తిరుపతిలో టిడిపిపై యాదవులు గుర్రు..!

తిరుపతిలో యాదవ సామాజికవర్గం బలంగా ఉంది. మొదటి నుంచి యాదవులు టిడిపికి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో యాదవులు తెలుగుదేశం పార్టీ పల్ల గుర్రుగా ఉన్నారు.

తుడ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌ ఎంఎల్‌ఏ టికెట్టు ఆశించారు. తమనసులోని మాటను అధిష్టానానికి చెప్పారు. అయినా పట్టించుకోకుండా సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ సుగుణమ్మ వైపు చంద్రబాబు మొగ్గుచూపారు. దీంతో అలిగిన నరసింహ యాదవ్‌ తనకు ప్రాణప్రదమైన పసుపు చొక్కొను పక్కనపెట్టి తెల్లచొక్కాతో తిరిగారు. ఏదోవిధంగా నరసింహయాదవ్‌ ఆగ్రహాన్ని చల్లబరిచారు.

తాజాగా తిరుపతిలో బలమైన యాదవ నాయకుడిపై ఓ పత్రికల్లో పెద్ద కథనం ప్రచురితమయింది. ఆ నాయకుడు రౌడీయిజం చేస్తూ, భూకబ్జాలకు పాల్పడుతూ వందల కోట్లు సంపాదించారన్నది ఆ కథనం సారాంశం. ఆ నాయకుడు మొదటి నుంచి టిడిపిలోనే ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్టు ఆశించారు. అధిష్టానం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై రౌడీ, భూకబ్జాదారుడంటూ వార్తలు వచ్చాయి. దీని వెనుక స్థానిక టిడిపి నేతలున్నారని యాదవ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు టిడిపికి అండగావున్న వారిపైనే ఇటువంటి అభాండాలు వేస్తారా….ఆక్రోశం వెల్లగక్కుతున్నారు.

తిరుపతిలో కాపుల తరువాత యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమ సామాజిక తరగతి వారు ఎంఎల్‌ఏ కావాలన్నది ఎప్పుటి నుంచో యాదవుల్లో ఉన్న ఆకాంక్ష. తాము నమ్ముకున్న టిడిపి కాపులకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇది యాదవుల్లో అసహనంగా మారుతోంది. ఎన్నాళ్లనాయి…చిన్నచిన్న పదవులకే పరిమితం కావాల్సిందేనా అనే ఆవేదన యాదవుల్లో వ్యక్తమవుతోంది. తమ వద్ద డబ్బులు లేవన్న కారణంగానే టికెట్టు ఇవ్వడం లేదని వాపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో యాదవ నాయకులు ఏ మేరకు టిడిపి విజయం కోసం పని చేస్తారనేది ఆ పార్టీ నేతల్లోనే ఉన్న అనుమానం. ఏమైనా ఇది టిడిపికి ఎంతోకొంత నష్టం చేస్తుందనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*