తలనీలాలలో శ్రీవారికి రూ.100 కోట్లకుపైగా నష్టం..! అయినా టిటిడి అధికారులకు దిగుల్లేదు..!

తిరుమల శ్రీనివాసునికి భక్తులు హుండీలో వేసే కానుకలేగాదు… భక్తితో సమర్పిస్తున్న కురుల ద్వారానూ సిరులు కురుస్తున్నాయి. తలనీలాల విక్రయంతో శ్రీవారికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోతున్నా టిటిడి అధికారులకు ఏమాత్రం దిగులున్నటు లేదు.

తలనీలాల ద్వారా 2011-12లో రూ.160 కోట్ల ఆదాయం సమకూరింది. 2013-14లో ఏకంగా రూ.240 కోట్లు వచ్చింది. ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. 2014-15లో రూ.169 కోట్లకు పరిమితమయింది. 2015-16లో రూ.150 మాత్రమే సమకూరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.150 కోట్లు రావచ్చని అంచనా వేశారు. ఆ లక్ష్యం నెరవేరలేదు. 2018-19లో రూ.125 కోట్లు అంచనా వేసినా రూ.100 కోట్లకే పరిమితం అయింది. 2019-20లో రూ.100 కోట్లు మాత్రమే అంచనా వేశారు. ఆమేరకు వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లు అంచనా వేశారు. ఆచరణలో తగ్గడం తప్ప పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.

2013-14లో లభించిన రూ.240 కొట్లతో పోల్చితే మూడేళ్లుగా ఏడాదికి రూ.140 కోట్లు తగ్గిపోయినట్లు లెక్క. తలనీలాల ఆదాయం ఏటా ఎందుకు తగ్గిపోతోంది, వ్యాపారులు ఏమైనా రింగ్ అవుతున్నారా, ఇందులో ఏవైనా అక్రమాలు జరుగుతు న్నాయా అని పట్టించుకుంటున్న అధికారులే కరువయ్యారు. టీటీడీ వద్ద టన్నులకొద్దీ తలనీలాలు నిల్వ ఉండిపోతున్నాయి. సకాలంలో అమ్ముడుపోవడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో కూడా టీటీడీ అధ్యయనం చేయడం లేదు.

ఆదాయంలో కోటో రెండు కోట్లో తేడా వస్తే మార్కెట్ లో వచ్చిన ఒడిదుడుకుల వల్ల సమస్య తలెత్తిందని సరిపెట్టుకోవచ్చు. ఒకేసారి 100 కోట్ల నుంచి 150 కోట్లు తేడా వస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు మార్కెట్ లో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే టీటీడీలో అటువంటి ప్రయత్నం జరిగినట్లుగా అనిపించదు. టీటీడీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తలనీలాల మార్కెట్ పైన అధ్యయనం చేసి ఆదాయం పెంచుకోడానికి ఉన్న మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*