తిరుమలలో హాకర్‌ లైసెన్సులు…రూ.8 కోట్ల దందా!

నిత్యం వేలాది మంది యాత్రీకులు వచ్చే తిరుమలలో దుకాణమే అవసరం లేదు…చేతుల్లో నాలుగు దేవుడి పటాలు, కాశీదారాలను తగిలించుకుని, వీధుల్లో తిరుగుతుతూ అమ్ముకునే హాకర్‌ లైసెన్సు ఉంటే చాలు…రోజూ వేల రూపాయలు జేబులో వేసుకోవచ్చు. లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోవచ్చు. అందుకే దుకాణాలు, హాకర్‌ లైసెన్సులు సంపాదించడం కోసం సిఎం కార్యాలయం స్థాయిలో పైరవీలు సాగుతుంటాయి. అలా సాగిన పైరవీలు ఫలించి 170 మందికి కొత్తగా హాకర్‌ లైసెన్సులు ఇవ్వడానికి రంగం సిద్ధమయింది. దీనిమాటున కొందరు రాజకీయ నాయకులు, అధికారులు కలిసి రూ.8 కోట్లకుపైగా దండుకుంటున్నట్లు సమాచారం.

తిరుమల శ్రీవారి ఆలయం ముందు, అన్నప్రసాద వితరణ కేంద్రం, నడకదారి తదితర ప్రాంతాల్లో అనధికారికంగా (హాకర్‌ లైసెన్సులు లేకుండా) వ్యాపారం చేస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. ఈ హాకర్లు వ్యాపారంలో తలెత్తే విభేదాలతో తిరుమల ఆలయం ముందే ఘర్షణకు దిగిన ఉదంతాలున్నాయి. ఇలా వ్యాపారం చేసేవారికి రాజకీయ పార్టీల నేతల అండదండలు ఉండటతో మరింతగా రెచ్చిపోయేవారు. దీన్ని గమనించిన….ఇటీవలే బదిలీ అయిన సివిఎస్‌వో ఆకే రవికృష్ణ అనధికార హాకర్లను ఏరిపారేశారు. ఇటువంటి వారిని నడకదారి నుంచి శ్రీవారి ఆలయం దాకా ఎక్కడా అడుగుపెట్టకుండా చేశారు. తిరుపతికి చెందిన కొందరు అధికార పార్టీ నేతలు నేరుగా సివిఎస్‌వోను కలిసి…హాకర్లను వదిలేయాలని డిమాండ్‌ చేశారు. అయినా దానికి ఆయన తలొగ్గలేదు. 8 నెలలకే రవికృష్ణ బదిలీ అవడానికి హాకర్ల వివాదమూ ఓ కారణమని చెబుతారు.

టిటిడి అధికారుల స్థాయిలో పని కాదనుకున్న హాకర్లు…రాజకీయ నేతల సాయంతో ముఖ్యమంత్రి కార్యలయం స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అధికార పార్టీ నేతలే కావడంతో ప్రభుత్వ పెద్దలూ తలొగ్గారు. అనధికారిక హాకర్లకు లైసెన్సులు మంజూరు చేయాలని టిటిడి ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో 170 మందికి హాకర్‌ లైసెన్సులు రాబోతున్నాయి. ఈ లైసెన్సుల పేరుతో ఒకొక్కరి నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. అంటే రూ.8 కోట్లుకుపైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో నాయకులు, టిటిడిలోని కొందరు అధికారులకు వాటాలున్నాయి.

ఒకప్పుడు తిరుమలలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించిన వారికి ఆ తరువాత టిటిడి అధికారికంగా లైసెన్సులు ఇచ్చింది. బాలసుబ్రమణ్యం జెఈవోగా ఉండి వెళ్లిపోయేనాటికి తిరుమలలో 350 హాకర్‌ లైసెన్సులుండేవి. ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి…మరో 400 లైసెన్సులు దాకా ఇచ్చింది. అప్పుడే భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతానికి మొత్తం 730 లైసెన్సులున్నాయి. కొత్తగా 170 లైసెన్సులు చేరితే…మొత్తం 900 దాకా అవుతాయి.

ఒకసారి హాకర్‌ లైసెన్సు దక్కించుకుంటే చాలు…సొంతంగా వ్యాపారం చేయలేకున్నా…ఎవరికో ఒకరికి ఆ లైసెన్సు అద్దెకు ఇవ్వొచ్చు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా అద్దె రూపంలో తీసుకోవచ్చు. తిరుమలలో లైసెన్సు ఉంటే టిటిడిలో ఉద్యోగం ఉన్నట్లే. అందుకే లైసెన్సు కోసం ఎన్ని లక్షలైనా ఇవ్వడానికి వెనుకాడటం లేదు. మరోవైపు ఈ లైసెన్సులతో ఎవరెవరినో తీసుకొచ్చి వ్యాపారం చేయిస్తుంటారు. దీంతో తిరుమలలో అనధికారిక వ్యక్తులు పెరిగిపోతున్నారని అక్కడి వ్యాపారులే వాపోతుంటారు. ఇది తిరుమల భద్రతకు ప్రమాదమన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయినా ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు తమ అనుచరులకు లైసెన్సులు ఇప్పించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*