అడ్డదారిలో శ్రీవారి లడ్డూలు ! నెలకు కోటి దందా!!

తిరుమల శ్రీవారి లడ్డూల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని టిటిడి అధికారులు చెబుతున్నా….ఆ దందా మాత్రం ఆగడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల నుంచి రోజూ వేలాది లడ్డూల విలువైన వందలాది టోకెన్లు అక్రమ పద్ధతుల్లో బయటకు వెళుతున్నాయి. టోకెన్లు ఇచ్చే కంప్యూటర్‌ ఆపరేటర్‌ నుంచి లడ్డూలు వితరణ చేసే కౌంటర్ల సిబ్బంది దాకా పకడ్బందీ లింకులతో లడ్డూల అక్రమాలు పకడ్బందీగా సాగిపోతున్నాయి. ఈ అక్రమం విలువ నెలకు కోటి రూపాయలకు పైమాటే అని తెలిస్తే నోటిమాట రాదు. శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి ప్రవేశ ద్వారాలైన రెండు వైకుంఠం క్యూంప్లెక్స్‌ల కేంద్రంగా జరుగుతున్న లడ్డూల అక్రమాలపై ధర్మచక్రం అందిస్తున్న వివరణాత్మక కథనం.

ముందుగా లడ్డూల దందాకు కొన్ని కొన్ని ఉదాహరణలు….
తిరుమల లడ్డూ వితరణ కేంద్రంలో పనిచేసే ఓ ఆపరేటర్‌ ఇటీవల తిరుపతి నుంచి తిరుమలకు డ్యూటీకి వెళుతుండగా టోల్‌గేట్‌ వద్ద సాధారణ తనిఖీలు నిర్వహించారు. అతని ద్విచక్ర వాహనంలో 100 లడ్డూలకు సంబంధించిన మాన్యువల్‌ టోకెన్లు లభించాయి. ఆరా తీయగా…వైకుంఠం-1 వద్ద లడ్డూ టోకెన్లు ఇచ్చే కౌంటర్లను పర్యవేక్షించే సూపర్‌ వైజర్‌ ఒకరు తనకు ఆ టోకెన్లు ఇచ్చారని అతను చెప్పారు. దీంతో ఆ సూపర్‌ వైజర్‌ను త్రిలోక్‌ సంస్థ దూర ప్రాంతానికి బదిలీ చేసింది.

లడ్డూ వితరణ కేంద్రాల వద్ద 40 లడ్డూలు తీసుకెళుతున్న ఓ వ్యక్తిని విజిలెన్స్‌ ఐడి పార్టీ పట్టుకుంది. అన్ని లడ్డూలు ఎలా వచ్చాయని విచారించింది. తనకు లడ్డూ టోకెన్‌ కేంద్రాల వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేసే ఓ వ్యక్తి మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చారని, వాటితోనే లడ్డూలు తీసుకున్నానని అతను చెప్పారు. ఈ ఉదంతంలో ఎవరిపైనా కేసు పెట్టలేదుగానీ….ఆ సూపర్‌వైజర్‌ను అక్కడి నుంచి తొలగించి, ఆఫీసుకు బదిలీ చేశారు.

ఇటీవలే వైకుంఠం-1 వద్ద ఉన్న ఓ టీస్టాల్‌లో 35 టోకెన్లను విజిలెన్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. విచారిస్తే…అవి వైకుంఠం-1 నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఎవరు తెచ్చారు, వాళ్లపైన ఏ చర్యలు తీసుకున్నారు అనే వివరాలు బయటకురాలేదు.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైకుంఠం-1 నుంచి లడ్డూ టోకెన్లు యథేచ్ఛగా తరలిపోతున్నాయి. అదీ అత్యంత సులభంగా తేగలుగుతున్నారు దళారులు. ఇంతకీ వైకుంఠం-1లో ఏమి జరుగుతోంది? ఎలా జరుగుతోంది? అసలు మాన్యువల్‌ లడ్డూ టోకెన్లు అంటే ఏమిటి?

