తిరుమలలో క్షుద్రపూజలు జరిగాయా!

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు వివాదం అసక్తికర మలుపులు తిరుగుతోంది. రమణ దీక్షితులు వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలు ఉన్నాయని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తుండగా….వైసిపి కీలక నేత భూమన కరుణాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసింది. తిరుమలలో జరిగిన క్షుద్రపూజలు బయటపడతాయన్న భయంతోనే రమణ దీక్షితులుపై చర్య తీసుకున్నారని కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. ఇప్పటిదాకా ఇటువంటి చర్చ ఏదీ తిరుమలలో జరగలేదు. రమణ దీక్షితులు కూడా ఈ ఆరోపణ చేయలేదు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు నిర్వహించారన్న వార్తలు కొన్ని నెలల క్రితం దుమారం రేపాయి. అలాగే శ్రీకాళహస్తి ఆలయంలోనూ ఓ ఉద్యోగి క్షుద్రపూజలు చేశారన్న వార్తలు వచ్చాయి. ఈ రెండింటినీ బలపరిచే, అనుమానాలు రేకెత్తించే వీడియోలు లభించాయి. అయితే…తిరుమలలో జరిగాయని చెబుతున్న క్షుద్రపూజలకు సంబంధించి ఇప్పటిదాకా ఇలాంటి ఆధారాలూ వెల్లడికాలేదు. ఈ ఆరోపణలు చేస్తున్నది సాదాసీదా వ్యక్తికాదు. ఆయన కూడా ఒకప్పుడు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పని చేశారు. ఆయనకు టిటిడిలోని అధికారులు, అర్చకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవలే కరుణాకర్‌ రెడ్డి షష్టిపూర్తి చేసుకుంటే….స్వయంగా డాలర్‌ శేషాద్రి తన బృందంతో కరుణాకర్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఆశీర్వచనాలు అందించి వచ్చారు. దీనిద్వారా చెప్పేదేమంటే కరుణాకర్‌ రెడ్డికి శ్రీవారి ఆలయంలో జరిగే అంతర్గత విషయాలూ తెలిసే అవకాశముంది. ఏదైనా నిర్ధిష్ట సమాచారంతోనే ఈ విమర్శలు చేసివుంటారని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు.

మిగతా ఆలయాల్లో ఏమోగానీ తిరుమల ఆలయంలో క్షుద్రపూజలు చేయడం అంత తేలిక కాదు. రాత్రింబవళ్లూ ఆలయంలో భక్తులు ఉంటారు. ఆలయం మూతపడేది రెండు గంటల సమయం మాత్రమే. అదీకాకుండా అడుగడుగునా సిసి కెమెరాలు ఉంటాయి. ఆలయ తలుపులు తీయడం, వేయడం కూడా పెద్ద ప్రహసనం. ఆలయంలో క్షుద్రపూజలు చేసే అవకాశం ఏమాత్రం లేదు. అయితే…తిరుమలలో ఏక్కడైనా మఠాల్లోగానీ, అతిథిగృహాల్లోగానీ చేసివుండే అవకాశం ఉంది. ఇదిలావుండగా తిరుమలలో నిజంగా క్షుద్రపూజలు జరిగాయా, జరిగితే ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు అనేవి తలెత్తుతున ప్రశ్నలు. విజయవాడలో జరిగిన క్షుద్రపూలు ప్రభుత్వంలోని పెద్దల కోసమే చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఈవోను బదిలీ చేశారు. దాంతో వివాదం సద్దుమణిగింది. దుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు జరిగాయా, జరిగితే ఎవరి కోసం ఎవరు చేశారు అనే ఇవరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. తిరుమలలో ఎవరైనా క్షుద్రపూజలు చేసివుంటే…అది పెద్ద నేరమే. తన ఆరోపణలకు సంబంధించి కరుణాకర్‌ రెడ్డి సమీప భవిష్యత్తులో ఆధారాలు ఏమైనా బయటపెడుతారా..! ఏమో చూద్దాం!

1 Comment

  1. వైష్ణవాలయాల్లో క్షుద్రానికి అవకాశం ఎక్కడిదీ ?? అందునా వైఖాసనాగమానాన్ని పాటించే శ్రీవారి ఆలయంలో ఏ ప్రాతిపదికన క్షుద్ర చేస్తారు ?? బహుశా కరుణాకర్ రెడ్డి గారు “ప్రత్యేక పూసలు” అనబోయి “క్షుద్ర పూజలు” అని ఉండవచ్చు. ఆయన అన్న ఈ “క్షుద్ర పూజలు” అన్న మాటలు పూర్తీ అసంబద్ధం..

Leave a Reply to Thirumal Cancel reply

Your email address will not be published.


*