తిరుమలలో గదుల కేటాయింపు ప్రైవేట్‌పరం…వేగంగా కదులుతున్న దస్త్రం!

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిదాన్నీ ప్రైవేట్‌పరం చేయడం పరిపాటిగా మారిపోయింది. పారిశుద్ధ్యం, కాటేజీల శుభ్రత, దర్శనం టోకెన్ల జారీ తదితర పనులను ఇప్పటికే ప్రైవేటపరం చేయగా…ఇప్పుడు గదుల కేటాయింపును పూర్తిగా ప్రైవేట్‌ ఏజెన్సీల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రైవేట్‌ సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం, తమపైన ఎలాంటి బాధ్యతా లేకుండా చేతులు దులుపుకోవడం అనే రెండు కోణాల నుంచి ఈ ప్రైవేటీకరణ తీవ్రం అవుతోంది. ఇందులో భాగంగానే గదుల కేటాయింపును ప్రైవేట్‌కు అప్పగించబోతున్నారు. ఈనెలలోనే భక్తుల లగేజీ తరలింపు పనిని ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. ఇప్పుడు సిఆర్‌వోపై కన్నేశారు.

శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం తిరుమల, తిరుపతిలో కాటేజీలు, విశ్రాంతి గృహాలు, వసతి సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తిరుమలలో గదులు కావాలంటే సిఆర్‌ఓ కార్యాయం (సెంట్రల్‌ రిసెప్షెన్‌ కార్యాలయం)కు వెళ్లి గదులు మంజూరు చేయించుకోవాలి. ఆ స్లిప్‌ తీసుకుని గదులు, కాటేజీల వద్దకు వెళితే అక్కడ ఉండే సిబ్బంది గది ఇస్తారు. ఇదంతా టిటిడి ఉద్యోగుల ఆధ్వర్యంలోనే సాగుతోంది. అయితే తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో…100 గదులకు ఒక అటెండరునే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పనిభారం పెరుగుతోందని అటెండర్లు పలు పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బందిని పెంచడానికి బదులు….గదుల కేటాయింపునూ ప్రైవేట్‌కు అప్పగించేస్తే ఎలావుంటుందనే కోణంలో ఆలోచనలు చేశారు. సాంబశివరావు ఈవోగా ఉన్నప్పుడే…ఉద్యోగ సంఘాల నాయకులు ఆయన్ను కలిసి పనిభాగం గురించి చెప్పారు. ‘అయితే ప్రైవేట్‌కు ఇచ్చేద్దాం’ అని ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఇంతలో ఆయన బదిలీ అయ్యారు. ఆ పనిని ప్రస్తుత ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పూర్తిచేసే పనిలో ఉన్నారు.

గదుల కేటాయింపు బాధ్యతలు మొత్తం ప్రైవేట్‌కు అప్పగించేందుకు సిద్ధమైన టిటిడి ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని వేగంగా కదుపుతోంది. ఏపి ఆన్‌లైన్‌ అనే సంస్థకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన….సర్వదర్శనం టైస్లాట్‌ కౌంటర్లు కూడా ఇదే సంస్థకు అప్పగించారు. ఇప్పుడు గదుల కేటాయింపు పని కూడా ఇదే సంస్థకు ఇవ్వడానికి పావులు కదుపుతున్నారు. ఆ సంస్థ వైపును నుంచి కూడా రాజకీయంగా ఒత్తిళ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వదర్శనం కౌంటర్ల నిర్వహణలో తగినంత పని లేకున్నా ఆ సంస్థకు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ కాంట్రాక్టు కూడా ఆ సంస్థ చేతికి వెళితే….ఆ సంస్థకు కాసుల పంటే. ఇదిలావుండగా….గదుల కేటాయింపు వ్యవహారం ప్రైవేట్‌కు అప్పగిస్తే అక్రమాలు ఎక్కువ అవుతాయని టిటిడి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చేస్తున్న పనితో భవిష్యత్తులో టిటిడిలో రెగ్యులర్‌ ఉద్యోగులే లేకుండాపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*