మాన్యువల్‌ లడ్డూ టోకెన్లు వరం
కాలినడక భక్తులు, రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులు వైకుంఠం-1 ద్వారా దర్శనానికి వెళుతుంటారు. క్యూకాంప్లెక్స్‌లోకి ప్రవేశించే ముందు….ఏటిసి పార్కింగ్‌ వద్ద ఏర్పాటు చేసిన స్కానింగ్‌ సెంటర్లలో టికెట్లను స్కానింగ్‌ చేస్తారు. అదేవిధంగా లడ్డూ టోకెన్లు ఇస్తారు. రూ.300 దర్శనం భక్తులకు లడ్డూలు కూడా ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకున్న టికెట్టుపైనే ఇస్తారు కాబట్టి….స్కానింగ్‌ వద్ద వాళ్లకు ప్రత్యేకంగా లడ్డూ టోకెన్లు ఇవ్వరు. అందువల్ల ఇక్కడ టికెట్‌ స్కానింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి. సాయంత్రం 7 గంటల తరువాత రూ.300 దర్శనం స్లాట్స్‌ ముగిసిపోతాయి. అప్పటి నుంచి ఆ స్కానింగ్‌ సెంటర్‌ ఖాళీగా ఉంటుంది. ఇదిలావుండగా… ఎలాంటి టోకెన్‌ లేనివారిని వైకుంఠం-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వైకుంఠం-2లోని షెడ్లన్నీ నిండిపోతాయి. అలాంటప్పుడు….వైకుంఠం-1లో కంపార్టుమెంట్లలోకి అనుమతిస్తారు. ఈ కంపార్టుమెంట్లలోకి వెళ్లాలంటే…స్కానింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి, అక్కడ లడ్డూ టోకెన్లు తీసుకుని వెళ్లాలి. రూ.300 స్కానింగ్‌ కేంద్రంలో లడ్డూ టోకెన్లు సాఫ్ట్‌వేర్‌ ద్వారా (ఫింగర్‌ ఫ్రింట్‌ తీసుకోవడం, ఫొటో తీసుకోవడం వంటివి) ఇచ్చే సదుపాయాలు లేకపోవడం వల్ల….4 లడ్డూలు, 2 లడ్డూలు విలువైన లడ్డూ టోకెన్లు సిద్ధంగా ఉంచుకుంటారు. వైకుంఠంలోకి ప్రవేశించే వారికి డబ్బులు తీసుకుని మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చిపంపుతారు. ఇదే దళారులకు, అక్రమాలర్కులకు వరంగా మారింది. రద్దీ ఉన్నప్పుడు కచ్చితంగా మాన్యువల్‌ టోకెన్లు ఇస్తుంటారు. ఇటీవల మూడు నెలల పాటు రోజూ రద్దీ ఉండటంతో…దాదాపు రోజూ మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చారు.

వేల లడ్డూలు హాంఫట్‌!
మాన్యువల్‌ టోకెన్లు ఇస్తున్నారని తెలియగానే ఆ వార్త క్షణాల్లో తిరుమల మొత్తంగా ఉన్న దళారులకు, పోలీసులకు, సెక్యూరిటీ సిబ్బందికి…ఇలా అందరికీ తెలిసిపోతుంది. నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తారు. టోకెన్లు తీసుకుంటారు. వాస్తవంగా అయితే…టోకెన్‌ తీసుకున్నవాళ్లు అలాగే కంపార్టుమెంట్లలోకి వెళ్లాలి. కానీ కుమ్మక్కు వ్యవహారంతో ఇటే బయటకు వచ్చేస్తున్నారు. అక్కడే తిరుగుతుంటే సూపర్‌వైజర్లు, త్రిలోక్‌ సిబ్బందికి (టోకెన్లు జారీచేసే సంస్థ) అసలు అడ్డే ఉండదు. ఎలాంటి ఫింగర్‌ ఫ్రింట్స్‌గానీ, ఫొటోలుగానీ తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో….టోకెన్లను సిబ్బందే సులభంగా బయటకు తరలించేస్తున్నారు. ముందే చెప్పిన ఉదాహరణల్లో పట్టుబడింది ఇటువంటి టోకెన్లే. టోకెన్‌ తీసుకుని బయటకు రాలేని దళారులు దర్శనానికి వెళతారు. అదే సాఫ్ట్‌వేర్‌ ద్వారా టోకెన్లు ఇస్తే….ఇలా లడ్డూల కోసమే వచ్చే దళారులను కంప్యూటరు పట్టిచ్చేస్తుంది. అందుకే మాన్యువల్‌ ఇచ్చేటప్పుడు మాత్రమే దళారులు దర్శనాకి వెళుతుంటారు. మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చారంటే…అక్కడ నుంచి ఆ రోజు రెండు వేల లడ్డూలకుపైగా అడ్డదారుల్లో తరలిపోయినట్లేనట. విజిలెన్స్‌, పోలీసు, ఎస్‌పిఎఫ్‌ తదితర సిబ్బంది కూడా ఈ దారిలో లడ్డూలు తీసుకోవడం అలవాటపడ్డారు. దీంతో రాచమార్గంలా ఉన్న దీన్ని అడ్డుకోడానికి ఎవరూ పెద్దగా ఆసక్తిచూపడం లేదు.

