తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరికొత్త ప్రయోగం! వినియోగ ఛార్జీల వసూళ్ల బాధ్యత స్వచ్ఛంద సంస్థకు..!!

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వినియోగ ఛార్జీలు వసూలు చేయడానికి అధికారులు సరికొత్త ప్రయోగానికి పూనుకున్నారు. మున్సిపల్‌ సిబ్బందితో పనిలేకుండా….రాస్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ఛార్జీలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనివల్ల ఇందులో అవినీతి అక్రమాలకు బ్రేక్‌పడటంతో పాటు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.

తిరుపతి నగరంలోని నివాస గృహాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, కల్యాణమండలపాలు, ఆస్పత్రులు, కుటీర పరిశ్రమల నుంచి రోజూ మున్సిపాలిటీనే చెత్త సేకరిస్తోంది. దీనికి సంబంధించి వినియోగదారులు నిర్ణీత ఛార్జీలను చెల్లించాల్సివుంది. నివాస గృహాలు కాకుండా వ్యాపార, వాణిజ్య సంస్థలే 10 వేల దాకా ఉన్నాయి. అన్నింటి నుంచి ఫీజులు వసూలైతే నెలకు రూ.20 లక్షలకుపైగా ఆదాయం రావాల్సివుంది.

మున్సిపాలిటీ చెత్త సేకరణ చేస్తున్నా వినియోగ ఛార్జీలు మాత్రం సక్రమంగా వసూలవడం లేదు. మున్సిపల్‌ సిబ్బంది వెళ్లి వసూలు చేయకపోవడం ఒక కారణమైతే….వసూలైన డబ్బులు సక్రమంగా జమ కాకపోవడం ఇంకో కారణం. దీన్ని గమనించిన కమిషనర్‌ విజయరామరాజు….వినియోగ ఛార్జీల వసూలు బాధ్యతను స్వచ్ఛంద సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రీయ సేవా సమితి (రాస్‌)ను ఎంపిక చేశారు.

తిరుపతి నగరాన్ని పది ప్రాంతాలుగా విభజించి, ఒక్కో ప్రాంతానికి ఒకరిని రాస్‌ సంస్థ నియమిస్తుంది. ఈ ఉద్యోగులు ప్రతి దుకాణానికి, వాణిజ్య సంస్థ వద్దకు వెళ్లి వినియోగ ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ చెల్లింపులను తమ వద్ద ఉన్న పరికరంలో నమోదు చేయడం వల్ల క్షణాల్లో డబ్బులు అందినట్లు సంబంధిత వినియోగదారునికి మెసేజ్‌ వెళుతుంది. అదేవిధంగా ఏరోజు ఎంత డబ్బులు వసూలయింది, ఎవరి నుంచి వసూలయింది అనే వివరాలు వచ్చేస్తాయి. ఎవరు చెల్లించిందీ, ఎవరు చెల్లించనిదీ కూడా ఏనెలకు ఆ నెల తెలిసిపోతుంది.

ఈ కొత్త విధానం వల్ల అక్రమాలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. సిబ్బంది వసూలు చేసేటప్పుడు…నిర్ణీత ఫీజుంటే ఎక్కువగా వసూలు చేసుకుని, తక్కువ మొత్తంలో మున్సిపాలిటీకి చెల్లించేవారని అంటున్నారు. ఇప్పుడు శానిటరీ ఇన్స్‌పెక్టర్లు ఉన్నా…వాళ్లపని పారిశుద్ధ్యం సక్రమంగా ఉందా లేదా చూడటం వరకే. ఫైన్‌ విధించినా…దాన్ని వాళ్లు వసూలు చేయడానికి వీళ్లేదు. రాస్‌ నియమిస్తున్న ఉద్యోగుల ద్వారానే ఆ చెల్లింపులూ జరుగుతాయి.

మూడు నెలలు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని, ఆ తరువాత లోటుపాట్లను సరిచేసి మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుతామని కమిషనర్‌ విజయరామరాజు చెప్పారు. ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు రాస్‌కు నెలకు లక్షా 30 వేలు మాత్రమే చెల్లిస్తామని వెల్లడించారు. ఈ విధానం విజయవంతమైతే…మున్సిపల్‌ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. మొదటి దశలో దుకాణాలు, వాణిజ్య సముదాయాల నుంచి వినియోగ ఛార్జీలు వసూలు చేస్తారు. రెండో దశలో నివాస గృహాలకూ ఇదే పద్ధతిని అనుసరించుతామని ఆయన తెలియజేశారు. వినియోగ ఛార్జీల విషయానికొస్తే రూ.30 నుంచి రూ.3000 దాకా ఉన్నాయి.

For Vedio click the bellow link…

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*