డేటా చోరీ కేసులో టిడిపి పసలేని వాదనలు..!

తెలుగుదేశం పార్టీకి ఐటి సేవలు అందిస్తున్న ఐటి గ్రిడ్‌ అనే సంస్థ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని పౌరుల సమాచారాన్ని అక్రమ పద్ధతుల్లో సంపాదించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తోందన్న వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఐటి గ్రిడ్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల వివరాలు సేకరించిందని, టిడిపికి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించడానికి వినియోగిస్తుందని లోకేశ్వర్‌ రెడ్డి వ్యక్తి హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డిడిస్క్‌లను సీజ్‌ చేశారు.

ఈ వివాదం పెద్ద దుమారమే రేపుతోంది. రాజకీయ కక్షతో కెసిఆర్‌ ప్రభుత్వం, టిడిపికి ఐటి సేవలు అందిస్తున్న సంస్థపై దాడులకు పాల్పడిందనేది తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించిన డేటా చోరీ అయితే….తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రశ్నిస్తున్నారు. ఆ సంస్థ వద్ద ఉన్నదంతా బహిరంగంగా లభ్యమయ్యే సమాచారమేనని, ఇందులో నేరం ఏముందని కూడా తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ పరిశీలించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాదనల్లో పసలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన డేటా చోరీ అయితే తెలంగాణ ప్రభుత్వానికి బాధ ఏమిటని చంద్రబాబు అడిగారు….ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎర్రచందనం తరలిపోతుంటే, తెలంగాణలో ఫలానాచోట ఎర్రచందనం ఉందని అక్కడివారు ఎవరైనా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే….తెలంగాణ పోలీసులు పట్టించుకోవాల్సిన పనిలేదా? అది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంపద కాబట్టి….దొంగలను వదిలేయాలా? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి తెలంగాణలో హత్యకు గురవుతారు. మతుడు ఏపివాసి కాబట్టి…తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టకుండా చేతులు దులుపుకోవాలా? ఈ కోణంలో చంద్రబాబు చేస్తున్న వాదనలో అర్థంలేదు.

ఇక టిడిపి నేతలు చెబుతున్నట్లు ఆ సంస్థ వద్ద ఉన్నది బహిరంగంగా అన్నిచోట్లా లభించే సమాచారమే అనేదాంట్లోనూ నిజంలేదు. ఆధార్‌ నెంబర్లు, ఫోన్‌ నెంబర్లు, కులం తదితర వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉన్న డేటాలో ఉన్నాయన్నది పోలీసులు చెబుతున్నది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని కూడా తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇతరుల ఆధార్‌ నెంబర్లు కలిగివుండటం, వాటిని వినియోగించడం కచ్చితంగా పెద్ద నేరమే. ఈ మాటను సుప్రీంకోర్టే చెప్పింది. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తల సమాచారం మాత్రమే ఉందని కూడా టిడిపి దబాయిస్తోంది. కానీ ఇక్కడ ఏపిలోని ఓటర్ల మొత్తం డేటా ఐటి గ్రిడ్‌ కంప్యూటర్లలో ఉందని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

తెలుగుదేశం కార్యకర్తల డేటా మాత్రమే, బహిరంగంగా లభించే సమాచారం మాత్రమే ఐటి గ్రిడ్‌ వద్ద ఉంటే….తెలంగాణ పోలీసులు కూడా ఆ సంస్థను చేయగలిగేది ఏమీ ఉండదు. విచారణను ఎదుర్కొంటే సరిపోతుంది. ఇటువంటి ఆరోపణలు ఒక సంస్థపైన వచ్చినపుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా విచారణకు సహకరించాలి. అయితే…తెలుగుదేశం పెద్దలు, పార్టీ పెద్దలు స్పందించిన తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఐటి గ్రిడ్‌ అనే సంస్థపై దాడి చేస్తే…అదేదో తెలుగుదేశం పార్టీపైన దాడి అనేట్లు చెబుతున్నారు. ఐటి గ్రిడ్‌ సంస్థ టిడిపికి సేవలు అందించినంత మాత్రాన….అది ఏదైనా అక్రమాలకు పాల్పడితే పోలీసులు విచారించకూడదా?

