తిరుమల లడ్డూపై సబ్సిడీ రద్దు అన్యాయమా…! అధర్మమా…!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధర పెరుగబోతోందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. లడ్డూలపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీ తొలగిస్తారని, ప్రతి భక్తునికి ఒక లడ్డూ మాత్రం ఉచితంగా ఇస్తారని, అదనపు లడ్డూలు కావాల్సివస్తే రూ.50 వంతున కొనుగోలు చేయాల్సివుంటుందన్నది మీడియా కథనాల సారాంశం. ఇంతలోనే టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి జోక్యం చేసుకుని, లడ్డూల ధర పెంచే ఆలోచన ఏదీలేదని చెప్పారు.

తిరుమల శ్రీవారి లడ్డూ లడ్డూలపైన పలు రకాల రాయితీలు అమల్లో ఉన్నాయి. కాలినకడకన దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు. రూ.10 వంతున రెండు లడ్డూలు, రూ.25 వంతులన రెండు లడ్డూలు ఇస్తారు. సర్వదర్శనానికి వెళ్లే వారికి రూ.10 వంతున రెండు, రూ.25 వంతున రెండు లడ్డూలు ఇస్తున్నారు.

ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి వెళ్లే వారికి, రూ.500 బ్రేక్‌ దర్శనానికి వెళ్లే వారికి…ఒకొక్కరికి రెండు లడ్డూలు ఉచితంగా ఇస్తున్నారు. అంతకు మించి అదనపు లడ్డూలు కావాలంటే రూ.50 వంతున కొనుక్కోవాలి. ఇంకా…వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనేవారికి ఉచితంగా లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నారు. టిటిడి ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు నెలకు రూ.5 వంతున 10 లడ్డూలు ఇస్తున్నారు.

తయారీకి ప్రస్తుత ధరల ప్రకారం రూ.40 ఖర్చవుతున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన…కాలినడక భక్తులకు మొత్తం ఐదు లడ్డూలపైన రూ.130 రాయితీ ఇస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు మొత్తం నాలుగు లడ్డూలపైన రూ.90 రాయితీ లభిస్తోంది. ప్రత్యేక దర్శనం, బ్రేక్‌ దర్శనం వారికి ఒకొక్కరికి రెండు లడ్డూలపైన రూ.80 రాయితీ ఇస్తున్నట్లు లెక్క. ఇక టిటిడి ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు నెలకు రూ.5 వంతున 10 లడ్డూలు ఇస్తున్నారు. అంటే ఒకొక్కరికి నెలకు రూ.350 రాయితీ ఇస్తున్నారు.

లడ్డూ ప్రసాదాలపై ఇస్తున్న రాయితీల వల్ల ఏడాదికి రూ.250 కోట్లకుపైగా టిటిడిపై భారం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు మూడున్నర లక్షల లడ్డూలు తయారవుతున్నాయి. దీన్ని ఐదు లక్షల లడ్డూలకు పెంచాలన్నది లక్ష్యం. ఈ మేరకు ఆలయం బయట బూందీపోటు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్పత్తి ఐదు లక్షలకు పెరిగి, ఇదే ధరల్లో విక్రయిస్తే టిటిడిపైన పడే భారం మరింత పెరుగుతుంది.

శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికీ ఒక లడ్డూలు ఉచితంగా ఇచ్చి, మిగతా లడ్డూలను ధరకు విక్రయించాలని టిటిడి ఆలోచిస్తోంది. ప్రతి భక్తునికీ ఒక లడ్డూ ఉచితంగా ఇస్తే….రోజుకు 80 వేల మంది దర్శించుకుంటున్నా రనుకున్నా రోజుకు రూ.32 లక్షలు, ఏడాదికి రూ.116 కోట్లు మాత్రమే భారం పడుతుంది. ప్రస్తుతం అమల్లోవున్న విధానంతో పోల్చితే భారం సగానికి సగం తగ్గుతుంది.

అయితే….లడ్డూలపై రాయితీ ఎత్తేస్తారా, లడ్డూ ప్రసాదాన్ని లాభనష్టాలతో లెక్కిస్తారా, టిటిడి ఏమైనా వ్యాపార సంస్థా, భక్తులకు శ్రీవారి లడ్డూలు దక్కకుండా చేస్తారా… ఇటువంటి ప్రశ్నలతో మీడియా కథనాలు ప్రచురించింది. శ్రీవారి భక్తులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రసాదాల ధర పెంపు ప్రతిపాదన ఏదీ లేదని ఛైర్మన్‌ ప్రకటించాల్సివచ్చింది.

ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారత దేశంలోని ఏ హిందూ ఆలయానికి వెళ్లినా….ప్రసాదం ఇస్తుంటారు. అదీ చిన్న దొనలో కాస్త అన్నప్రాదం పెడతారు. కొన్ని ఆలయాల్లో అదీవుండదు. ఇంటికి ప్రసాదం తీసుకె ళ్లాలంటే కొనుగోలు చేయాల్సిందే. ఎంత లెక్కలు వేసుకున్నా భక్తులకు ఉచితంగా ఇచ్చే ప్రసాదంపైన చేసే ఖర్చు ఒక రూపాయో, రెండు రూపాయలో ఉంటుంది. వంద కోట్ల ఆదాయం వస్తున్న శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి. లడ్డూ ప్రసాదాల వంటి వాటిపైన రాయితీ ఇస్తున్న దాఖలాలు లేవు.

