తిరుమల జెఈవో శ్రీనివాసరాజు క్రైస్తవుడా?!

తిరుమల జెఈవోగా ఏడేళ్లుగా పని చేస్తూ, మరో రెండేళ్ల పాటు ఇక్కడే కొనసాగడానికి ఉత్తర్వులు పొందిన శ్రీనివాసరాజునూ క్రైస్తువుడిగా పేర్కొంటున్నారు విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌ నేతలు. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను టిటిడి ఛైర్మన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సంఘాల నాయకులు హైదరాబాద్‌లో ఛలో రాజ్‌భవన్‌ నిర్వహించారు. అయితే పోలీసులు వీరిని మార్గమధ్యంలోనే ఆపేశారు. ఐదుగురు నాయకులను మాత్రమే గవర్నర్‌ వద్దకు పంపారు. హిందూయేతర మత కార్యక్రమాల్లో పాల్గొన్న సుధాకర్‌ యాదవ్‌ను ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌ను కోరారు. ఆశ్చర్యకరంగా జెఈవో శ్రీనివాసరాజు విషయాన్ని ఆ నాయకులు ప్రస్తావించారు. ఆయన కూడా క్రైస్తవుడని, ఆయన్ను తిరుమలలో కొనగించడానికి వీల్లేదని అన్నారు. వాస్తవంగా ఆయన గత ఏడేళ్లుగా తిరుమలలో జరిగే అన్ని వైదిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఏ ఆధారాలతో శ్రీనివాసరాజును హిందూయేతరుడని ఆరోపించారోగానీ…ఇది కొత్త వివాదమే. ఇప్పటిదాకా ఎవరూ శ్రీనివాసరాజు విషయంలో హిందూయేతరుడని ఆరోపించలేదు. ఆయనపైన మతపరమైన ఆరోపణలు ఇప్పటిదాకా లేవీ. అయితే…ఏ ప్రభుత్వం వచ్చినా తన పలుకుబడిని ఉపయోగించుకుని తిరుమలలోనే జెఈవోగా కొనసాగుతున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికే ఆయన ఏడేళ్లుగా తిరుమలలో పని చేస్తున్నారు. మరో రెండేళ్లు పొడిగిస్తూ నాలుగు రోజుల క్రితమే ఉత్తర్వులు వచ్చాయి. సాధారణంగా ఐఏఎస్‌లను రెండు మూడేళ్లలో మార్చేస్తుంటారు. గతంలో బాలసుబ్రమణ్యం తిరుమల జెఈవోగా అత్యధిక కాలం పని చేశారు. ఇప్పడు శ్రీనివాసరాజు ఆ రికార్డును తుడిచేసే దిశగా పయనిస్తున్నారు.

ఇదిలావుండగా మత ఛాందసులు కొందరు పనిగట్టుకుని తిరపతిలో అలజడి సృష్టించాలని మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. తిరుమలో అన్యమత ప్రచారం అంటూ తరచూ హడావుడి చేసే ఈ ఛాందసులు…టిటిడిలో హిందూయేతర ఉద్యోగులున్నారని కొంతకాలం గొడవ చేశారు. సుధాకర్‌ యాదవ్‌ను ఛైర్మన్‌గా నియమించకూడదని గోల చేశారు. ఇప్పుడు శ్రీనివాసరాజునూ తీసుకొచ్చారు. నుదుట నామం, మెడలో స్వామివారి కండువాతో కనిపిస్తుంటారు. ఇలాంటి వారిపైనా అన్యమతస్తులనే ముద్ర వేస్తున్నారు. దీనిపై జెఈవో ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే…ఇలాంటి మత ఛాందస శక్తుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*