తిరుమలలో భక్తులకు అద్దె గదుల అవస్థలు!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అద్దె గదుల కోసం అవస్థలు పడాల్సివస్తోంది. గదుల కేటాయింపునకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక సమస్యలకారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు… ఎవరిమీదనో నెపం నెట్టేసి, మీడియా ముందు సిబ్బందిపై కేకలు వేసేసి షో చేసి చేతులు దులుపుకుంటున్నారు.

తిరుమలలో గదులు కావాల్సిన భక్తులు ముందుగా సిఆర్‌ఓ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడి కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకోవాలి. అనంతరం బయటకు వచ్చేస్తే….గది ఖాళీ అయ్యేదాన్ని బట్టి వరుస క్రమంలో భక్తుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తాయి. ఆ తరువాత వెళ్లి గది తీసుకోవాలి. గతంలో గదులు ఖాళీ అవుతుంటే క్యూలో ఉండేవారికి ఇస్తూ వచ్చేవారు. దీనివల్ల నాలుగైదు గంటలు కూడా క్యూలో నిలబడాల్సివచ్చేది. రిజిస్ట్రేషన్‌ పద్ధతి వల్ల అన్ని గంటలు క్యూలో నిలబడాల్సిన పనిలేకుండాపోయింది.

అయితే…ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి. గదుల రిజస్ట్రేషన్‌కు 10 కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అందులోనూ సిబ్బంది వారాంతపు సెలవులు, అత్యవసర సెలవులతో ఆరేడు కౌంటర్లు మాత్రమే పని చేస్తుంటాయి. ఈ కౌంటర్ల వద్ద క్యూలలో 200 లోపు మాత్రమే నిలబడటానికి వీలుంటుంది. ఒకసారి క్యూలోకి వెళ్లిన ఆ 200 మందికి రిజిస్ట్రేషన్‌ చేయాలంటే కనీసం ఒకటిన్నర గంట సమయం పడుతుంది. 200 మంది లోనికి వెళ్లిన తరువాత వచ్చిన భక్తులు ఒకటిన్నర గంట సమయం బయటే నిలబడివుండాలి. మళ్లీ 200 మంది నిండిపోతే….మరో 1.30 గంట నిరీక్షణ తప్పదు. అప్పుడు క్యూలో వేచివుండేవారు..ఇప్పుడు క్యూ బటయ వేచివుంటున్నారు. కౌంటర్ల సంఖ్య పెంచితే సమస్య పరిష్కారం అవుతుంది.

మొదట్లో నిర్దేశించిన ప్రకారం…భక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకుని బయటకు వచ్చేస్తే…గది ఖాళీ అయినపుడు ఆ భక్తునికి మెసేజ్‌ వెళుతుంది. అర్ధంగంటలో వెళ్లి గది తీసుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి ఎలాంటి మెసేజ్‌లూ రావడం లేదు. దీంతో సిఆర్‌వో కార్యాలయం వద్దే డిస్‌ప్లే బోర్డు చూస్తూ గంటల తరబడి నిలబడుతున్నారు. బోర్డులో తన పేరు, నెంబరు కనిపించగానే గదికోసం వెళుతున్నారు. ఎస్‌ఎంఎస్‌లు రాని ఒక తప్పిదం వల్ల వేలాది మంది భక్తులు ఇబ్బందిపడుతున్నారు.

ఇక మరో సమస్యకూడా తలెత్తుతోంది. గది కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడే… ‘మీకు 3 – 4 గంటల తరువాత గది కేటాయించవచ్చు’ అని ఉజ్జాయింపు అంచనాతో రశీదుపై ముద్రిస్తున్నారు. దీంతో భక్తులు ఇంకా సమయం ఉందికదా అని తిరుమలలోనే సందర్శనీయ స్థలాలకు వెళ్లిపోతున్నారు. ఒక్కోసారి రిజిస్ట్రేషన్‌ అయిన అర్థగంటలోనే గది కేటాయించబడుతోంది. ఆ సమాచారం భక్తులకు వెళ్లడం లేదు. తీరా మూడు గంటల తరువాతనో, నాలుగు గంటల తరువాతనో భక్తులు వచ్చి తమకు గది కావాలని అడుతున్నారు. గది అలాట్‌ అయిన అర్థగంటలో తీసుకోకుండా ఆటోమేటిక్‌గా అది రద్దయిపోతుంది. అంటే ఆ భక్తునికి ఇక గది లేనట్లేనన్నమాట.

అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఈవోగా వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్‌ పద్ధతి పెట్టారు. అయితే…ఇది ఎలా అమలవుతుంతో పట్టించుకున్నవారు లేరు. ఎస్‌ఎంఎస్‌లు వెళ్లడం లేదనే సంగతి కూడా సంబంధిత అధికారులకు తెలియదు. కౌంటర్లు చాలక ఇబ్బంది పడుతున్న సమాచారమూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లలేదు. ఈ క్రమంలో భక్తుల పాట్లు ఎక్కువయ్యాయి. ఇవన్నీ చూసి ఓ భక్తుడు ఈవోకు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

సిఆర్‌ఓ అధికారులపై జెఈవో రుసరుస
భక్తుల ఫిర్యాదు నేపథ్యంలో తిరుమల జెఈవో శ్రీనివసరాజు 1.06.2018న గదుల రిజిస్ట్రేషన్‌, కేటాయింపు కౌంటర్లను తనిఖీ చేశారు. అధికారులను చడామడా వాయించేశారు. ‘మీకు జీతాలు ఇవ్వడం దండగ…..మీరు ఏం చేస్తున్నారు’ అంటూ దబాయించేశారట. ఎస్‌ఎంఎస్‌లు వెళ్లకపోవడం, ఒక్కోసారి భక్తులకు వెంటనే గదులు మంజూరవడం, దూర ప్రాంతాల్లోవున్నవారు తీసుకోలేకపోవడం తదితర ఆచరణాత్మక సమస్యలను అధికారులు ఆయనకు వివరించినా….పట్టించుకోకుండా మీదే తప్పు అన్నట్లుగా రుసరుసలాడారట. వాస్తవంగా ఇక్కడ ఎదురవుతున్న సమస్యలన్నింటిపై సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో ఎప్పుడో పంపంచారట. వాటిని పటించుకోకుండా, ఇప్పుడు ఆకస్మికంగా వచ్చి తమను తిట్టడం ఏమిటని సిఆర్‌వో అధికారులు బాధపడుతున్నారు. ఇప్పటికైనా గదుల కేటాయింపు వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని వారు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*