తాడిపత్రి ఆశ్రమ వివాదం : రాజకీయ వివాదానికి మతం రంగు!

గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ వార్తలకు కేంద్రబిందువుగా మారింది. అక్కడి ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులకు – ఎంపి జెసి దివాకర్‌ రెడ్డికి మధ్య వివాదం తలెత్తి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి తెలిసిందే. అయితే… దీనికి మతం రంగు పులిమి, వివాదాన్ని సార్వజనీనం చేసే ప్రయత్నాలు జరుగు తున్నాయి. హిందూ దేవుళ్లను దూషిస్తున్నారంటూ ఆశ్రమానికి వ్యతిరేకంగా ఒక మత విశ్వాసకులను రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి.

తాడిపత్రి ప్రబోధానందకు జెసి దివాకర్‌ రెడ్డికి మధ్య దీర్ఘకాలంగా విభేదాలున్నాయన్నది ఆ ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు ప్రబోధానంద కుమారుడిని జెసి మనుషులు హత్య చేశారన్న ఆరోపణలూ వస్తున్నాయి. దాంతో ప్రబోధానంద ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారని, మళ్లీ వచ్చి ఆశ్రమం నిర్మించి స్థిరపడ్డారని వార్తలు వస్తున్నాయి. ఆ పాత చరిత్ర ఎలావున్నా….ఇప్పుడు ప్రబోధానంద కుమారుడు బిజెపిలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ప్రబోధానంద కుమారుడు ఒకరు బిజెపి తరపునగానీ, వైసిపి తరపునగానీ పోటీ చేస్తారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే వినాయక చవితి సందర్భంగా….ఆశ్రమ సమీపంలోని చిన్నపొడమల గ్రామస్తులను రెచ్చగొట్టి, గొడవలు పెట్టి – ఆశ్రమాన్ని వివాదంలోకి లాగారని ప్రబోధానంద శిష్యులు చెబుతున్నారు. తాడిపత్రిలో ప్రబోధానంద బలపడుతున్నారు. ఆయన శిష్యగణం పెరుగతోంది. ఇది తనకు రాజకీయంగా నష్టమని దివాకర్‌ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆశ్రమాన్ని మూసేయించాలని నిర్ణయించుకున్నారు. దీనికి వినాయక చవితి ఉత్సవాలను అడ్డుపెట్టుకుని, గొడవలు సృష్టించారు – అని ప్రబోధా శిష్యులు ఓ టివి ఛానల్‌లో వివరించారు.

ప్రబోధానంద శిష్యుల ఆరోపణలు అలావుంటే….ఘర్షణల నేపథ్యంలో దివాకర్‌ రెడ్డి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగడం, ఆశ్రమాన్ని మూసేసే దాకా ఆందోళన విరమించేది లేదని భీష్మించి కూర్చోవడం తెలిసిందే. ఆఖరికి పోలీసులు, ఉన్నతాధికారులు కలిసి ఆశ్రమంలోని కొందరు భక్తులను బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు. దీంతో దివాకర్‌ రెడ్డి తాను విజయం సాధించానని భావించారు.

ఇంతలో ఆశ్రమ నిర్వాహకులు హైకోర్టు నుంచి ఓ ఉత్తర్వు తెచ్చుకున్నారు. ఆశ్రమం లోపల స్థిర నివాసం ఏర్పరచుకున్న ఎవరినీ బలవంతంగా అక్కడి నుంచి పంపొద్దని, ఎవరైనా స్వయంగా వెళ్లిపోవాలనుకుంటే భద్రత కల్పించాలని కోర్టు ఆదేశిచింది. దీంతో మళ్లీ వివాదం మొదటికొచ్చింది.

ఇప్పుడు కొత్త చర్చ మొదలయింది. ప్రబోధానంద ఆశ్రమం….హిందూ దేవతలను, దేవుళ్లను కించపరిచే పుస్తకాలు ప్రచురిస్తోందని, స్వయంగా ప్రబోధానంద హిందూ దేవతలను దూషిస్తున్నారంటూ…ఆయన ప్రబోధాల వీడియోల్లోని కొన్ని భాగాలను బయటకు తీసి ప్రసారం చేస్తున్నారు. ఓ టివి ఛానల్‌లో తాడిపత్రి ఘర్ణల విషయాన్ని, దాని వెనుక ఉన్న రాజకీయాలను పక్కనపెట్టి…ప్రబోధానంద హిందూ దేవతలను అలా దూషించారు, ఇలా దూషించారు అంటూ గంటల కొద్దీ చర్చ నిర్వహించారు. మొత్తంగా చూస్తుంటే…రాజకీయ వివాదానికి మతం రంగు పులిమి, ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్న ఎత్తుగడులు కనిపిస్తన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*