తప్పు కంప్యూటర్‌ది….శిక్ష ఉద్యోగులకు..టిటిడిలో ఇదీ సంగతి !

టిటిడిలో ప్రతిదాన్ని కంప్యూటరీకరించారు. శ్రీవారి దర్శనం టికెట్లయినా, గదుల కేటాయింపు అయినా, జమా ఖర్చులైనా….ప్రతిదీ కంప్యూటర్‌ ద్వారానే జరుగుతోంది. టిటిడికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన కోసం టిసిఎస్‌ అనే ప్రైవేట్‌ సంస్థ పని చేస్తోంది. ఇప్పుడు ఇదంతా చెప్పడం ఎందుకంటే….సాఫ్ట్‌వేర్‌లో జరిగిన పొరపాటుకు 70 మంది ఉద్యోగులు శిక్ష అనుభవించాల్సివస్తోంది. ప్రైవేట్‌ సంస్థ తప్పిదానికి టిటిడి ఉద్యోగులు ఇబ్బంది పడాల్సివస్తోంది. ఇంతకీ విషయం ఏమంటే….

భక్తులు తమకు కేటాయించే గదుల్లో 24 గంటలకు మించి ఉండకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకోరోజు అదనంగా ఉండొచ్చు. అంటే 48 గంటలు మాత్రమే ఒక గదిలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంతకు మించితే 100 శాతం నుంచి 400 శాతం దాకా అదనంగా డబ్బులు చెల్లించాల్సివుంటుంది. మొదటి 24 గంటల తరువాత గంట గ్రేస్‌ టైం ఇస్తారు. గంట అదనపు సమయం ఉన్నందుకు పైసా కూడా అదనంగా పడదు. వాస్తవంగా ముందుగా గ్రేస్‌ టైం 2 గంటలు ఉండేది. దాన్ని 2017 డిసెంబర్‌లో గంటలకు తగ్గించారు.

భక్తులు గదిలో ఎప్పుడు ఖాళీ దిగింది, ఎప్పుడు ఖాళీ చేసింది అన్నీ లెక్కించి (పైన చెప్పిన నిబంధనల ప్రకారం) కంప్యూటర్లే రెంట్‌ నిర్ధారిస్తాయి. అయితే….ఈ మార్పులను కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయకపోవడంతో 2017 డిసెంబర్‌లో అదనపు సమయం స్టే చేసిన భక్తుల నుంచి అదనపు నగదును కాటేజీల వద్ద ఉన్న ఉద్యోగులు వసూలు చేయలేదు. 05.01.2018న ఈ సాఫ్ట్‌వేర్‌ లోపాన్ని సరిచేశారు. ఆ తరవాత మామూలుగా గదుల అద్దె కంప్యూటర్‌ ప్రకారం వసూలు అవుతోంది.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అవడానికి మునుపు భక్తుల నుంచి అదనపు నగదు వసూలు చేయకపోవడాన్ని ఆడిట్‌ అధికారులు గుర్తించారు. ఈ లోపం వల్ల టిటిడికి రూ.4,20,679 నష్టం వాటిల్లినట్లు లెక్కలు తేల్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది సాఫ్ట్‌వేర్‌ లోపం వల్ల తలెత్తిన సమస్య. అయితే….దీనికి 70 మందికిగా సూపరిండెంట్లు, ఏఈవోలు, మేనేజర్లను బాధ్యులను చేస్తూ క్రమశిక్షణా విభాగం (డిఏ సెక్షన్‌) నెల క్రితం నోటీసులు జారీ చేసింది.

దీంతో ఆ ఉద్యోగులంతా టెన్షన్‌ పడుతున్నారు. ఈ నోటీసుల కారణంగా ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన కొందరికి పెన్షన్‌ సెటిల్‌మెంట్‌ జరగలేదు. సాఫ్ట్‌వేర్‌ లోపం వల్ల నష్టం జరిగితే….ఉద్యోగులను బాధ్యులను చేయడం ఏమిటని ఆవేదన చెందుతున్నారు. కంప్యూటర్‌ ప్రకారం తాము నగదు వసూలు చేస్తామని, అయినా ఇటువంటి సాంకేతికమైన పొరపాట్లకు కూడా తమను ఇబ్బందిపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయినా….ఇది అవినీతి కాదు. భక్తులు గంట సమయం అదనంగా గదుల్లో ఉండటమే టిటిడికి జరిగిన నష్టంగా లెక్కలు వేసి తమకు నోటీసులు జారీ చేయడం భావ్యం కాదని అంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ నోటీసులను రద్దు చేయాలని కోరుతున్నారు.

….. ధర్మచక్రం ప్రతిధి, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*