తిరుమలలో గెలిచేది ధర్మారెడ్డా…ప్రైవేట్‌ పిఆర్‌వోలా..!

తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల రూపంలో తిష్టవేసిన దళారులను కొండ దించడం కోసం స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 13 మంది పిఆర్‌ఓలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్‌ అధికారులు…వారి బాగోతాలను బయటకు తీస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పట్టుబడిన వారిలో ఎందరిని పోలీసులకు అప్పగిస్తారు, ఒత్తిళ్ల వల్ల ఎందరిని వదిలేస్తారు అనేది వేరే సంగతిగానీ….తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల వ్యవహారం గురించి తెలిస్తే విస్తపోవాల్సిదే.

దళారులకు రాజపోషకులు అధికారులే… తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల వ్యవస్థ వేళ్లూనుకుంది. దీన్ని తొలగించడం అంత తేలికైన పనిగా కనిపించడం లేదు. మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రైవేట్‌ అతిథిగృహ నిర్మాణ దాతలు, వివిధ సంస్థల తరుపున పనిచేస్తున్న పిఆర్‌వో టిటిడి అధికారులనే శాసించే స్థాయికి ఎదిగారు. ప్రైవేట్‌ పిఆర్‌వోల వ్యవస్థ ఇంతగా బలపడటానికి టిటిడి అధికారులే కారణమని చెప్పాలి.

గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రైవేట్‌ పిఆర్‌వోకు సంబంధించి టిటిడి విజిలెన్స్‌ విభాగం కొన్ని వివరాలు సేకరించి పాలక మండలి ముందు ఉంచింది. ప్రజాప్రతినిధులు, ప్రముఖుల తరపున 31 మంది పిఆర్‌వోలు టికెట్ల కోసం జేఈవో కార్యాలయంలో లేఖలు సమర్పిస్తున్నట్లు తేల్చారు. అదేవిధంగా తిరుమలలోని గెస్ట్‌హౌస్‌లలో 53 మంది పిఆర్‌వోలు ఉన్నట్లు గుర్తించారు. భక్తులకు సంబంధం లేకుండా వీళ్లే రోజూ జెఈవో ఆఫీసుకు వెళ్లి టికెట్ల కోసం సిఫార్సు లేఖలు సమర్పిస్తుంటారు. ఈ పిఆర్‌ఓలపైన చర్యలు తీసుకోవాలని అప్పటి అధికార తెలుగుదేశం పార్టీకే చెందిన సప్తగిరి ప్రసాద్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై బోర్డులో చర్చ కూడా జరిగింది. అయితే….నిర్ధిష్టమైన చర్యలేవీ తీసుకోలేదు. తిరుమలలో అనధికార వ్యవహారాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌కు సూచన చేసి వదిలేశారు. ఇది జరిగిన తరువాత కూడా ఒక దళారీని కూడా అడ్డుకోలేకపోయారు. యథాతథంగా సాగుతూనే వచ్చింది.

ఆఫీసర్లులాగా… మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంపిలు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రైవేట్‌ అతిథిగృహాల దాతల తరపున నిత్యం శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్లకు సాయం అందించేందుకు తిరుమలలో పిఆర్‌వోలను ఏర్పాటు చేసుకున్నారు. దర్శనానికి వచ్చేవాళ్లకు విఐపి బ్రేక్‌ టికెట్లు ఇప్పించడం నుంచి గదులు, లడ్డూలు ఏర్పాటు చేయడం దాకా అన్ని పనులూ ఈ పిఆర్‌వోలు చూసుకుంటారు. ఈ పిఆర్‌వోలు ఏ ఆఫీసులో అడుగుపెట్టినా ఎదురుచెప్పేవాళ్లు ఉండరు. మొన్నటిదాకా… ఏ టికెట్టు కావాలన్నా వీరికి అడ్డుండేది కాదు. అధికారులే ఎదురేగి టికెట్లు, గదులు ఏర్పాటు చేసేవారు. ఫోన్‌లో ఒక మాట చెప్పినా పని చేసిపెడతారు. ఏ అధికారైనా కాదూ కూడదు అంటే…హైదరాబాద్‌ నుంచో, ఢిల్లీ నుంచో ఫోన్‌ చేయిస్తారు. ఒకసారి ఇలా ఫోన్‌ చేయిస్తే చాలు…ఇంకోసారి ఆ అధికారి అడ్డుచెప్పే సాహసం చేయరు. ప్రైవేట్‌ పిఆర్‌వోలు లక్షాధికారులైపోయారంటే ఆశ్చర్యం కలగకమానదు. తమ సంస్థ లేదా రాజకీయ నాయకులు ఇచ్చే సిఫార్సు లేఖలను తమ వద్ద ఉంచుకుని సొంతానికి వాడుకుంటూ దర్శనాలు చేయించి లక్షలు గడిస్తున్నారు. టిటిడి ఉద్యోగులు, అధికారులకూ ఈ విషయం తెలుసు. అందరూ కలిసే ఈ దందా సాగిస్తుంటారు.