ఈ అంశం ఇంత పెద్ద వివాదంగా మారడం వెనుక ఉన్న కారణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఓటర్లకు సంబంధం లేకుండా లక్షలాది ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందుతున్నాయి. ఎవరి ఓటు అయితే తొలగించాలో వారికిగానీ, ఎవరి పేరుతో దరఖాస్తు చేశారో వారికిగానీ తెలియకుండా ఎవరో దరఖాస్తులు చేస్తున్నారు. సర్వే పేరుతో గ్రామాలకు వచ్చిన టిడిపి కార్యకర్తలు తమ వద్ద అప్పటికే ఉన్న డేటా ఆధారంగా చేసుకుని ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశారని వైసిపి ఆరోపిస్తోంది. ఇది రెండు మూడు నెలలుగా జరుగుతున్న తతంగం. చంద్రగిరి వంటి చోట్ల సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్నారంటే…సర్వే కోసం వచ్చిన వారిని పట్టుకుని టాబ్‌లను పోలీసులకు అప్పగించారు వైసిపి కార్యకర్తలు. లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడం ఎన్నికల సంఘం అధికారులకూ విస్మయం కలిగించింది. ఈ దరఖాస్తులపై అన్ని జిల్లాల్లో పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలోనే….హైదరాబాద్‌లో లోకేష్‌ రెడ్డి అనే వ్యక్తి కీలకమైన ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఐటి గ్రిడ్‌ అనే సంస్థ ఇదంతా చేస్తోందన్నది ఆ ఫిర్యాదు సారాంశం. ప్రభుత్వం సేకరించిన ప్రజల డేటా ఐటి గ్రిడ్‌ సంస్థకు చేరిందని, అది దాన్ని దుర్వినియోగం చేస్తోందని లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సహజంగానే తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. వాస్తవంగా ఎన్నికల సంఘం కూడా స్పందించింది. పలు జిల్లాల్లో కేసులు నమోదు చేయించింది. వాళ్లు కూడా ఈ దరఖాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో మూలాలు తెతికే పనిలో ఉన్నారు. ఇంతలోనే లోకేశ్వర్‌ రెడ్డి ఆ మూలం హైదరాబాద్‌లో ఉందంటూ పోలీసులకు ఉప్పందించారు.

ఇదిలావుంటే…తమ ఓట్లును టిడిపి తొలగిస్తోందంటూ వైసిపి తీవ్రస్థాయిలో స్పందించి ఫిర్యాదు చేయడంతో, అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న టిడిపి, తమ ఓట్లు తొలగిస్తున్నారంటూ వైసిపిపై ఆరోపణలకు దిగింది. టిడిపి ఓట్ల తొలగింపునకు కూడా ఆ పార్టీ వాళ్లే దరఖాస్తులు చేయించి, తమపై ఆరోపణలు చేస్తున్నారన్నది వైసిపి ఆరోపణ. అయినా….వైసిపి కుట్రచేసి టిడిపి ఓట్లు తొలగిస్తుంటే ముందుగా ఆ పార్టీ ఫిర్యాదు చేసివుండాలి. అలాకాకుండా టిడిపి ఫిర్యాదు చేసే సరికి మొత్తం వ్యవహారాన్ని గందరగోళపరచడానికి టిడిపి కూడా ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టింది. ఎన్నికల సంఘం గందరగోళానికి గురయి ఈ వ్యవహారాన్ని అంతటితో మూసేస్తుందని టిడిపి అంచనా వేసింది. అనూహ్యంగా ఐటి గ్రిడ్‌ వ్యవహారం బయటపడటంతో ఇప్పుడు టిడిపి తంటాలు పడుతోంది.

అసలు విషయాన్ని పక్కనపెట్టి…కేసిఆర్‌ ప్రభుత్వం కక్ష సాధింపుతో ఐటి గ్రిడ్‌ సంస్థపై కేసులు పెట్టిందంటూ ఎదురుదాడికి దిగింది టిడిపి. పైగా దీన్ని రెండు రాష్ట్రాల వివాదంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. టిడిపి ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలోనూ, ఐటి దాడుల విషయంలోనూ ఇదే విధంగా రాజకీయంగా ఎదురుదాడి చేసింది. ఐటి సంస్థ ఉద్యోగులను తెలంగాణ పోలీసులు విచారిస్తుంటే….వాళ్లు కిడ్నాపైనట్లు ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెట్టించి పోలీసులను తెలంగాణకు పంపింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమాచారాన్ని దొంగించారని చెబుతుంటే…అలాంటి వాళ్లకు మద్దతుగా పోలీసులను నిలడెట్టే ప్రయత్నం చేసింది.

ఈ పరిస్థితుల్లో డేటా కేసు నిగ్గు తేలాలంటే ఎన్నికల సంఘ, ఆధార్‌ ప్రాధికార సంస్థ రెండూ చొరవ తీసుకుని….ఏదైనా స్వతంత్య్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. అసలు ఐటి గ్రిడ్‌ ఎటువంటి సమాచారాన్ని తమ వద్ద అక్రమంగా నిల్వవుంచుకుంది, ఆ సమాచారంతో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది, దానివల్ల జరిగిన నష్టమేమిటి అనే అంశాలను యుద్ధప్రాతిపదికన విచారణ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాకాకుంటా ఇదేదో టిడిపి – వైసిపి – టిఆర్‌ఎస్‌ పార్టీల వ్యవహారంగా వదిలేయడానికి వీల్లేదు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల హక్కులపై నమ్మకం ఉంటే…ఐటి గ్రిడ్‌ అక్రమాలకు పాల్పడిందీ లేదనిదీ నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ విచారణ జరిపించాలి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*