తిరుమలలో టూరిజం పేరుతో రెస్టా’రెంట్‌’కు కోట్లలో గండి!

– సందీప రెస్టారెంట్‌కు రూ.3 లక్షల అద్దెతో ఏపిటిడిసికి కట్టబెట్టే ప్రయత్నం
– గత టెండరులో రూ.45.66 లక్షలు పలికిన ధర
– ఓ మంత్రి ప్రమేయంతో పక్కా స్కెచ్‌

తిరుమలలో భక్తుల పేరు చెప్పి ఏదైనా చేసేయొచ్చు. శ్రీవారి ఖజానా నుంచి కోట్లు కొల్లగొట్టవచ్చు. స్వామివారి ఆదాయానికి గండికొట్టుకొచ్చు. అందులోనూ ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంటే ఇక అడ్డూఅదుపే ఉండదు. టిటిడి అధికారులు మరింత స్వామిభక్తితో (వెంకటేశ్వరస్వామి మీద భక్తికాదు…నాయకులపై భక్తితో…) సాగిలపడి పని చేస్తారు. అది ఎంత అడ్డగోలు పనైనా సరే వెనకా ముందూ ఆలోచించరు. ఇటువంటి వ్యవహారమే తాజాగా ఒకటి జరిగింది. భక్తులకు తక్కువ ధరతో ఆహారపదార్థాలు అందించే పేరుతో అతి తక్కువ ధరకు ఓ రెస్టారెంట్‌ను టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించాలని నిర్ణయించారు. దీనివల్ల శ్రీవారి ఆదాయానికి రూ.5 కోట్లు దాకా గండిపడనుంది. పక్కా స్కెచ్‌తో జరిగిన ఈ తతంగం వెనుక ఓ మంత్రి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే…

ఏపిటిడిసి పేరుతో వ్యవహారం…
తిరుమలలో 9 పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. అదేవిధంగా 7 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. టిటిడి నిర్ణయించిన ధరలు అమలు చేయడం లేదంటూ ఇటీవల 8 పెద్ద రెస్టారెంట్లు, 6 జనతా హోటళ్లను మూసేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అన్నింటికీ తాజాగా టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో…అన్నమయ్య భవన్‌తోని అన్నమయ్య రెస్టారెంట్‌, మ్యూజియం సమీపంలోని సందీప రెస్టారెంట్‌లకు మాత్రం ఓపెన్‌ టెండరు విధానం కాకుండా…కొత్త పద్ధతి తీసుకొచ్చారు. ఈ రెండింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఆసక్తివున్న సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని నోటఫికేషన్‌ జారీ చేశారు.

ఏడాదికి రూ.5 కోట్లు నష్టం
సందీప రెస్టారెంట్‌కు ఏపి టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపిటిడిసి) దరఖాస్తు చేసుకుంది. నెలకు రూ.3 లక్షల అద్దె చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. వాస్తవంగా ఇదే రెస్టారెంటుకు గతంలో రూ.45,66,666 ధర పలికింది. దీనికి ముందు మయూర హోటల్స్‌ వారు ఇదే రెస్టారెంట్‌కు నెలకు రూ.8,83,207 అద్దె చెల్లిస్తూవచ్చారు. అటువంటిది ఏపిటిడిసికి రూ.3 లక్షలకు కట్టబెట్టడానికి బోర్డు తీర్మానించింది. అంటే గత టెండరుతో పోల్చితే…నెలకు రూ.42 లక్షలు, ఏడాదికి రూ.5 కోట్లు నష్టమన్నమాట.

జనతా హోటళ్లకంటే రెట్టింపు ధరలు…
ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రశ్నిస్తే….భక్తులకు తక్కువ ధరకే ఆహారం అందించడానికే అని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఏపిటిడిసి నిర్ణయించిన ధరలు చూస్తే అంత తక్కువేమీ లేవు. ఇటీవల టిటిడి జనతా హోటళ్ల కోసం 13 రకాల ఆహార పదార్థాల ధరలను నిర్ణయించింది. ఇప్పుడు ఏపిటిడిసి నిర్ణయించిన ధరలు వాటికన్నా ఎక్కువే ఉన్నాయి. జనతా హోటల్‌లో భోజనం రూ.60 ఉంటే ఏపిటిడిసి రూ.120గా నిర్ణయించింది. జనతా క్యాంటీన్‌లో రెండు వడ రూ.24 ఉంటే…ఏపిటిడిసి రూ.60గా నిర్ణయించింది. ధరలు రెట్టింపుగా ఉన్నాయి. రూ.3 లక్షలకు రెస్టారెంట్‌ ఇచ్చేయాలని నిర్ణయిస్తూ….ధరలు మరీ ఎక్కువగా ఉన్నందున 20 శాతం తగ్గించాలని మాత్రం బోర్డు కోరింది. ఈమేరకు 20 శాతం తగ్గించినా…ధరలు జనతా క్యాంటీన్‌ కంటే దాదాపు రెట్టింపుగా ఉంటాయి. దీనివల్ల భక్తులకు ప్రయోజనం ఏమిటి? ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు..?

ఓ మంత్రి హస్తం..
తిరుమలలోని రెండు రెస్టారెంట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అండర్‌ టేకింగ్‌లోని సంస్థలకు అప్పగించాలన్న ఆలోచన ఆకస్మికంగా కలగడం ఆశ్వర్యం కలిగిస్తోంది. దీనివెనుక ఓ మంత్రిగారి హస్తం ఉన్నట్లు చెబుతున్నారు. ఏపిటిడిసి ఎటూ సొంతంగా రెస్టారెంట్‌ నడపదు. మళ్లీ ఇంకొకరికి కాంట్రాక్టు ఇస్తుంది. అంటే ఏపిటిడిసి రూపంలో తమకు కావాల్సిన వారికి నామమాత్రపు ధరతో తిరుమల క్యాంటీన్‌ను అప్పగించడానికి స్కెచ్‌ వేశారన్నమాట.

శ్రీవారి ఆదాయానికి గంటి తప్ప భక్తులకు ప్రయోజనం లేదు…
రెస్టారెంట్‌ ఏపిటిడిసికి ఇచ్చినా భక్తులకు ప్రయోజనం లేదు. ఎందుకంటే…ఇప్పటికే తిరుమలలో నడుస్తున్న పెద్ద క్యాంటీన్లకు, ఇప్పుడు ఏపిటిడిసి చెబుతున్న ధరలకు పెద్ద తేడా లేదు. అంతమాత్రాన నామమాత్రపు ధరతో ఏపిటిడిసికి ఎందుకివ్వాలి? దీనికే అన్ని రెస్టాంరెంట్లకు నిర్వహించినట్లే టెండర్లు నిర్వహించాలి. సాధారణ భక్తుల కోసం ఎటూ అన్నప్రసాద కేంద్రం ఉంది. ఇంకా తిరుమలలో ఐదు చోట్ల రోడ్డుపైన ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు లోటు లేకుండా చేస్తున్నారు. ఇక అద్దె భారీగా తగ్గించుకుని ఏపిటిడిసికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందుకే ఈ టెండరును రద్దు చేయాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*