తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో సోమ‌వారం రాత్రి 7.00 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీమలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి.
శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ క‌టాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో తిరుమ‌ల జెఈవో కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఎస్‌.ఇ.2 రామచంద్రా రెడ్డి, విఎస్‌వో మనోహర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*