తిరుపతిలో కరోనా ఆస్పత్రులు నిండిపోతున్నాయి…తస్మాత్ జాగ్రత్త..!

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా ఆస్పత్రిలు నిండిపోతున్నాయి. కేసులు ఇలాగే పెరిగితే ఆస్పత్రుల్లో బెడ్డు దొరకడమూ కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అదనపు ఏర్పాట్లు చేస్తోంది.

చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 1300 పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో 800 మందికిపైగా కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత తిరుపతి, రుయా ఆస్పత్రులను కోవిడ్ చికిత్స కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. తిరుచానూరు పద్మావతి నిలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చారు.‌ కేసులు పెరగడంతో పద్మావతి నిలయాన్ని కూడా ఆస్పత్రిగా మార్చారు. విక్రతమాల వద్దకు క్వారంటైన్ సెంటర్ తరలించారు. పుంగనూరు, పుత్తూరు, అంగళ్లలోనూ క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయి.

ఆదివారానికి రుయాలోని బెడ్లన్నీ నిండిపోయాయి. పద్మావతి నిలయంలో 400 బెడ్లు ఉండగా…360 మంది చికిత్సపొందుతున్నారు. దీంతో ఇక్కడే మరో 400 బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవికూడా చాలకపోవచ్చన్న అంచనాతో…టిటిడి శ్రీనివాసం, ఆ తరువాత విష్ణు నివాసం విశ్రాంతి సముదాయాలనూ కోవిడ్ సెంటర్లుగా మార్చడానికి‌ ప్రణాళిక సిద్ధమయింది.

ప్రస్తుతం రోజుకు వంద దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదే రీతిలో కేసులు పెరిగితే…పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణు నివాసం నిండిపోడానికి ఎక్కవ సమయం పట్టదు. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండటమే ప్రజల ముందు ఉన్న కర్తవ్యం. అనవసరంగా బయట తిరగకపోవటం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటివి తప్పనిసరి. కరోనా సోకిన తరువాత అవస్థపడటం కంటే ముందే జాగ్రత్తపడటం మంచిది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*