్టులు ఉన్నత వర్గాలను కదిలించాయి. రాజీవ్‌ విద్యామిషన్‌లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందని, దాదాపు రెండు కోట్లకుపైగా అవినీతి జరిగిందని ప్రచురితమైన నా రిపోర్టుకు ఆ నాటి సిఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన వైనం విదితమే. ఆనాటి చిత్తూరు ఎంఎల్‌ఏ సికెబాబుపై ఒక వార్త రాశానని నాపై పది లక్షల రూపాయకు పరువునష్టం దావా వేయడం ఎప్పటికీ మరచిపోలేను. చిత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌, కాణిపాకం కార్యనిర్వహణాధికారి, చిత్తూరు వైసిపి నేత మనోహర్‌ నా మీద పరువు నష్టం దావాలు వేసినా నేను కించిత్తు వెనక్కి తగ్గలేదు. నిష్కారణంగా నన్ను మేనేజ్‌మెంట్లు ఉద్యోగంలో నుంచి తప్పించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఇప్పటి వరకు ప్రముఖ దినపత్రికలలోనే కొనసాగుతున్నాను.

ఈనాడు దిపపత్రికలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు దరఖాస్తు చేయగా…నాకు హైదరాబాద్‌కు ఇంటర్వ్యూకు రమ్మని ఈనాడు పర్సనల్‌ మేనేజర్‌ లెటర్‌ పంపారు. అక్కడికి చేరుకోగా ఇంటర్వ్యూ చేయాల్సిన డైరెక్టర్‌ బాపినీడి విజయవాడలో ఉన్నట్లు తెలిసింది. పర్సనల్‌ ఆఫీసర్‌ నన్ను నేరుగా ఈనాడు అధిపతి రామోజీరావుగారు వద్దకు పంపారు. స్వయంగా రామోజీరావే ఇంటర్వ్యూ చేసి నన్ను మార్కెటెంగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా సెలెక్ట్‌ చేశారు. ఆ ఉదంతం నా జీవితంలో మరచిపోలేను. ఆ తరువాత ఆంధ్రజ్యోతి యండి జగదీష్‌ ప్రసాద్‌, ఉదయం పబ్లిషర్‌ దాసరి నారాయణరావు, డెక్కన్‌ క్రానికల్‌ అధిపతులు చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ప్రముఖ సంపాదకులు గజ్జల మల్లారెడ్డి (వీరికి నేను ప్రియ శిష్యుని), ఎబికె ప్రసాద్‌, వాసుదేవ దీక్షితులు, ఎంవిఆర్‌ శాస్త్రి తదితర ప్రముఖులు మార్గదర్శకత్వంలో పని చేశాను.

ఒక స్వాతంత్య్ర సమరయోధుని భార్య దయనీయ స్థితిపై డెక్కన్‌ క్రానికల్‌లో ప్రచురించిన ఒక కథనాన్ని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ నాకు ఫోన్‌ చేశారు. మా మేనేజ్‌మెంట్‌ నన్ను ప్రత్యేకంగా అభినందించిన సందర్భం ఇది. స్వాతంత్య్ర సమరయోధుడు, వాయిస్‌ ఆఫ్‌ రాయసీమ వారపత్రిక సంపాదకుడు చనిపోయిన తరువాత ఆయన భార్య సుందరమ్మకు జీవన భృతి కరువయింది. ఈ కథనాన్ని చదివిన లగడపాటి నెలకు వెయ్యి రూపాయలు తన వంతు సాయంగా ఆమె జీవితాంతం పంపించారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్న తృప్తి మిగిలింది. ఇద్దరు ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పించి వారి జీవితాలు స్థిరపడేందుకు దోహదపడ్డాను.

