తిరుమల జెఈవో శ్రీనివాసరాజు సింగపూర్‌ పర్యటనకు బ్రేక్‌!

టిటిడి తిరుమల జెఈవోగా పని చేస్తున్న శ్రీనివాసరాజు సింగపూర్‌ వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇందుకోసం ఆయనకు మంజూరు చేసిన సెలవును రద్దు చేసింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్‌, ఇండోనేషియా వెళ్లడం కోసం తనకు 02.07.2018 నుంచి 13.07.2018 దాకా సెలవు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు 19.06.2018న సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం 19.06.2018న జీవో ఆర్‌టి నెం. 1338 ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతలోనే ఏమయిందోగానీ…విదేశీ పర్యటన కోసం శ్రీనివాసరాజుకు మంజూరు చేసిన సెలవును రద్దు చూస్తూ 29.06.2018న జీవోఆర్‌టి నెం. 1436 ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. సాధారణంగా ఐఏఎస్‌ అధికారులుగానీ, ప్రభుత్వ ఉద్యోగులుగానీ విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. శ్రీనివాసరాజు కూడా అదే విధంగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. అయితే…ఇంతలోనే ఎందుకు రద్దు చేసిందనేది ప్రశ్న.

ఇక్కడే కీలకమైన అంశాన్ని గుర్తు చేసుకోవాలి. టిటిడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల నేరుగా శ్రీనివాసరాజుపైనే ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆలయంలో విలువైన ఆభరణాలు మాయయ్యాయని చెబుతూ….శ్రీనివాసరాజు పేరు ప్రస్తావించారు. పురాతన విగ్రహాలు, ఆభరణాలు వంటి వాటికి సంబంధించిన డీలర్లు, ఏజెంట్లు సింగపూర్‌లోనే ఉంటారని, శ్రీనివాసరాజు తరచూ సింగపూర్‌ వెళ్లివస్తుంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరాజు సింగపూర్‌ పర్యటనకు వెళితే….అనుమానాలు తివ్రమయ్యే అవకాశాలున్నాయి. అందుకే ప్రభుత్వం ముందుజాగ్రత్తగా సెలవు రద్దు చేస్తూ, సింగపూర్‌ పర్యటనకు బ్రేకులు వేసిందని అనుకోవాలి.

ఇప్పటికే టిటిడిలో ఆభరణాల వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లింది. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ఇద్దరు వ్యక్తులు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా….జ్యుడిషియల్‌ విచారణ ద్వారా ఆభరణాలను తనిఖీ చేసి అనుమానాలను నివృత్తి చేయాలని హైకోర్టుకు లేఖ రాసింది. విచారణ కోసం న్యాయమూర్తిని నియమించమని అభ్యర్థించింది. ప్రజాప్రయోజనాల వ్యాజ్యం మంగళవారం హైకోర్టులో విచారణకు రానుంది. మరోవైపు సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టులో కేసు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో టిటిడిలోని కీలకమైన అధికారి విదేశీ పర్యటనకు వెళితే, దానికి ప్రభుత్వం అనుమతి ఇస్తే విమర్శలు వెల్లువెత్తే ప్రమాదముంది. దీన్ని గమనించే శ్రీనివాసరాజు సెలవును రద్దు చేసిందని అనుకోవాలి. అయితే…ఇంకో విదేశీపర్యటన కోసం కాకుండా….దేశంలోపలో వ్యక్తిగత పనుల కోసం ఆయనక 04.07.2018 నుంచి 07.07.2018 దాకా సెలవు మంజూరు చేసింది. ఈ మేరకు జీవోఆర్‌టి నెం.1432ను 29.06.2018ను విడుదల చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*