టీడీపీ అవినీతిపై పుస్తకం…దేశంలోని అన్ని పార్టీలకు ఇస్తాం

చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ దోపిడీపై పుస్తకం తీసుకొచ్చి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు అందజేస్తామని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం బొత్స మాట్లాడుతూ దోపిడీ వల్ల రాష్ట్రానికి ఏ మేరకు నష్టం చేశారు.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టారనే వాస్తవ విషయాలను పుస్తకరూపంలో స్పష్టంగా వివరిస్తామని చెప్పారు. టీడీపీ నేతలు చేసే అవినీతిని చూస్తూ కళ్లు మూసుకుని కూర్చోలేమన్నారు. ‘‘మమ్మల్ని వాచ్‌డాగ్‌లాగా ప్రతిపక్షంగా ఉండమని ప్రజలు ఎన్నుకున్నారు. వారికి ఇబ్బందులు కలిగే కార్యక్రమాలు జరిగితే.. వాటిని ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి చెప్పాలి. తగిన ఏజెన్సీలకు తెలియజేయాలి. ప్రజలకు ఆసరాగా ఉండాలనేదే ప్రతిపక్షం బాధ్యత. మీలా పిరికిపందల్లా వ్యవహరించం’’ బహిరంగంగా ప్రజలకు వాస్తవాలు చెబుతామన్నారు. కేంద్రం వత్తాసుతో టీడీపీ ఎంత దోపిడీ చేసిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడేమో బీజేపీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధాలు ఉన్నాయంటూ కొత్త నాటకానికి తెరలేపి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఏర్పడి 8 ఏళ్లయిందని, పార్టీ పుట్టినప్పటి నుంచి ఒంటరిగానే పోటీ చేసి ప్రజల మన్ననలు పొందిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*