తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించిన గదుల్లో కోత..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టిటిడి కేటాయించిన గదుల్లో గప్‌చుప్‌గా కోత విధించారు. కారణం తెలియదుగానీ దాదాపు 300 గదులకుపైగా తగ్గిపోయాయి.

ఎలాంటి సిఫార్సులు అవసరం లేకుండా సెంట్రల్‌ రిసెప్షన్‌ ఆఫీస్‌ (సిఆర్‌ఓ)లో గదులు కేటాయిస్తుంటారు. సామాన్య భక్తుల కోసం కేటగిరి-ఎలోని గదులు 3,667 (రూ.50, రూ.100 అద్దె); కేటగిరి-బిలోని గదులు 347 (రూ.150, రూ.200, రూ.250, రూ.500) కేటాయించారు.

అయితే…గత కొంతకాలంగా కేటగిరి-బిలోని గదులు దాదాపుగా భక్తులకు ఇవ్వడం లేదు. రూ.150, రూ.200, రూ.250 గదులు అడపాదడపా అయినా ఇస్తుండగా…రూ.500 అద్దె ఉన్న గదులు ఒకటి కూడా ఇవ్వడం లేదు.

కేటగిరి-ఎలోని గదుల్లో వేడినీళ్లు రావు. బయట ఎక్కడో వస్తే అక్కడి నుండి బక్కెట్లతో పట్టుకొచ్చి స్నానం చేయాలి. అద్దె వంద రూపాయలు ఎక్కువైనా కేటగిరి-బి గదుల్లో వేడినీటి సదుపాయం ఉంటుంది. అందుకే భక్తులు వేడినీళ్లు వచ్చే గదులు కావాలని అడుగుతుంటారు. ఏమయిందోగానీ దాదాపు 20 రోజుల నుంచి ఈ కేదులు సిఆర్‌వోలు ఇవ్వడం లేదు. అసలు కంప్యూటర్లలో గదులు కనిపించడం లేదు.

ఇక మరో సమస్య కూడా ఉంది. గదుల అద్దెను స్వైపింగ్‌ పరికరాల ద్వారానే వసూలు చేయాలని, నగదుగా తీసుకోవొద్దని అక్కడి అధికారులు అదేశించినట్లు సిబ్బంది చెబుతున్నారు. దీనివల్ల స్వైపింగ్‌ కార్డులు లేనివారు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. స్వైపింగ్‌ అనేది అదనపు అవకాశంగా ఉండాలి తప్ప…అదే ఏకైక చెల్లింపు పద్ధతిగా మార్చితే ఎలాగని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఈ సమస్యలను అక్కడి సిబ్బంది సంబంధిత డిప్యూటీ ఈవో దృష్టికి తీసుకెళ్లినా….’అవన్నీ మీకొద్దు…కంప్యూటర్‌లో కనిపించిన రూమ్స్‌ ఇచ్చి పంపించండి…ఇలాంటివన్నీ నాకు చెప్పద్దు’ అంటూ కొట్టిపారేస్తూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ రెండు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

– ధ‌ర్మ‌చక్రం ప్ర‌తినిధి, తిరుమ‌ల‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*