వైకుంఠం-2లోనూ…
వైకుంఠం-2లో లడ్డూ కౌంటర్ల నుంచి కూడా టోకెన్లు తరలిపోతున్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది సాంకేతికంగా ఉన్న లోపాలతో టోకెన్లు పొందుతున్నారు. ఫింగర్‌ ఫ్రింట్స్‌ ఉన్నప్పటికీ… ఒక్కో వేలు పెట్టి ఒక్కో టికెట్టు తీసుకోవచ్చు. ముందుగా భక్తులను చూపుడు వేలు పెట్టమంటారు. ఆ టికెట్‌ ప్రింట్‌ తీస్తారు. ‘ఆ వేలుతో ప్రింట్‌ రావడం లేదు…ఇంకో వేలు పెట్టండి’ అంటూరు. అప్పుడు ఇంకో టికెట్టు వస్తుంది. మొదటి టికెట్టును భక్తుడికి ఇస్తారు. రెండో టికెట్టును సిబ్బంది కొట్టేసి బయటకు తరలిస్తారు. ఇదిలావుండగా… కొందరు దళారులు లోనికి వెళ్లి లడ్డూ టికెట్టు తీసుకుంటారు. కొంత సేపటి తరువాత తాము ఎక్కువ సేపు నిరీక్షించలేమని, దర్శనం వద్దని, వెళ్లిపోతామని చెప్పి బయటకు వచ్చేస్తుంటారు. సాధారణంగా అలాంటి వారి నుంచి టోకెన్‌ తీసుకుని ఎగ్జిట్‌ మార్గలో స్కాన్‌ చేస్తే…ఆ టోకెన్‌కు విలువ లేకుండాపోతుంది. అది లడ్డూ వితరణ కేంద్రాల్లో స్కాన్‌ కాదు. కానీ…టోకెన్‌ లోపలెక్కడో దాచిపెట్టుకుని, తాము టోకెన్‌ తీసుకోలేదని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. ఈ విధంగానూ నిత్యం వందలాది లడ్డూ టోకెన్లు తరలిపోతున్నాయి.

లడ్డూ కౌంటర్ల సిబ్బందితో లింకులు
లడ్డూ టోకెన్లు ఇచ్చే కేంద్రాల్లో పనిచేసే కొందరు ఆపరేటర్లు, సూపర్‌వైజర్లకు లడ్డూ వితరణ కేంద్రాల్లో పనిచేసే ఆపరేటర్లకు లింకులున్నాయి. అక్రమంగా బయటకు తెచ్చిన టోకెన్లను తీసుకెళ్లి లడ్డూ వితరణ కేంద్రాల ఆపరేటర్లకు ఇచ్చేస్తారు. భక్తులు ఎవరైనా తమకు అదనపు లడ్డూలు కావాలని ఆపరేటర్‌ను అడిగితే….తన వద్ద ఉన్న టోకెన్‌ను లెక్కలో వేసుకుని లడ్డూలు ఇచ్చేస్తారు. (అలాంటి టోకెన్లు తీసుకెళుతుండగానే….అలిపిరిలో ఓ ఆపరేటర్‌ను పట్టుకున్నారు.) ఇంకో దందా కూడా ఇక్కడ జరుగుతోంది. ఈ రోజు రాత్రి మాన్యువల్‌ టోకెన్లు బయటకు వచ్చాయి. 24 గంటల్లో వాటికి లడ్డూలు తీసుకోవాలి. లేకుంటే చెల్లవు. ఒక్కోసారి అనూహ్యంగా రద్దీ తగ్గిపోతుంది. అప్పుడు లడ్డూలు అడిగేవాళ్లు ఉండరు. అలాగని అలాగేవుంచుకుంటే వృథా అవుతాయి. అలాంప్పుడు….దర్శనం చేసుకుని లడ్డూల కోసం వచ్చే భక్తుల టోకెన్లు తీసుకుని, వాటిని తమ వద్ద ఉంచుకుంటారు. తమ వద్ద ఉన్న సమయం ముగియవస్తున్న టోకెన్లకు లడ్డూలు ఇచ్చి పంపుతారు. భక్తుడు ఇచ్చిన టోకెన్‌ను రెండో రోజు వాడుకుంటారట.

రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల లడ్డూల దాకా ఈ విధంగా తరలిపోతున్నాయని అంచనా. ఒక్కో లడ్డూ రూ.100 దాకా అమ్ముకుంటున్నారు. నెలకు దాదాపు కోటి రూపాయల అక్రమ లడ్డూల రూపంలో దళారుల జేబుల్లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. లడ్డూ ధరను రూ.50కు పెంచి, భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇస్తామని అధికారులు ప్రకటించినా అది అమలు కావడం లేదు. దీంతో దళారుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇప్పటికైనా టిటిడి ఉన్నతాధికారులు స్పందించి లడ్డూలు తరలిపోతున్న అన్ని అడ్డదారులను మూసేయాల్సిన అవసరం ఉంది.

సిసి కెమెరాల నిఘా విజిలెన్స్‌ ఆధీనంలోకి వస్తేనే….
తిరుమలలో ఎక్కడాలేని పరిస్థితి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల వద్ద ఉంది. తిరుమలలోని అన్ని సిసి కెమెరాలు టిటిడి విజిలెన్స్‌ అధికారుల పర్యవేక్షణలో ఉంటే…ఇక్కడ మాత్రం ఏ ప్రైవేట్‌ సంస్థ అయితే లడ్డూ టోకెన్లు జారీ చేస్తోందో..ఆ సంస్థ ఆధీనంలోనే సిసి కెమెరాలు ఉన్నాయి. లడ్డూల జారీ కేంద్రాల వద్ద ఉన్న సిసి కెమెరాలను అక్కడే ఉన్న కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడ త్రిలోక్‌ సిబ్బందే సిసి కెమెరాల దృశ్యాలను చూస్తుంటారు. అయితే….సిసి కెమెరాల సిబ్బంది, కౌంటర్లలోని సిబ్బంది కుమ్మక్కు అవుతుండటంతో అక్కడ జరిగే అక్రమాలేవీ బయటకురావడం లేదు. లడ్డూ టోకెన్ల ద్వారా వచ్చే డబ్బుల్లో అందరికీ వాటాలు ఉండటమే దీనికి కారమణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది మధ్య విభేదాలు వచ్చినపుడు తప్ప తప్పు చేస్తున్నవారు పట్టుబడటం లేదు. ఇక ఈ సిసి కెమెరాల వల్ల ఉపయోగం ఏమిటో తెలియదు. వాళ్లే సొంతంగా సిసి కెమెరాలు పెట్టుకున్నారన్న ఉద్దేశంతో టిటిడి పటించుకోలేదు. గతంలోనూ ధర్మచక్రం ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయినా విజిలెన్స్‌, టిటిడి అధికారులు స్పందించలేదు. అసలు సిసి కెమెరాలు ప్రైవేట్‌ వారి ఆధీనంలో ఎందుకు ఉండాలనేది ప్రశ్న. లడ్డూ టోకెన్లు ప్రైవేట్‌ వ్యక్తులు ఇచ్చినా….కనీసం సిసి కెమెరాలైనా టిటిడి విజిలెన్స్‌ నిఘాలో ఉంటే తప్పు చేసినవారిని పట్టుకునేందుకు వీలవుతుంది. ఇదే సమస్యను ధర్మచక్రం గతంలో ఓ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా….’వాళ్ల కెమెరాలను మనం ఎలా పర్యవేక్షిస్తాం’ అని ప్రశ్నించడం గమనార్హం.

తిరుమలలో చాలాచోట్ల ప్రైవేట్‌ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. లడ్డూ వితరణ కేంద్రాలను బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. అలాగని లడ్డూ కౌంటర్లలోని సిసి కెమెరాలపై నిఘాను బ్యాంకులకు వదిలేస్తారా? ఇలా వదిలేయడం భద్రతాపరంగానూ ప్రమాదం కాదా? తిరుమలలోని అన్ని కెమెరాలను ఒకేచోట చూసేందుకు వీలుగా వాటన్నింటినీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్‌ వాల్‌పై అన్ని కెమెరాల దృశ్యాలు ప్రసారమవుతూ ఉంటాయి. ఇటువంటి దానికి కీలకమైన వైకుంఠం-1, 2 స్కానింగ్‌, లడ్డూ కౌంటర్లు కెమెరాలు లింకుకాకపోతే ప్రయోజనం ఏమిటి? ఇప్పటికైనా టిటిడి అధికారులు స్పందించి వైకుంఠం-1, వైకుంఠం-2 లడ్డూ కౌంటర్ల వద్ద ఉన్న సిపి కెమెరాల పర్యవేక్షణను విజిలెన్స్‌ అధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే అక్రమాలకు చెక్‌ పెట్టగలరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*