అతిథిగృహాల్లోనే తిష్ట… తిరుమలలో 150కిపైగా ప్రైవేట్‌ అతిథిగృహాలున్నాయి. ఇవి టిటిడి ఆధీనంలోనే ఉండాలి. దాతలు వచ్చినపుడు…వారికి కేటాయించిన కోటా ప్రకారం గదులు ఇస్తారు. అయితే…ఈ అతిథిగృహాల్లో ప్రైవేట్‌ పిఆర్‌వోలు తిష్టవేశారు. ప్రత్యేక గదులు ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నవారూ ఉన్నారు. ఇది టిటిడి నిబంధనలకు విరుద్ధం. ఇలాంటివారందరినీ గతంలో ఖాళీ చేయించారు. అయితే మళ్లీ యథావిధిగా గెస్ట్‌హౌస్‌లలో చేరిపోయారు. రాజకీయ నాయకులు, సంస్థల నుంచి వచ్చే ఒత్తిడి వల్ల టిటిడి కూడా చూసీచూడనట్లు వదిలేసింది. దాతలు అతిథిగృహాలు నిర్మించినా….వాళ్లు తిరుమలకు వచ్చినపుడు బస చేయడం వరకే అధికారం ఉంటుంది. కానీ ఆచరణ అందుకు భిన్నంగా ఉంది. అతిథిగృహాలను పూర్తిగా తమ సొంతంలాగా వాడుకుంటున్నారు. ఇందుకు పిఆర్‌ఓలను ఉపయోగించుకుంటున్నారు.

ప్రభుత్వ శాఖలు కూడా… ప్రభుత్వ విభాగాలు కూడా ప్రైవేట్‌ పిఆర్‌వోల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్‌ వంటి సంస్థలు తిరుమలలో అనధికారిక వ్యక్తులను పిఆర్‌వోలుగా నియమించుకుని పని చేయించుకుంటున్నాయి. కాంట్రాక్టు కిందనో, అవుట్‌ సోర్సింగ్‌ కిందనో ఆ పిఆర్‌ఓ నియామకాన్ని చూపిస్తున్నాయి. తమ శాఖ అధికారులు, ఉద్యోగులు వచ్చినపుడు దగ్గరుండి దర్శనాలు చేయించడం, గదులు, ప్రసాదాలు ఇప్పించడం ఈ పిఆర్‌వోల పని. ఏడాది క్రితం ఒక ఐఏఎస్‌ అధికారి దర్శనానికి వచ్చారు. ఆ శాఖ తరపున ఇక్కడ పని చేస్తున్న పిఆర్‌వో ఆ అధికారిని సరిగా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన వెంటనే…పిఆర్‌వోను తొలగించాలని ఆదేశించారు. అయితే…ఆ పిఆర్‌ఓ దర్శనానికి వచ్చిన అధికారికంటే ఇంకా పై అధికారులను ప్రసన్నం చేసుకుని తన ‘ఉద్యోగాన్ని’ నిలబెట్టుకున్నారు. ఈ పిఆర్‌వో లక్షలు గడించారనేది తిరుమలలో జరుగుతున్న ప్రచారం.

టికెట్లులో పారదర్శకత తీసుకొస్తేనే…తిరుమలలో పిఆర్‌వోల వ్యవస్థ పోవాలంటే…ముందుగా విఐపి టికెట్లు కేటాయింపులో పారదర్శకత తీసుకురావాలి. ఏ రోజు ఎవరికి ఎన్ని టికెట్లు ఇచ్చిందీ ఆన్‌లైన్‌లో ప్రదర్శించగలిగితే….చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు ప్రైవేట్‌ పిఆర్‌వోలు దందా చేసే అవకాశం ఉండదు. సంపాదన మార్గాలు మూసుకుపోతాయి. అయినా పిఆర్‌వోల నుంచి రాజకీయ నాయకులకు ఎదురు డబ్బులు పోతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆ నాయకుల పేరుతో టికెట్లు తీసుకుని, దర్శనాలు చేయించి, నెలకు ఇంతని డబ్బులు ఎదురు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా గతం….ఇప్పుడు అలా కుదరని రుజువు చేయాలని అధికారులు అనుకుంటే…టికెట్ల కేటాయింపులో సాధ్యమైనంత పారదర్శకత తీసుకురావాలి.

ప్రైవేట్‌ పిఆర్‌లోను ఎలాగైనా కొండ దించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డి. కొన్ని రోజులుగా పిఆర్‌ఓలను తన కార్యాలయంలోకి అడుగుపెట్టనీకుండా కట్టడి చేశారు. ఎవరికి టికెట్టు అవసరమైతే వాళ్లే సిఫార్సు లేఖలు తీసుకురావాలన్న నిబంధన పెట్టారు. దర్శనానికి వచ్చేవారు ఎటూ తిరుమలకు వస్తున్నారు. కాకుంటే…సిఫార్సు లేఖ తెచ్చేవారు టైం విషయంలో కాస్త అటూఇటూగా వచ్చినా…అనుమతిస్తే ఇక దళారుల అవసరమే ఉండదు. ఏదిఏమైనా ధర్మారెడ్డి….ప్రైవేట్‌ పిఆర్‌వోలపై యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో ధర్మారెడ్డి గెలుస్తారా…లేక ప్రైవేట్‌ పిఆర్‌వోలు గెలుస్తారా…ఏమో చూద్దాం.

….ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం వారపత్రిక

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*