వర్ధమాన జర్నలిస్టుకు ఒక సూచన…
దయచేసి జీవితంలో జర్నలిస్టుగా కొనసాగాలని మాత్రం ప్రయత్నించవద్దు. నూటికి 90 శాతం జర్నలిస్టు జీవితాలు దుర్భరంగా సాగుతున్నాయి. ఈ వృత్తికి అవాటుపడినవారు వేరే మార్గంలోకి వెళ్లేందుకు సిద్ధపడరు. ఒక జర్నలిస్టు ప్రధాన మంత్రిని కూడా నిలదీసే అవకాశం ఉందన్న ఒకేఒక అపోహ చాలా మందిని ఈ వృత్తివైపు ఆకర్షించేందుకు దోహదపడుతున్నది. పదో తరగతి పూర్తిచేయనివారు సైతం నేడు జర్నలిస్టుగా చెలామణి కావడం ఈ వృత్తికి పట్టిన జాఢ్యంకాక మరేమిటి? గతంలో చిత్తూరులో పది మందికి మించి రిపోర్టర్లు ఉండేవారు కాదు…అప్పడు విలేకరులంటే ప్రత్యేక గుర్తింపు, అభిమానం ఉండేది. సిపి రావు, శ్రీహరి, సుభాష్‌…అంటే తెలియనివారు ఉండేవారు కాదు. ఆనాడు సిఎంగా చంద్రబాబు నాయుడు చిత్తూరులో నాయుడు బిల్డింగ్‌లో కూర్చుని ప్రెస్‌ రిపోర్టర్లను పేరుపేరునా పిలిచి ప్రెస్‌మీట్లు పెట్టడం ఎన్నటికీ మరవలేం. ప్రెస్‌మీట్‌ కోసం ఇంటికి కార్లు పంపేవారు. ప్రముఖ పాత్రికేయుడు శ్రీహరికి ఆనాటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ, అమితాబచ్చన్‌, రోశయ్య వంటి ప్రముఖలతో వ్యక్తిగత పరిచయాలు ఉండేవంటే నమ్మక తప్పదు. శ్రీహరి అంటే చాలు నాయకులకు, అధికారులకు టెర్రర్‌….మరి ఇప్పటి పరిస్థితులు ఏమిటి? అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చిత్తూరులో ఎంతమంది జర్నలిస్టులను పలకరిస్తున్నారు? తనకు  ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న సీనియర్లను చంద్రబాబు నాయుడు  ఎందుకు ఖాతరు చేయడం లేదు? ఇప్పుడు చిత్తూరులో వంద మంది జర్నలిస్టులున్నారు. కనీసం ప్రెస్‌మీట్లకు వెళ్లేవారిని కూర్చోమని చెప్పే దిక్కులేదు. చెట్లకింద, గోడకు ఆనుకుని వార్తలు రాసుకోవాల్సిన దుస్థితి. పేజీలు నింపుకోవాల్సిన స్థితిలో ఉన్నా విలేకరులు తాము పిలిచినా, పివకపోయినా వస్తారన్న భరోసా అధికారులు, నాయకుల్లో కనిపిస్తోంది. ఇక విలేకరుల జీత భత్యాల విషయానికొస్తే అదో విషాదం….ఒక ప్రముఖ దినపత్రికలో సంపాదకునిగా పని చేస్తున్న ఓ సీనియర్‌ జర్నలిస్టు నెల జీతం ఆరు లక్షలట. అదే పత్రికలో చిత్తూరులో పనిచేసే రిపోర్టర్‌కు వచ్చేది మూడు వేల రూపాయలు మాత్రమే. అదీ జీతం కాదు…లైన్‌ అకౌంట్‌. కేవలం ప్రముఖ దినపత్రికల్లో పనిచేసే స్టాఫ్‌ రిపోర్టర్లు, సబ్‌ ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లకు మాత్రమే నెలవారి వేతనాలు ఇస్తున్నారు. ఇటీవల కొన్ని తెలుగు దినపత్రికల్లో పనిచేసే స్టాఫ్‌ రిపోర్టర్లకూ జీతాలు అందడం లేదు. ప్రకటనలు తెచ్చుకుని, దానిపై వచ్చే కమీషన్‌తో జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడడం జర్నలిస్టుల దయనీయ స్థితిగతులను తేటతెల్లం చేస్తున్నాయి. జిల్లాలో గత నాలుగు దశాబ్దాల జర్నలిస్టు జీవితాలను విశ్లేషిస్తే…కేవలం పది మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుని స్థిరపడి ఉంటారు. అందుకే ఎవరూ ఈ వృత్తిని జీవనాధారంగా చేసుకోవద్దని చెబుతున్నాను. జీతాలు లేకున్నా, జీవితాలు గడవకున్నా ఒక నమస్కార బాణం, కప్పు ఛాయ్‌తో మనం ఖుషీ అవుతున్న విషయాన్ని అంగీకరించం. మన మేనేజ్‌మెంట్లు అంటే ఒణుకు, దడ. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని భయం. బయట పులి…ఇంట్లో పిల్లి. ఇదంటీ నూటికి 70 శాతం గ్రామీణ రిపోర్టర్లుగా కొనసాగుతున్న జర్నలిస్టుల స్థితి గతులు.

ఎక్ట్రానిక్‌ మీడియా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో ప్రింట్‌ మీడియాపై పాఠకలోకం పెద్ద ఆసక్తి కనబరచపోవడం విదితమే. కానీ ప్రింట్‌, ఎక్ట్రానిక్‌ మీడియాలో పాత్రికేయులో దాదాపు 80 శాతం కనీస జీవనాధారం లేక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. నేడు పత్రికా రంగం మొత్తం వ్యాపారమయంగా మారింది. యాజమాన్యాలు తమ వ్యాపారానికి పాత్రికేయులను పెట్టుబడిగా వాడుకుంటున్నాయి. అందుకే సీనియర్‌ జర్నలిస్టుగా ఒక హెచ్చరిక చేసేందుకు సాహసిస్తున్నాను. మనం దోపిడీకి గురవుతున్నాం. ఈ వృత్తిలో భవిష్యత్తు మృగ్యం. నీతి నిజాయితీ అనే మాటలకు ఇక్కడ విలువలేకుండా పోయింది. పాలిటిక్స్‌ ఈస్‌ ది లాస్ట్‌ రిసార్ట్‌ ఆఫ్‌ ఫూల్స్‌ అని బెర్నార్డ్‌ షా చెప్పిన సూక్తి నేటి జర్నలిజానికి వర్తించడం గమనార్హం. ఇలా చెప్పడంలో ఏదైనా తప్పువుంటే నేను క్షంతవ్యుడిని.

  • – సిపి రావు, చిత్తూరు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*