దేశంలోని ఏ ఆలయంలోనూ లేనివిధంగా తిరుమలలో ప్రసాదాల కోసం ఒక్కో భక్తునిపై రూ.90 నుంచి రూ.130 ఖర్చు చేస్తున్నారు. మార్పు చేసే విధానంలో ఈ రాయితీని రూ.40కు పరిమితం (ఒక లడ్డూ పూర్తిగా ఉచితంగా ఇచ్చి) చేయాలని ఆలోచిస్తున్నారు. దీనిపై విమర్శలు వచ్చాయి.

శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ప్రసాదం ఇవ్వబోమని టిటిడి చెప్పడం లేదు. ఒకొక్కరికి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని చెబుతోంది. అంతకు మించి కావాలంటే కొనుగోలు చేయాలంటోంది. ఇది ధర్మంగానే ఉంది. సమస్య ఎక్కడొచ్చిందంటే… అదనపు లడ్డూ రూ.50 అంటున్నారు. తయారీ వ్యయం రూ.40 అయినపుడు… అమ్మకం ధర రూ.50 పెట్టడం భావ్యం కాదు. అదనపు లడ్డూలు కావాల్సివస్తే…..లాభనష్టాల బేరీజు లేకుండా తయారీ ఖర్చుకే అందజేయగలిగితే సరిపోతుంది. అది మరింత ధర్మంగా ఉంటుంది.

ఇక శ్రీవారి లడ్డూ ధర అసలే పెంచకూడదనడం భావ్యం కాదు. టిటిడికి ఈరోజు రూ.3000 కోట్ల ఆదాయం ఉండొచ్చు. ఆదాయం ఉందని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయడం సరైనది కాదు. భక్తులందరికీ అన్నదానం చేస్తున్నారు. దీన్ని తగ్గించమని ఎవరూ చెప్పరు. కానీ లడ్డూ ప్రసాదాలను తయారీ ఖర్చుకు అమ్మడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు.

తిరుమల లడ్డూ ధర పెంచడం ఇదే మొదటి సారి కాదు. ఒకప్పుడు చాలాఏళ్లుపాటు ధర రూ.5గా ఉండేది. కాలక్రమంలో రూ.25కు పెరిగింది. తయారీ ఖర్చు రూ.35 అవుతోందన్న సమయంలో ఈ ధర నిర్ణయించారు. ఇప్పుడు తయారీ వ్యయం రూ.40 అవుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో లడ్డూ ధరను రూ.40 పెంచడం అధర్మమేమీ కాదు. మళ్లీ ఇంకోసారి చెప్పేదేమంటే…లడ్డూ తయారీకి ఎంత ఖర్చవుతుందో అంతే ధరకు విక్రయించాలి.

టిటిడి అంటే….ఒక లడ్డూ ప్రసాదాలు ఇచ్చే సంస్థ మాత్రమే కాదు. టిటిడి నిర్వర్తించాల్సిన బాధ్యతలు అనేకం ఉన్నాయి. విద్యా, వైద్య రంగాల్లో ప్రజలకు విశేషమైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అటువంటి బాధ్యతను నిర్వర్తిస్తోంది కూడా. లడ్డూలపై భారాన్ని తగ్గించుకుంటే ఆ మొత్తాన్ని ఇటువంటి సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేయొచ్చు.

అమాటకొస్తే….టిటిడిలో దుబారాను నివారించాల్సిన అవసరం కనిపిస్తోంది. అవసరమున్నచోట లేనిచోట కల్యాణమండపాలు నిర్మిస్తున్నారు. దీనివల్ల కోట్లు వృథా అవుతున్నాయి. నిర్వహణ భారంగా మారుతోంది. ప్రజాప్రతినిధులు, బోర్డు సభ్యులు తమ మెహెర్బాణీ కోసం ఆయా ప్రాంతాల్లోని ఆలయాలను టిటిడి పరిధిలోకి తెస్తున్నారు. ఎక్కడి ఆలయాలను అక్కడి ప్రజలు నిర్వహించుకోవాలి తప్ప…వాటి బాధ్యతను టిటిడిపైకి నెట్టడం సరైనది కాదు. దీనివల్ల కూడా ఇటీవల కాలంలో టిటిడి భారీగా నిధులు వ్యయం చేయాల్సివస్తోంది.

టిటిడి ఏటా బ్యాంకుల్లో వేస్తున్న డిపాజిట్లు తగ్గిపోతున్నాయి. దీనికి కారణం….ఖర్చులు విపరీతంగా పెరగడమే. ఒకవైపు ఖర్చులు పెరిగిపోతున్న పరిస్థితుల్లో….ఆదాయం పెంచుకోవడం, పొదుపు అలవర్చుకోవడం, దుబారా తగ్గిచడం తప్పనిసరి.

టిటిడిలో నిధులకు కొదవలేదు కాబట్టి అందరూ మాట్లాడొచ్చు. రేపు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటే….ఇప్పుటికే ఉన్న కార్యక్రమాలనూ కొనసాగించలేని పరిస్థితి తలెత్తవచ్చు. అందుకే….లడ్డూ ప్రసాదాల ధరలు పెంచడం, గదుల అద్దె పెంచడం వంటివాటిని తప్పుపట్టలేం. అయితే…దేనికైనా హేతుబద్ధత ఉండాలి. ఏదో వ్యాపారం చేస్తున్నట్లు అనిపించకూడదు. ఏది చేసినా సంస్థ మేలు కోసమే అనే నమ్మకాన్ని భక్తుల్లో కల్పించలగాలి.

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*