తిరుమల లడ్డూ తయారీకి మంటలురాని పొయ్యిలు..!

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తిరుమల శ్రీవారి లడ్డూ పోటులో (బూందీపోటులో) తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ నిరంతరం గ్యాస్‌ పొయ్యిలపై, పెద్దపెద్ద పెనాలలో (కడాయి) నెయ్యి మరుగుతూ, అందులో బూందీ వేగుతూ ఉంటుంది. సలసల మసిలే నెయ్యి ఆవిరై పోటు గోడలకు, పైకప్పునకు జిడ్డులా పేరుకుంటుంది. పొయ్యిలో మంట ఎక్కువైనపుడు ఈ జిడ్డు అంటుకుని అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిడ్డును నెలలో రెండుసార్లు శుభ్రం చేస్తున్నా ప్రమాదాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పోటులోకి అధునాతన పొయ్యిలను తీసుకురానున్నారు. మంటలు రాని పొయ్యిపైన బూందీ తయారు చేయనున్నారు.

మనం ఇళ్లలో ఉపయోగించే గ్యాస్‌ స్టవ్‌ల వంటివే…కాస్త పెద్ద పరిమాణంలో ఉండేవాటిని శ్రీవారి పోటులో వినియోగిస్తున్నారు. బూందీపోటును ఆధునీకరించే క్రమంలో టిటిడి అధికారులు చెన్నైలోని అడయార్‌ స్వీట్‌ ఫ్యాక్టరీని పరిశీలించారు. అక్కడ మంటలు రాని స్టవ్‌లను వినియోగిస్తున్నారు. అలాంటి వాటినే తిరుమల పోటులోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

తిరుమలలోని బూందీ పోటును రూ.21.75 కోట్లతో ఆధునీకరించాలని ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించారు. ఇందులో భాగంగా పోటులో ‘థర్మో ఫ్లూయిడ్‌ హీటర్స్‌’ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. థర్మో ఫ్లూయిడ్‌ హీటర్లు అంటే…..మంటలు కనిపించకుండానే ఉష్ణాన్ని (హీట్‌) పుట్టిస్తుంది. హీటర్‌లో ఉత్పత్తి అయ్యే ఉష్టం సన్నటి పైపుల ద్వారా స్టవ్‌కు చేరుతుంది. స్టవ్‌ చుట్టూవుండే పైపులు వేడెక్కుతాయి. తద్వారా స్టవ్‌పైన ఉంచిన కబాయి వేడెక్కుతుంది. గంటకు 15 కిలో కేలరీల ఉష్ణాన్ని ఉత్తతత్తి చేయగల రెండు భారీ థర్మో ఫ్లూయిడ్‌ హీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ హీటర్లలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడానికి….గ్యాస్‌నుగానీ, డీజిల్‌గానీ, కరెంటుగానీ, కొయ్యిగానీ, బొగ్గుగానీ వినియోగించడానికి వీలైనవి ఉన్నాయి. ఈ హీటర్లతో పాటు ఉష్ణ బదిలీ ద్వారా వేడెక్కే ప్రత్యేక కడాయిలనూ తీసుకురానున్నారు. ఇటువంటివి కడాయిలు 45 ఏర్పాటు చేయనున్నారు.

ఈ అధునాతన స్టవ్‌ల వల్ల పోటులో పనిచేసే కార్మికులకూ కాస్త ఉపశమనం లభిస్తుంది. గ్యాస్‌ పొయ్యిల నుంచి వచ్చే మంటలు, జ్వాలల వల్ల స్టవ్‌ చుట్టూ విపరీతమైన వేడి ఉంటుంది. ఆ పరిసరాల్లో పని చేయడం కార్మికులకు కష్టమే. గ్యాస్‌ స్టవ్‌లతో పోల్చితే….థర్మో ఫ్లూయిడ్‌ హీటర్‌ స్టవ్‌ వద్ద వేడి పెద్దగా ఉండదు. పైపులలో ఉండే వేడి….కడాయికి బదిలీ అవుతుంది తప్ప… వాతావరణంలోకి పెద్దగా రాదు. అందువల్ల స్టవ్‌ పరిసరాల్లో వేడి ఉండదు. ఈ విధంగా పోటు కార్మికులకు మేలు జరగనుంది.

ఇంకా బూందీ పోటులో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని అధునాతన పరికరాలు ఏర్పాటు చేయబోతున్నారు. బూందీపోటే ఆధునీకరిస్తే… అగ్నిప్రమాదాలకు దాదాపుగా చెక్‌పెట్టినట్లే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*