తిరుమల కల్యాణకట్టలో అనకొండ!

తిరుమల శ్రీవారి కల్యాణకట్టలోకి ఓ ‘అనకొండ’ ప్రవేశించింది. క్షురకుల ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయిస్తానంటూ నాయీబ్రాహ్మణ సంఘం నేత ఒకరు దందా సాగిస్తున్నారు. ఏకంగా కోటి రూపాయల వసూలుకు పూనుకున్నారు. టిటిడి క్షురకుల్లో చర్చనీ యాంశంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే…
దేవాలయాలకు అనుబంధంగా ఉన్న కల్యాణకట్టల్లో పనిచేస్తున్న క్షురకులు ఇటీవల ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమను ఉద్యోగులుగా గుర్తించాలంటూ కత్తి పక్కన పెట్టి సమ్మె చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం క్షురకులతో చర్చలు జరిపింది. ఉద్యోగులుగా గుర్తించలేమని చెబుతూ….గుండు గీసినందుకు ఇచ్చే పారితోషికాన్ని పెంచింది. ఒక్కో గుండుకు రూ.25 దాకా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.
ఇదిలావుండగా….టిటిడిలోనూ వందల మంది క్షురకులు పని చేస్తున్నారు. రెగ్యులర్‌, పీస్‌రేట్‌, శ్రీవారి సేవ ఇలా మూడు కేటగిరీల కింద పనిచేస్తున్నవారు ఉన్నారు. ఆ మధ్య దాదాపు వంద మంది క్షురకులు కోర్టును ఆశ్రయించి…తమ సర్వీసులను రెగ్యులర్‌ చేయాలని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే టిటిడి దాన్ని అమలు చేయలేదు. అప్పీలుకు వెళ్లింది. అదేవిధంగా ఇక్కడ పీస్‌ రేట్‌పైన పని చేస్తున్న వారికి ఒక్కో గుండుకు రూ.11 మాత్రమే ఇస్తున్నారు. ఇది దేవాదాయ శాఖ ఆలయాల్లో ఇస్తున్నదానితో పోల్చితే తక్కువగా ఉంది. ప్రభుత్వం మొన్న చిన్న ఆలయాల్లో పీస్‌రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తరువాత…తమకు కూడా పీస్‌ రేట్‌ పెంచాలని టిటిడి క్షురకులు కోరుతున్నారు.
ఈనేపథ్యంలో….నాయీబ్రాహ్మణ సంఘం నేత శ్రీవారి కల్యాణకట్టలోకి ప్రవేశించారు. కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నవారిని, తెచ్చుకోనివారిని రెగ్యులర్‌ చేయిస్తానంటూ….ఒకొక్కరి వద్ద రూ.75 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు రూ.25 వేల నుంచి రూ.50 వేల దాకా సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. కోర్టు కేసులు, ప్రభుత్వంలో పైరవీల పేరుతో కోటి రూపాయల వసూలు చేయడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల క్షురకులు ఆందోళన సందర్భంగా ముఖ్యమంత్రిని కలవడం, అక్కడ సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, దానిపైన చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తరువాత కొందరు క్షరకులు వెళ్లి క్షమాపణ చెప్పడం…ఇవన్నీ తెలిసిన విషయాలే. అప్పుడు క్షురకులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి క్షమాపణ చెప్పించడంలో కీలక పాత్ర పోషించిన నాయీబ్రాహ్మణ సంఘం నేత తన పలుకుబడి గురించి గొప్పగా చెప్పుకుంటూ….తిరుమల దందాకు పూనుకున్నట్లు తెలుస్తోంది.
ప్పటికే చాలాకాలంగా చాలీచాలని జీతాలలో జీవితాలు సాగిస్తున్న క్షురకులు ఆ నాయకుడు అడిగిన రూ.75 వేలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అప్పోసప్పో చేసి ఆయన చేతుల్లో పోస్తున్నారు. ఆ నేత కూడా…ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రికి ఏదోఒకటి చెప్పి…రెగ్యులర్‌ చేయించవచ్చన్న నమ్మకంతోనే డబ్బులు దండుకుం టున్నట్లు తెలుస్తోంది. ఇందులో క్షురకులు గమనించాల్సిన విషయం ఏమంటే….ఎవర్నీ రెగ్యులరైజ్‌ చేసే ఉద్దేశం టిటిడికి లేదు. కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్న ఫారెస్టు కార్మికులనూ పట్టించుకోవడం లేదు. ఎవరో చెప్పింది నమ్మి డబ్బులు సమర్పించుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

2 Comments

  1. డతచేసి ఏవ్వరూ డబ్బులు ఇవ్వకండి – – మోసగాళ్ల బారిన పడకండి పైరవీలతో పనులు కావు.పోరాడితే నే సాధించుకోగలరు

    • డబ్బులిచ్చి మోసపోకుండా ఉండండి.పైరవీల తో పనులు కావు- – – పోరాడితే సాధించుకోగలరు ఆ దిశ గా ప్రయతం చేయ్యండీ

Leave a Reply

Your email address will not be published.


*