తిరుమల ఆలయాన్ని దండయాత్రల నుంచి రక్షించిందెవరు..?

ఒకనాడు మహ్మదీయ పాలకులు సంపద కోసం హుందీ దేవాలయాలపైన దండయాత్రలు సాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలయాల్లోని విలువైన శిల్పాలనూ ధ్వసం చేశారు. అయితే…. తిరుమల ఆలయంపైన మాత్రం అలాంటి దండయాత్రలు, దాడులు జరిగిన ఉదంతాలు కనిపించవు. దానికి కారణాలు లేకపోలేదు. బంగారు గుడ్డుపెట్టే బాతును ఒక్కసారిగా కోసుకు తినాలని ఎవరూ అనుకోరు. అటువంటి కోడిని ఇంకా బాగా పోషిస్తారు. తిరుమల ఆలయం విషయంలోనూ అదే జరిగింది. ఎవరు పాలకులుగా ఉన్నా….భక్తులు విరివిగా సమర్పిస్తున్న కానుకలను దక్కించుకోవడం కోసం ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు.

కీ.శ.1686లో చివరి మొగలాయి చక్రవర్తి అయిన ఔరంగజేబు దక్షిణాదిలోని మహ్మదీయ రాజ్యాలను జయించాడు. హైదరాబాద్‌ నిజాం రాజ్యము, కర్నాటక నవాబు రాజ్యము అలా స్థాపించబడినవే. తిరుపతి ప్రాంతం కర్నాటక నవాబుల పరిధిలోకి వెళ్లింది. కీ.శ.1750లోనే తూర్పు ఇండియా కంపెనీ శ్రీవారి ఆలయ ఆదాయాన్ని కర్నాటక నవాబుల నుంచి గుత్తకు తీసుకుంది. అందువల్ల ఆలయాన్ని, ఆలయ ఆదాయాన్ని రక్షించుకోవడం వారి బాధ్యత అయింది. ఈ క్రమంలోనే కీ.శ.1753లో మహ్మద్‌ కమాల్‌ అనే రాజు దండయాత్ర చేయగా అంగ్లేయులు ప్రతిఘటించారు. కీ.శ.1757లో మహ్మద్‌ ఆలీ సోదరుడు నజీబుల్లా అన్నపైన తిరగబడి శ్రీకాళహస్తి, కార్వేటినగరం జమీందార్లను దోచుకున్నాడు. ఆగస్టు నెలలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చి ఆ ఆదాయాన్ని దోచుకోవాలనుకున్నాడు. దీన్ని పనిగట్టిన ఆంగ్లేయులు అతన్ని అడ్డుకున్నారు.

కీ.శ.1758 సెప్టెంబర్‌లో (బ్రహ్మోత్సవాల సమయం) మెరచిన్‌ అనే ఫ్రెంచి అధికారి నెల్లూరు నజీబుల్లా, చంద్రగిరి అబ్దుల్‌ వహాబ్‌ సేనలతో తిరుమలకు వచ్చాడు. స్వామివారి హుండీ దోచుకోవాలను కున్నాడట. అయితే….ఆలయ కాంట్రాక్టరుగా ఉన్న వ్యక్తి తానే స్వయంగా కొంత డబ్బులు చెల్లించడంతో అతను వెనుదిరిగాడట.

కీ.శ.1782 జనవరిలో చంద్రగిరి కోటను హైదరాలీ ముట్టడించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అదే సమయంలో శ్రీనివాసమంగాపురం, తొండవాడ తిమ్మప్ప ఆలయం, అగస్తేశ్వరాలయం, తిరుపతిలోని అచ్యుతరాయపురం, యోగిమల్ల వరంలోని పరాశరేశ్వరాలయాలను కొల్లగొట్టాడు. అయితే తిరుమల ఆలయం జోలికి వెళ్లలేదు. కీ.శ.1782 నుంచి కీ.శ.1784 దాకా హైదరాలీ తరపున శ్రీవారి ఆలయాన్ని అతని ప్రతినిధి అయిన ఆనిగాళ్ల నరసయ్య అనే వ్యక్తి నిర్వహించినట్లు రికార్డుల్లో ఉంది. అంటే ఆ కాలంలో వచ్చిన ఆదాయం హైదరాలీకి చేరినట్లే అనుకోవాలి.

శ్రీవారి ఆలయాన్ని దక్కించుకోవడం కోసం రెండు సేనల మధ్య తిరుమలలో యుద్ధం జరిగిన ఉదంతాలూ చరిత్రలో కనిపిస్తున్నాయి. కీ.శ.1759లో మహారాష్ట్ర యోధులు గోపాలరావు, నారాయణరావు తిరుమలను దోపిడీ చేయడానికి వచ్చారు. తిరుమలకు చేరమునుపే గోపాలరావు వెనుదిరిగాడు. సేనలను నారాయణరావుకు అప్పగించాడు. ఈ సేనలు కరకంబాడికి చేరుకుని, చిన్నపాళేగారును ఆశ్రయించాడు. పాలేగారు సేనలు కూడా కలిసి కరకంబాడి కొండల్లో ప్రయాణం చేసి జూన్‌ 30వ తేదీ రాత్రికి రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అప్పటికే ఆలయం నిజాం దత్తమండలాల కింద కీ.శ.1750లోనే ఈ ప్రాంతం (తిరుమల సహా) ఆంగ్లేయుల వశమయింది. ఆంగ్లేయుల నుంచి తిరుమల ఆలయాన్ని కౌలుకు తీసుకున్న కౌలుదారుని సేనలు తిరుపతిలో ఉన్నాయి. అయితే…తిరుమలలో తిష్టవేసిన మరాఠా, కరకంబాడి పాళేగారు సేనలను ఎదుర్కోగల శక్తి కౌలుదారుని సేనలకు లేదు. 8.07.1759లో మద్రాసు నుంచి మేజర్‌ కలియడ్‌ నాయకత్వంలో 500 మంది సేనలు తిరుపతికి వచ్చాయి. అయితే అందులో ఎక్కువ మంది తిరుమల కొండ ఎక్కడానికి అనర్హలు (సంప్రదాయం ప్రకారం). కేవలం 80 మందికి మాత్రమే తిరుమలకు వెళ్లే అర్హత ఉందట. ఆ రెండో రోజే పాలేగాడి సైన్యం, మద్రాసు నుంచి వచ్చిన ఆంగ్లేయుల సైన్యాన్ని చుట్టుముట్టాయి. రాత్రి కొంతసేపు పోరాడిన ఆంగ్లేయుల సైన్యం వెనక్కి వెళ్లిపోయిందట. రెండోసారి కూడా పోరాడే ప్రయత్నం చేశారు. కానీ సఫలం కాలేదు.

ఆ క్రమంలో మరోదాడిలో మేజర్‌ కలియడ్‌ తన సైన్యంతో కరకంబాడిని ముట్టడించి పాలేగారు విడిదికి నిప్పుపెట్టారట. పాలేగాడు చనిపోయాడు. ఆ తరువాత తిరుమల ఆలయ కౌలుదారు సైన్యం తిరుమలకు చేరుకుని నారాయణరావును, అతని సైన్యాన్ని శ్రీవారి ఆలయం నుంచి తరిమేశాయట. ఈ యుద్ధంలో తిరుమల కర్తసిక్తం అయిందట.

గమనిక : ఇదంతా తిరుమల, తిరుపతిలో లభించిన శాసనాల్లో లభించిన సమాచారమే.

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*