తిరుమల దర్శనాల రద్దుపై మీనమేషాలు ఎందుకు..! సిఎం చొరవ తక్షణ అవసరం..!!

తిరుపతిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కొంతకాలం రద్దు చేయాలని వస్తున్న డిమాండ్ పై తిరుమల తిరుపతి దేవస్థానం మీనమేషాలు లెక్కిస్తోంది. అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ఇప్పటిదాకా నిర్ణయం వెలువడలేదు.

ఇప్పటికే తిరుపతిలో 1500 వందల మంది దాకా కరోనా బారిన పడ్డారు. టీటీడీలో 160 మంది కరుణతో బాధపడుతున్నారు. ఇందులో అర్చకులూ 20 మంది ఉన్నారు. తిరుమల ఆలయ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించే పెద్ద జీయర్ స్వామికి కూడా కరోనా సోకింది. సీనియర్ అర్చకుడు ఒకరిని మెరుగైన చికిత్స కోసం చెన్నై కి తరలించారు. మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ చూసి ఉద్యోగులు, అర్చకులు బెంబేలెత్తి పోతున్నారు. దర్శనాలను రద్దు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హారతి ఇస్తున్నది టిటిడి మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు. ఆయన కరోనాతో మరణించారు.

భక్తుల వల్ల ఉద్యోగుల గాని, ఉద్యోగుల భక్తులకుగానీ కరోనా సోకలేదని టీటీడీ అధికారులు చెబుతున్నప్పటికీ…. స్థానికులు, ఉద్యోగులు ఈ వాదనను నమ్మడం లేదు. తిరుమల దర్శనాల కోసం వస్తున్న వారివల్లే తిరుపతిలో కరోనా పెరుగుతుందన్న భావన ఉంది.

జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా తిరుపతి, తిరుపతి గ్రామీణ మండలాల్లోనే నమోదవుతున్నాయి. భక్తుల వల్లే టిటిడి ఉద్యోగులు కరోనా బారినపడ్డారంటూ పోలీసులు ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే దీన్ని జిల్లా ఎస్పీ ఖండించారు.

ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయటం ఎలాగని ఉద్యోగులు, అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకులూ వ్యాధి బారిన పడటంపై టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ…దర్శనాలపై సమీక్షిస్తామని చెప్పారు. ఈ మాట చెప్పి మూడు రోజులైనా ఇప్పటి దాకా నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని దర్శనాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు, అర్చకులు, స్థానికులు కోరుతున్నారు. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*